ఆగిన..స్థానిక రణం
ABN , First Publish Date - 2020-03-16T11:56:02+05:30 IST
ఎన్నికలు వాయిదా పడడంతో అధికార పార్టీలో కాస్త నిరుత్సాహం అలముకుంది.
కరోనా ఎఫెక్ట్.. ఎన్నికలు వాయిదా
జిల్లాలో నిలచిపోయిన ప్రచారం
అధికార పార్టీలో నిరుత్సాహం
ప్రతిపక్షాల్లో ఉత్తేజం
అమలులోనే ఎన్నికల కోడ్
అధికారులకూ ఊరట
ఇది ఊహించని పరిణామం.. రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు వాయిదా ప్రకటనతో రాజకీయ పక్షాలు ఖంగుతిన్నాయి. అంతా కలగా మారిపోయింది.. నోటిఫికేషన్ ఎంత వేగంగా ఇచ్చారో.. నామినేషన్లు కూడా అంతే వేగంగా వేయించారు. అభ్యర్థులను వెతుక్కోవడానికే నాయకులు తంటాలు పడ్డారు. అంతా ముగిసి ప్రచార పర్వంలో దిగేందుకు ఆదివారం అభ్యర్థులంతా సన్నద్ధమయ్యారు. ఇదిలా ఉండగానే ఎన్నికలు వాయిదా అనే వార్త తెలిసి ఖంగుతిన్నారు.. ఒక్కసారిగా ఎన్నికలు నిలిచిపోవడంతో ఆశ్చర్యానికి లోనయ్యారు. అంతా కలగా ఉందే అంటూ నిరుత్సాహం వ్యక్తం చేశారు.
(తాడేపల్లిగూడెం-ఆంధ్రజ్యోతి):ఎన్నికలు వాయిదా పడడంతో అధికార పార్టీలో కాస్త నిరుత్సాహం అలముకుంది. గెలుపే ధ్యేయంగా దూకుడుతో ఉన్న అధికార పార్టీకి ఎన్నికల కమిషన్ నిర్ణయం కళ్లెం వేసినట్టయ్యింది. అదే సమయంలో ప్రతిపక్షాలు కాస్త ఊపిరి పీల్చుకున్నాయి. పిడుగులా వచ్చిపడ్డ ఎన్నికలను తట్టుకోవడానికి సర్వశక్తులు ఒడ్డుతున్న ప్రతిపక్షాలు ఎన్నిక వాయిదా టానిక్‌లా పనిచేసింది.. అధికార పార్టీని ఎదుర్కోవడానికి తమ శక్తుయుక్తులను ప్రదర్శించవచ్చన్న ఉత్సుకత ప్రతిపక్షాల్లో నెలకొంది. వాస్తవానికి జిల్లా పరిషత్, మండల పరిషత్, పంచాయతీ, మునిసిపల్ ఎన్నికలను నెల రోజుల వ్యవ ధిలోనే నిర్వహించేలా ఎన్నికల సంఘం షెడ్యూల్ ఖరారు చేసింది.
మార్చి 31లోగా ఎన్నికలు నిర్వహించకపోతే ఆర్థిక సంఘం నిధులు మురిగిపోతాయన్న ఉద్దేశంతో ప్రభుత్వం తన ఉద్దేశాన్ని ఎన్నికల సంఘం ముందుంచింది. ఆ మేరకే షెడ్యూల్ ఖరారయ్యింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్‌లు మొదలుకొని ఉపసంహరణ వరకు జిల్లాలోని అన్ని పార్టీలు ముప్పు తిప్పలు పడ్డాయి. అభ్యర్థులను ఖరారు చేయడంలోనూ ఆపసోపాలు పడాల్సి వచ్చింది. కొన్నిచోట్ల అధికార పార్టీ దూకుడుగా వెళితే ప్రతిపక్షాలు డీలా పడ్డాయి. కొన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం, జనసేన పొత్తుతో అభ్యర్థులు ఖరారు చేయడం నుంచి ఎన్నికల ప్రణాళిక నిర్విహించేలా ప్రతిపక్షాలు విజయవంతమయ్యాయి. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి శనివారం ఉపసంహరణ ప్రక్రియ పూర్తయ్యింది. ఆదివారం నుంచే అధికార పార్టీ నేతలు రంగలోకి దిగారు. నియోజకవర్గాల్లో ప్రచార పర్వాన్ని ప్రారంభించారు. జిల్లా అంతటా అధికార పార్టీకి చెందిన నాయకులు నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేశారు.
ప్రచారం చేపట్టారు. ప్రతిపక్ష పార్టీలు కూడా అక్కడక్కడా ప్రచారానికి తెరలేపాయి. తెలుగుదేశం, జనసేన పరస్పర సహకారంతో అనేక నియోజకవర్గాల్లో ఎన్నికల బరిలోకి దిగాయి. అయినా స్వల్ప వ్యవధి ఉండడంతో ప్రతిపక్ష నాయకులు కాస్త ఉక్కిరి బిక్కిరి అయ్యారు. ఉంగుటూరు వంటి నియోజకవర్గాల్లో అధికార పార్టీనుంచి గట్టి ఎదురు దెబ్బతగిలింది. తాము నమ్ముకున్న నాయకులు చేయిచ్చారు. చివరి దశల నామినేషన్‌లు ఉపసంహరించుకున్నారు. జిల్లా వ్యాప్తంగా పదుల సంఖ్యలో ఎంిపీటీసీ అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. ఒకటి రెండు స్థానాలు మినహా మిగిలినవన్నీ అధికార పార్టీ ఖాతాలోకి చేరిపోయాయి. ఇటువంటి పరిణామాలతో తెలుగుదేశం పార్టీ నాయకులు కాస్త ఢీలా పడ్డారు. ఈ నే పథ్యంలో ఎన్నికల కమిషన్ కరోనా వైరస్ కారణంగా ఆరువారాల పాటు ఎన్నికలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.
నిర్ణయం వెలువడకముందే ఆచంట, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, తణుకు, భీమవరం తదితర నియోజకవర్గాల్లో అధికార పార్టీ నాయకులు ప్రచారాన్ని ప్రారంభించారు. నేతలు ముందుగానే సిద్ధం చేసుకున్న ప్రచార రధాలతో ఊరూవాడా తిరిగారు. అంతలో ఎన్నికల వాయిదా నిర్ణయం తెలియడంతో ప్రచారాన్ని నిలిపివేశారు. దీనిపై అధికార, ప్రతిపక్ష పార్టీల్లో భిన్నాభి ప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గెలుపు విశ్వాసంతో ఉన్న అధికార పార్టీ శ్రేణులకు వాయిదా నిరుత్సాహానికి గురిచేసింది. ఎన్నికలు ఎప్పుడు జరిగినా గెలుపు తమ వైపే ఉంటుందంటూ అధికార పార్టీ శ్రేణులు విశ్వాసంతో ఉన్నాయి. వాయిదా వల్ల లోపాలను సరిదిద్దుకుని అధికార పార్టీకి ధీటుగా ఎన్నికల్లో తలపడేందుకు వాయిదా తమకు అనుకూలంగా ఉంటుందని ప్రతిపక్షాలు విశ్వసిస్తున్నాయి. ఎన్నికల కమిషన్ నిర్ణయంతో ప్రతిపక్షాల్లో ఒకింత ఉత్సాహం కనిపిస్తోంది.
అధికారులకు ఊరట
ఎన్నికల వాయిదాతో అధికారులకు ఊరట లభించినట్టయ్యింది. ఒకవైపు ఎన్నికల నియమావళిని అమలు చేయాలి. మరోవైపు ఎన్నికల ప్రక్రియను సమర్ధవంతంగా నిర్వహించాలి. ఒకేసారి అన్ని స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించడం ఇదే తొలిసారి కావడంతో అధికారులు కాస్త ఒత్తిడికి లోనయ్యారు. అదికూడా నెలరోజుల వ్యవధిలోనే ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉండడంతో పనిభారం పెరిగింది. ఎన్నికల నియమావళిని పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు వీలు పడలేదు.
ముఖ్యంగా పంచాయతీల్లో రంగులు మార్చాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పదిరోజుల వ్యవధిలోనే ఆ ప్రక్రియ పూర్తి చేయాలని దిశానిర్దేశం చేసింది. ఫలితంగా రంగులు మార్చడం పంచాయతీలు, మునిసిపాలిటీల్లో సిబ్బందికి సాధ్యపడలేదు. ఇప్పటికీ రంగులతోనే పంచాయతీ కార్యాలయాలు, సచివాలయాలు ఉన్నాయి. మరోవైపు ప్రభుత్వం స్థానిక ఎన్నికల్లో మద్యం, సొమ్ములు పంపిణీ లేకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం చేసింది. అధికారుల్లో ఇది మరింత టెన్షన్‌కు గురిచేసింది. వాహనాలు తనిఖీలు ముమ్మరం చేశారు. మద్యం పంపిణీ లేకుండా చర్యలు తీసుకునేందుకు సచివాలయ సిబ్బందికి అవగాహన కల్పించారు. ప్రస్తుతం ఎన్నికల వాయిదాతో అధికారులకు కాస్త ఊరట లభించినట్టయ్యింది. నిదానంగా తమ విధులను నిర్వహించుకునే అవకాశం లభించింది.
కోడ్ అమలులోనే..
కరోనా వైరస్‌తో ఎన్నికలు వాయిదా పడినా సరే కోడ్ మాత్రం అమలులోనే ఉంటుంది. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనులు చేసేందుకు వీలులేదు. కొత్తగా సంక్షేమ పథకాలు అమలు చేయడానికి అవకాశం లేదు. నిజానికి ఉగాది రోజే ఇళ్లపట్టాలు, స్థలాలకు పట్టాలు ఇవ్వాలని నిర్ణయించారు. ఇప్పుడు మరో 6 వారాల పాటు అటువంటి సంక్షేమ పథకాలు నిర్వహించేందుకు వీలు లేదు. కొత్తగా అభివృద్ధి పనులు చేపట్టకూడదు. ఉన్నవాటినే కొనసాగించే అవకాశం ఉంటుంది.
క్యాస్ట్ వైరస్ వల్లే ఎన్నికలు వాయిదా: ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని
కరోనా వైరస్ వల్ల కాదు క్యాస్ట్ వైరస్ వల్ల ఎన్నికలు వాయిదా పడ్డాయి. మార్చిలోగా రాష్ట్రంలో ఎన్నికలు జరగకపోతే రాష్ర్టానికి రావాల్సిన ఐదువేల కోట్లు కేంద్రం నిధులు రాకుండా పోతాయి. స్థానిక సంస్థల ఎన్నికలు అడ్డుకోవడానికి చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు. బీసీ రిజర్వేషన్‌పై కోర్టుకు వెళ్ళారు. విజయవాడలో ఉండే కొంతమంది టీడీపీ నాయకులను పల్నాడు పంపారు. జడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఏకగ్రీవం అవుతుంటే చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు. చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన రాష్ట్ర ఎన్నికల కమిషన్‌తో చంద్రబాబునాయుడు పొలిటికల్ గేమ్‌కు తెరలేపారు. రాష్ట్రంలో అర్ధంతంరంగా కరోనా పేరుతో ఎన్నికలు వాయిదా వేయడం దారుణం. ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండా విచక్షణాధికారం పేరుతో ఇష్టమొచ్చినట్టు నిర్ణయం తీసుకుంటే పాలకులు ఎందుకు.
ఆలస్యంగానైనా స్పందించారు : సీపీఎం అప్లాండ్ జిల్లా కార్యదర్శి చింతలకాల బాబూరావు
రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆలస్యంగానైనా జరిగిన అక్రమాలు, ఆరోపణలపై స్పందించడం హర్షణీయం. కరోనా నేపథ్యంలో ఆరువారాల పాటు ఎన్నికలు నిలిపివేస్తూ ఎలక్షన్ కమిషన్ సరైన నిర్ణయం తీసుకున్నది. ఇదే సమయంలో అధికార దుర్వినియోగం, అక్రమాలపై వ్యాఖ్యానించడం కొంత చర్చకు దారితీస్తుంది. ఎన్నికల కమిషన్ నిర్ణయంపై స్పందిస్తూ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. ఆ వ్యాఖ్యలు ఎన్నికల కమిషన్ స్వతంత్రతను స్వయం ప్రతిపత్తిని ప్రశ్నించేలా ఉన్నాయి.
ఎన్నికలు వాయిదా మంచి నిర్ణయమే: బండి వెంకటేశ్వరరావు, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి
కరోనా వైరస్ నేపఽథ్యంలో ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేస్తూ ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయం సరైనదే. ప్రజల ఆరోగ్యం పరిరక్షించాలనే ఉద్దేశ్యంతోనే ఎన్నికల సంఘం ఆ నిర్ణయం తీసుకున్నది. వాయిదాపేరుతో రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులను ఇప్పటికిప్పుడే విడుదల చేయాలి.