-
-
Home » Andhra Pradesh » West Godavari » 50days with lockdown
-
గమ్యమెటో..!
ABN , First Publish Date - 2020-05-13T09:55:46+05:30 IST
ఇప్పుడిప్పుడే లాక్‌డౌన్ సడలింపులతో జనం బయట ప్రపంచంలోకి వస్తున్నారు. వైరస్ ఉధృతి తగ్గలేదు. దీనితో సహ జీవనానికి సర్కార్

లాక్‌డౌన్‌తో నేటికి 50 రోజలు
మరింత పొడిగింపునకు ప్రధాని మోదీ ప్రకటన
ముంచేసిన కరోనా వైరస్
ఇప్పటికే దివాలా తీసిన ఆక్వా
పండిన పంటకు దిక్కులేదు
లక్షలాది కార్మికులకు పనిలేదు
ప్రాజెక్టులు మూలనపడ్డాయి
ఆసుపత్రులు పడకేశాయి
గగ్గోలు పెడుతున్న జనం
సడలింపే ఇప్పుడు దివ్యౌషధం
పరిశ్రమల సైరన్ వినిపించాలి
రవాణా చక్రాలు కదలాలి
కరోనాను ఎదుర్కొంటూనే పరుగులు తీయాలి
కంటికి కనిపించని చిన్న వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. కరోనా కట్టడికి లాక్‌డౌన్ ఒక్కటే మార్గమని ప్రధాని నరేంద్ర మోదీ భావించారు. మార్చి 25వ తేదీన మొదలై మూడు విడత లుగా అమలవుతున్న ఈ లాక్ డౌన్ బుధవారానికి 50 రోజు లైంది. ఈ నెల 17వ తేదీతో ఇది పూర్తవుతుండగా.. నాలుగో విడతకు సిద్ధం కావాలని ప్రధాని మళ్లీ పిలుపునిచ్చారు. ఈ 50 రోజుల లాక్‌డౌన్‌లో వ్యవస్థలన్నీ అతలాకుతలమయ్యాయి. కరోనా మహమ్మారి నిర్మూలన ఎప్పుడో.. మనగమ్యమేమిటో..? అది ఎటు వైపు దారి తీస్తుందోనని అన్ని వర్గాల్లోనూ ఆందోళన నెలకొంది. దీనిపై ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం..
ఎప్పుడూ అనుకోలేదు.. ఇన్నాళ్లపాటు ఇంటిలోనే బందీలం అవుతామని..! ఎన్నడూ ఊహించలేదు.. గుడిగంటలు మోగవని..! కొలువులకు నెలల తరబడి నిర్బంధ సెలవులిస్తారని.. చేతినిండా పనిలేక విసుగెత్తిపోతామని.. క్షణమొక యుగంగా భయంతో గడుపుతామని..! నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాలు వెలవెలబోతాయని.. చావుకి, పెళ్లికి వెళ్లాలంటే అనుమతులు ఉండాలని కలలో కూడా ఊహించలేదు.! కంటి నిండా నిదురలేని కలత చెందిన రాత్రు లుంటాయని.. అయినవాళ్లంతా ఉన్నా దూరమైన భావన పీడిస్తుందని.. ఎన్న డూ తలచలేదు. రైళ్లు లేవు.. బస్సులు లేవు.. సన్నిహితులతో గంటల తరబడి బాతాఖానీలు లేవు. ఛాయ్ కొట్టూ లేదు. రెస్టారెంట్ అంతకంటే లేదు. ఇదంతా కరోనా వైచిత్రి. 50 రోజుల సుదీర్ఘ లాక్‌డౌన్ వేళ జీవనమిది..
(ఏలూరు-ఆంధ్రజ్యోతి ప్రతినిధి) :
ఇప్పుడిప్పుడే లాక్‌డౌన్ సడలింపులతో జనం బయట ప్రపంచంలోకి వస్తున్నారు. వైరస్ ఉధృతి తగ్గలేదు. దీనితో సహ జీవనానికి సర్కార్ పిలుపునిచ్చింది. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా 68 మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో 38 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జి కాగా, 30 మంది ఐసోలేషన్ వార్డుల్లోనే చికిత్స పొందుతున్నారు. ఇప్పుడు అంద రిలోనూ భయం వెంటాడుతున్నది. వైరస్ ఎప్పుడు ? ఎక్కడ ? ఎలా? వస్తుందోనని అందరూ వణికిపోతున్నారు. ఇందుకు తగిన జాగ్ర త్తలు తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ మాస్క్‌లు ధరించి భౌతిక దూరం పాటిస్తూ.. తరచూ శానిటైజర్‌ను ఉపయోగిస్తున్నారు. ఇంకొందరు బరి తెగించి అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. వారించిన పోలీసులను దిక్క రించారు. మద్యం షాపుల ముందు వందలాది మంది బారులు తీరి అందరి కళ్లు తెరిపించారు. మరోవైపు పారిశుధ్య కార్మికులు నిత్యం కష్ట పడ్డారు. పోలీసులు, రెవెన్యూ, ఆశ వర్కర్లు, వైద్యారోగ్యశాఖ, డాక్టర్లు, నర్సులు, ఉన్నతాధికారులు కంటిపై కునుకులేకుండా గడి పారు.
ఒక్కసారిగా తారుమారు..
ఒకప్పుడు చేతినిండా పనుండేది. క్షణం తీరికలేకుండా ఉండేవారు. రోజుకు ఇరవై నాలుగు గంటలు చాలవనుకునే వారు. ఇంట్లో గడపడం అంటే విచిత్రంగా చూసేవారు. సెలవులు కావాలంటే బాస్‌లంతా కన్నెర్రజేసేవారు. కాసేపు మనశ్శాంతికి గుడికి వెళితే చేతినిండా ప్రసా దం, నెత్తినిండా శఠగోపం. తీర్ధయాత్రలు.. విలాస యాత్రలు. సీన్ ఒక్కసారి తిరగబడింది. కరోనా వైరస్‌తో తల్లకిందులైంది. అన్నిటికీ లాక్‌డౌన్ పడింది. ఆసుపత్రులు మూసేశారు. రాకపోకలు నిలిచిపో యాయి. అన్ని రంగాలు దివాళా దిశగా పయనించాయి. వ్యాపారం మందగించింది. హోటళ్లు తెరచుకోలేదు. చివరకు ఆసుపత్రుల్లో ఓపీ సేవలను మూసేశారు. ఇలా ఒకటేంటి.. అన్ని రంగాల్లో స్ధంభనే. ఫలి తంగా వేలాది మందికి వేతనం లేకుండాపోయింది. నిర్మాణ రంగం కుదేలైంది. ఈ రంగంలోవున్న ఐదు లక్షల మంది ఇంటికే పరిమితమ య్యారు. వ్యవసాయ రంగంతో ముడిపడివున్న తొమ్మిది లక్షల కుటుం బాలు చెల్లా చెదురయ్యాయి. దాదాపు లక్ష మందికి పైగా కార్మికులు పనిచేసే పరిశ్రమలు మూతపడడంతో ఉపాధి కరువై దిక్కులేకుండా పోయారు. సంఘటిత, అసంఘటిత రంగానికి చెందిన పద్దెనిమిది లక్షల మంది బతుకులు బజారున పడ్డాయి. చేతినిండా పనిలేక, కడుపు నిండే దారిలేక సాగిలపడ్డారు.
జరిగిన నష్టమెంతో..
లాక్‌డౌన్ ఫలితంగా సవాలక్ష ఆంక్షలు.. వ్యాపారాల దగ్గర నుంచి చిన్నా చితకా ఒడంబడికలు మూలనపడ్డాయి. పౌలీ్ట్ర యజమానులకు కోట్ల నష్టం మిగిల్చింది. ధాన్యం కోతకు వేళైన కోసే వారు లేక రైతులు దిగాలుపడ్డారు. ఆఖరికి ప్రభుత్వం ధాన్యం కొనుగోలుకు సిద్ధపడినా రైతులకు ధర చెల్లింపులు చేయలేని నిస్సహాయత. లక్షలాది ఎకరాల్లో పంట పండించిన రైతులు ఇప్పుడు అప్పుల్లోనే. మొక్కజొన్న చేలో వేస్తే ఒకప్పుడు లక్షలు ఇంటికి చేరేవి. మరిప్పుడు కొనేవారు లేక దళా రుల చేతిలో చిక్కి దివాళా తీశారు. వ్యవసాయాధారిత జిల్లాలో వరి, మొక్కజొన్న, పామాయిల్, కొబ్బరి, అరటి, పొగాకు, కూరగాయలు వంటివన్ని ధరలు లేక, వ్యాపారం సాగక నష్టం ఎదురైంది. వ్యవసా యం తరువాత అతి పెద్ద రంగమైన ఆక్వాలో అనేక ఒడిదుడుకులు.. చేపల రవాణా బంద్ అయింది. వందల కోట్ల టర్నోవర్ నిలిచిపోయిం ది. రొయ్యల సాగులో ఎకరాకు ఐదు లక్షలు పెట్టుబడి పెట్టగా లాభా లు రావాల్సి ఉండగా కరోనా వైరస్ దెబ్బతో రాకపోకలు నిలిచి నష్టాలు తోడయ్యాయి. ప్రతి ఏటా ఈ ఒక్క జిల్లా నుంచే పద్దెనిమిది వేల కోట్ల విలువైన రొయ్యలు ఎగుమతయ్యేవి. ఈ సీజన్‌లో ఎగుమతులన్నీ దాదాపు కనిష్టస్థాయికి చేరాయి. దీనిపైనే ఆధారపడ్డ మూడు లక్షల మంది పనిలేక, రోజు గడవక అష్టకష్టాలు పడ్డారు. రవాణా రంగంలో మరో మూడు లక్షల మంది ఉండగా, వీరిలో ఏ ఒక్కరికి చేతి నిండా పనిలేకుండాపోయి, చిల్లి గవ్వలేక ఉన్నదాంట్లోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపైన దీని ప్రభావం పడింది. ఒకనాడు నిధులు లేక పనులు జరగలేదు. ఇప్పుడు నిధులున్నా వలస కార్మికులంతా స్వరాష్ట్రాలకు వెళ్లిపోవడంతో పనులు కాస్త నిలిచిపోయా యి. ఆఖరికి దేవాలయాలకు భక్తులు వెళ్లలేని పరిస్థితి. ఫలితంగా హుండీలన్నీ వెలవెలబోయాయి.
ఇప్పుడు ఏంచేయాలి..
ఈ మధ్యనే రెడ్‌జోన్ల విస్తీర్ణాన్ని కుదించారు. క్వారంటైన్‌కు వెళ్లే వారందరికీ కాలపరిమితిని తగ్గించారు. ఉదయం వేళ నిత్యావసరాలకు వీలుగా మూడు గంటల వెసులుబాటుకు తోడుగా వ్యవసాయపనులు, తాపీ పనులు, చిన్న చిన్న వ్యాపారాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పరిశ్ర మలపై ఉన్న ఆంక్షలు మరింతగా సడలిస్తే జిల్లావ్యాప్తంగా మరో అరవై వేల మందికి తక్షణ ఉపాధి సాధ్యమవుతుంది. తణుకు పారిశ్రా మిక వాడనే నమ్ముకున్న వేలాది కార్మికులున్నారు. ఇలాంటి చోట్లే కా దు మిగతా ప్రాంతాల్లోనూ కార్మికులకు అంతో ఇంతో ఊపిరినిచ్చి నట్ల వుతుంది. ప్రజల్లో కొనుగోలు సామర్ధ్యం పెరుగుతుంది. వ్యాపారాలు పుంజుకుంటాయి. చేతి వృత్తుల వారంతా దాదాపు నాలుగున్నర లక్షల మందికిపైగా ఉన్నారు. చెప్పులు కుట్టుకునే వారి దగ్గర నుంచి చేనేత కార్మికుల వరకూ. ఆఖరికి పట్టణాల పరిధిలో ఆటోమొబైల్ రంగంలో పరిమితులతో కూడిన అనుమతులిస్తే వేలాది మంది తేరుకోగలుగు తారు. ఒకచోట నుంచి మరో చోటికి సులువుగా ప్రయాణించేందుకు కొన్ని ఆంక్షలతో అనుమతిస్తే మరింత వెసులుబాటుకు వీలుంటుంది.