97 శాతం రీ సర్వే పూర్తి

ABN , First Publish Date - 2020-04-01T10:38:49+05:30 IST

జిల్లాలో అనుమానిత కేసులు, బయట నుంచి వచ్చిన వారిని గుర్తించేందుకు మరోసారి చేపట్టిన ఆరోగ్య సర్వే 97

97 శాతం రీ సర్వే పూర్తి

ఏలూరు మార్చి 31(ఆంధ్రజ్యోతి): జిల్లాలో అనుమానిత కేసులు, బయట నుంచి వచ్చిన వారిని గుర్తించేందుకు మరోసారి చేపట్టిన ఆరోగ్య సర్వే 97 శాతం పూర్తయ్యింది. జిల్లాలో 12 లక్షల 56 వేల 397 కుటుంబాలకు గాను  12 లక్షల 21 వేల 137 కుటుంబాలను వైద్య ఆరోగ్య, సచివాలయ సిబ్బంది, వలంటీర్లు సర్వే చేశారు. ఇందులో నరసాపురం, కుక్కునూరు డివిజన్లలో 98 శాతంతో మొదటి స్థానంలో ఉండగా ఏలూరు కొవ్వూరు డివిజన్లలో 97, జంగారెడ్డిగూడెం డివిజన్‌లో 96 శాతం రీ సర్వే పూర్తయ్యింది. ఇందులో ఇతర ప్రాంతాల నుంచి జిల్లాకు వచ్చిన 4,232 మందిని గుర్తించారు.


ఇతర దేశాల నుంచి 3,911 మంది వచ్చినట్లు గుర్తించి, అందరినీ ఇళ్ల దగ్గరే వైద్య పర్యవేక్షణలో ఉంచారు. 127 ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాలతో మ్యాపింగ్‌ చేశారు. ఇప్పటికే 1501 మంది 28 రోజుల పర్యవేక్షణ ముగించుకుని సురక్షితంగా బయటపడ్డారు. మరో 1,765 మంది 14 రోజుల వైద్య పర్యవేక్షణ ముగించారు. మిగిలిన 645 మందికి 14 రోజుల పర్యవేక్షణలో ఉన్నారు. నరసాపురం డివిజన్‌ పరిధిలో 1,638 మంది విదేశాలకు వెళ్లి రాగా, కొవ్వూరులో 1,475 మంది, ఏలూరు డివిజన్‌లో 709 మంది, జంగారెడ్డిగూడెం డివిజన్‌లో 88 మంది, కుక్కునూరు డివిజన్‌లో ఒకరు విదేశీ ప్రయాణం చేసి వచ్చారు.


30 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు వారు 3,409 మంది ఉండగా, 50 ఏళ్ల వయసు పైబడిన వారు 348 మంది ఉన్నారు. మిగిలిన వారిలో పదేళ్లలోపు చిన్నారులు 81 మంది, పది నుంచి 20 ఏళ్ల వారు 48 మంది ఉన్నారు. జిల్లాలో ప్రభుత్వాసుపత్రుల్లో 250, ప్రైవేటు ఆసుపత్రుల్లో 126 ఐసోలేషన్‌ పడకలు సిద్ధం చేశారు. 109 వెంటిలేటర్‌లను రెడీ చేశారు. ఎన్‌-95 మాస్కులు, 7,378, మూడు పొరల మాస్కులు 8,954 సిద్ధం చేశారు. 

Updated Date - 2020-04-01T10:38:49+05:30 IST