మాస్క్‌ ధరించకుంటే పోలీసు కేసు

ABN , First Publish Date - 2020-05-11T10:11:14+05:30 IST

కరోనా లాక్‌డౌన్‌ నిబంధనలు మీరి రోడ్ల పైకి వస్తున్న వారిపై పోలీ సులు కొరఢా

మాస్క్‌ ధరించకుంటే పోలీసు కేసు

తణుకు సర్కిల్‌లో నిబంధనలు మీరిన 156 మందిపై నమోదు

గణపవరంలో వాహనదారులకు పోలీసుల వినూత్న శిక్ష


తణుకు /ఏలూరు క్రైం/గణపవరం, మే 10 : కరోనా లాక్‌డౌన్‌ నిబంధనలు మీరి రోడ్ల పైకి వస్తున్న వారిపై పోలీ సులు కొరఢా ఝుళిపిస్తున్నారు. తమదైన శైలిలో కౌన్సెలింగ్‌ నిర్వహించడంతోపాటు క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తున్నారు. ప్రభుత్వం ఎపిడమిక్‌ యాక్ట్‌ 1897 చట్ట ప్రకారం అత్యవసర మెడికల్‌ ఎమర్జెన్సీని ప్రకటించింది. నిబంధన లు ఎవరు అతిక్రమించినా వారిపై కేసులు నమోదు చేస్తారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు ప్రభుత్వం లాక్‌డౌన్‌తోపాటు సీఆర్‌పీసీ 144 సెక్షన్‌ విధించింది. దీని ప్రకా రం నలుగురు కంటే ఎక్కువ కలిసి తిరగకూడదు. ఒక్కొక్కరికి రెండు మీటర్ల భౌతిక దూరం పాటించాలి. బయటికి వచ్చేటప్పుడు కచ్చితంగా మాస్క్‌ ధరించాలి. రెడ్‌జోన్‌ నుంచి బయటికి, లోపలికి వెళ్లరాదు. నిబంధనలు అతిక్రమించిన వారిపై ఐపీసీ 188 సెక్షన్‌ కింద కేసు నమోదు చేస్తారు. వారికి నెల నుంచి మూడు నెలల వరకూ జైలు శిక్ష, వెయ్యి నుంచి పది వేల వరకూ జరిమానా విధించనున్నారు. లేదా ఈ రెండు శిక్షలు అమలు చేయవచ్చు. 


 తణుకు సర్కిల్‌లో 156 కేసులు

తణుకు సర్కిల్‌ పరిధిలోని పలు పోలీస్‌ స్టేషన్ల మూడు రోజులుగా 156 కేసులు నమోదు చేశారు. తణుకు పట్టణంతో పాటు మిగిలిన మండలాల్లోనూ లాక్‌డౌన్‌కు సడలింపులు ఇచ్చారు. వ్యాపార, వాణిజ్య సముదాయాలు తెరుచు కుంటున్నాయి. పరిసర ప్రాంతాల నుంచి పెద్దఎత్తున ప్రజలు తణుకు వస్తున్నారు. వ్యాపా రులు, కొనుగోలు దా రులకు పోలీసులు అవగాహన కల్పిస్తున్నప్పటికీ వారిలో మార్పు రాక పోవడంతో వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. నిబంధనల ఉల్లంఘన, మాస్క్‌లు ధరించకపోవడం, భౌతిక దూరం పాటించకపోవడం తదితర కారణాలతో సర్కిల్‌ పరిధిలోని తణుకు పట్టణంలో 55, రూరల్‌లో 28, ఉండ్రాజవరం 35, అత్తిలి 10, పెరవలి 28 చొప్పున కేసులు నమోదు చేశారు. వీరందరినీ అరెస్టు చేసి స్టేషన్‌లో వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. మాస్కులు లేకుండా వ్యాపారం నిర్వహించడం, శానిటైజర్లను ఏర్పాటు చేయకపోవడం వంటి కారణాలతో పట్టణంలోని ఆరుగురు షాపు యజమానులపై కేసులు నమోదు చేసి నట్లు పోలీసులు చెబుతున్నారు. 


గణపవరంలో వినూత్న కౌన్సెలింగ్‌

గణపవరం: మాస్క్‌లు ధరించని వారికి గణపవరం పోలీసులు వినూత్న రీతిలో కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు. భౌతిక దూరం పాటించని, మాస్క్‌లు ధరించని వారిని గుర్తిం చారు. వారి ఫోన్ల ద్వారా వారి స్నేహితులకు ఫోన్‌లు చేయిస్తున్నారు. బయటకు వచ్చేటప్పుడు మాస్క్‌ ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, గుంపులు గుంపులుగా ఎక్కడికీ వెళ్లకూడదని.. ఇలాంటి నిబంధనలు మీరితే జరిమానాలు, కేసులు తప్పవని ఫోన్‌లో హెచ్చరిస్తున్నారు. పోలీసులకు పట్టుబడిన ఒక్కొక్కరూ ఐదుగురికి ఫోన్‌ చేయాలి. ఈ వినూత్న కార్యక్రమానికి గణపవరం సీఐ డేగల భగవాన్‌ ప్రసాద్‌, ఎస్సై వీరబాబు శ్రీకారం చుట్టారు. జిల్లావ్యాప్తంగా ఆదివారం పోలీసులు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. 

Updated Date - 2020-05-11T10:11:14+05:30 IST