లీటరు కాదు.. 900ఎంఎల్.. 11 పెట్రోలు బంకుల్లో మోసాల గుట్టు రట్టు..!

ABN , First Publish Date - 2020-09-05T17:53:20+05:30 IST

పెట్రోలు బంకుల్లో ఎలక్ర్టానిక్‌ కార్డు చిప్‌లను పెట్టి భారీ మోసాలకు పాల్పడుతున్న గుట్టు రట్టయ్యింది. లీటరుకు 30 ఎంఎల్‌ నుంచి 100 ఎంఎల్‌ వరకు తగ్గించి పోస్తున్న బంకుల నిర్వాహకుల మోసం పోలీసు దాడులతో బయటపడింది. జిల్లావ్యాప్తంగా

లీటరు కాదు.. 900ఎంఎల్.. 11 పెట్రోలు బంకుల్లో మోసాల గుట్టు రట్టు..!

ఎలక్ర్టానిక్‌ చిప్‌ కార్డులతో బరితెగించిన బంకులు

పశ్చిమ గోదావరి జిల్లావ్యాప్తంగా పోలీసుల దాడులు 

11 పెట్రోల్‌ బంకులపై కేసులు


ఏలూరు క్రైం(పశ్చిమ గోదావరి జిల్లా): పెట్రోలు బంకుల్లో ఎలక్ర్టానిక్‌ కార్డు చిప్‌లను పెట్టి భారీ మోసాలకు పాల్పడుతున్న గుట్టు రట్టయ్యింది. లీటరుకు 30 ఎంఎల్‌ నుంచి 100 ఎంఎల్‌ వరకు తగ్గించి పోస్తున్న బంకుల నిర్వాహకుల మోసం పోలీసు దాడులతో బయటపడింది. జిల్లావ్యాప్తంగా శుక్రవారం ఏకకాలంలో పెట్రోలు బంకులపై పోలీసులు దాడులు చేశారు. 11 బంకుల్లో ఎలక్ట్రానిక్‌ కార్డు చిప్‌లను వినియోగిస్తూ ప్రజలను మోసగిస్తున్నా రని గుర్తించి, వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు. ఇప్పటి వరకు బంకుల్లో లీటర్ల కొద్దీ పెట్రోలు, డీజిల్‌ కొనుగోలు చేసిన వాహనదారులు ఈ మోసాలను చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. తెలంగాణలోని పెట్రోలు బంకుల్లో భారీగా వ్యత్యాసాలు వస్తున్నాయని వినియోగదారుల ఫిర్యాదులపై పోలీసులు నిఘా ఏర్పాటుచేశారు. ఎలక్ర్టానిక్‌ కార్డు చిప్‌ను పెట్రోల్‌ బంకు మిషన్‌లో అమర్చి ఈ మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తిం చారు. కార్డు చిప్‌లను తయారుచేసే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణతోపాటు అం ధ్రప్రదేశ్‌లో పలు పెట్రోలు బంకుల్లో వీటిని అమ ర్చినట్లు నిందితులు చెప్పడంతో.. డీజీపీ గౌతంసవాంగ్‌ ఆదేశాల మేరకు ఎస్పీ కె.నారాయణనాయక్‌ స్వయంగా తన సిబ్బందితో ఏకకాలంలో పెట్రోలు బంకులపై దాడులు చేశారు. 11 బంకులను గుర్తించి తనిఖీలు చేసి ఆ కార్డు చిప్‌లను స్వాధీనం చేసుకున్నారు. బంకు నిర్వాహకులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు. ఎస్పీ ఏలూరులోని మూడు బంకుల్లో తనిఖీ చేశారు. 


నష్టపోయేదిలా..!

జిల్లాలో 290 పెట్రోలు బంకులుండగా వీటిలో ఐవోసీఎల్‌కు 123, హెచ్‌పీసీఎల్‌కు 75, బీపీసీ ఎల్‌కు 94 బంకులున్నాయి. రోజుకు సగటున రెండు లక్షల 60 వేల లీటర్ల పెట్రోలు, నాలుగు లక్షల 70 వేల లీటర్ల డీజిల్‌ను వినియోగదారులు కొనుగోలు చేస్తున్నారు. పైన పేర్కొన్న పెట్రోలు బంకుల్లో ఎలకా్ట్రనిక్‌ కార్డు చిప్‌ ద్వారా లీటరులో 30 మిల్లీ లీటర్ల నుంచి వంద మిల్లీ లీటర్ల వరకూ తగ్గించి వాహనదారులకు పెట్రోలు, డీజిల్‌ పోస్తు న్నారు. ఈ విధంగా లీటరు కొనుగోలు చేసిన విని యోగదారుడి వద్ద రెండు రూపాయల 61 పైసల నుంచి ఎనిమిది రూపాయల వరకూ దోపిడీ చేస్తు న్నారు. పది లీటర్ల పైబడి ఎక్కువ పెట్రోల్‌ కొట్టించుకున్న వారికి మరింత దోపిడీ చేసేస్తున్నారు.


మోసాలకు పాల్పడిన బంకులివే

ప్రాంతం             పెట్రోలు బంకు

ఏలూరు సత్రంపాడు         బీపీసీఎల్‌ 

ఏలూరు మాదేపల్లి          ఐఓసీఎల్‌

భీమడోలు జంక్షన్‌         ఎస్సార్‌ 

భీమడోలు         ఐవోసీఎల్‌ 

విజయరాయి              బీపీసీఎల్‌ 

భీమవరం          ఐవోసీఎల్‌ 

నరసాపురం          ఎస్సార్‌ 

పెరవలి          ఐవోసీఎల్‌ 

కాపవరం          హెచ్‌పీ 

నల్లజర్ల          ఐవోసీఎల్‌ 

పాలకొల్లు          ఐవోసీఎల్‌ 


చర్యలు తప్పవ్‌: ఎస్పీ కె.నారాయణ నాయక్‌ 

తెలంగాణ బంకుల్లో ఎలక్ర్టానిక్‌ కార్డు చిప్‌ను ఉపయోగించి విని యోగదారులకు పెట్రోలు తక్కువ పోస్తూ మోసగిస్తున్నారు. పోలీసు లు దర్యాప్తు చేస్తే చిప్‌ను తయారు చేసే ఒక వ్యక్తి చిక్కాడు. అతను ఇచ్చిన సమాచారం మేరకు జిల్లా లోని 11 పెట్రోలు బంకులపై దాడులు చేశాం. పది బంకుల మిషన్లల్లో అమర్చిన కార్డు చిప్‌ల ను స్వాధీనం చేసుకున్నాం. పాల కొల్లులోని ఒక బంకు నిర్వాహకుడు చిప్‌ తీసుకుని పరారయ్యాడు. అత నిని అరెస్ట్‌ చేయడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. మో సానికి పాల్పడిన బంకు నిర్వాహ కులపై ఐపీసీ 420, 264, 265, ఐటీ యాక్టు 66(డి), లీగల్‌ మెట్రా లజీ యాక్టు కింద కేసులు నమో దుచేశాం. పెట్రోలు, డీజిల్‌ కొను గోలుదారులను మోసగించే బంకు ల నిర్వాహకులపై చట్టప్రకారం కఠినచర్యలు తీసుకుంటాం. 


ఇదో కొత్త రకం మోసం : లీగల్‌ మెట్రాలజీ డీసీ హరిప్రసాద్‌

ఇప్పటి వరకూ మేం మిషనరీకి మాత్రమే సీల్స్‌ వేసేవాళ్ళం. ఇప్పుడు కొత్త రకం మోసం బయటపడింది. ఎలక్ట్రానిక్‌ మిషన్‌లో చిప్‌లను అమర్చి మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించాం. భవిష్యత్తులో ఈ మిషన్లకు సీలు చేస్తాం. ఎక్కడైనా పెట్రోలు కొలతల్లో తేడాలుంటే ఫిర్యాదులను సంబంధిత కంపెనీ అధికారులకు గాని, తూనికలు కొలతల శాఖకు గాని ఫిర్యాదులు చేయవచ్చు. ప్రతి పెట్రోలు బంకులో అధికారుల ఫోన్‌ నెంబర్లు, ఇతర వివరాలు అందుబాటులో ఉంటాయి. 

Updated Date - 2020-09-05T17:53:20+05:30 IST