కొందరికేనా ‘చేయూత ’?

ABN , First Publish Date - 2020-08-18T11:58:56+05:30 IST

వైఎస్సార్‌ చేయూత అర్హులకూ దక్కని పరిస్థితి జిల్లాలో నెలకొంది. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు మహిళలు అధిక ..

కొందరికేనా ‘చేయూత ’?

అప్పుడు అర్హులమన్నారు.. ఇప్పుడు కాదంటున్నారు..

 దాదాపు 17వేల మంది అనర్హులట

ప్రభుత్వం ఆదుకోవాలని విన్నపం


విజయనగరం (ఆంధ్రజ్యోతి) ఆగస్టు 17: వైఎస్సార్‌ చేయూత అర్హులకూ దక్కని పరిస్థితి జిల్లాలో నెలకొంది. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు మహిళలు అధిక సంఖ్యలో ముందుకొచ్చారు. కష్టకాలంలో సాయం అందుతుందని ఆశపడ్డారు. సాంకేతిక కారణాలతో చాలా మందికి పథకం అంద లేదు. ఆధార్‌ కార్డులోని వివరాలు తప్పుగా ఉన్నాయని ఎక్కువ మంది దరఖాస్తులను తిరస్కరించారు. పేద మహిళలకు ఆర్థిక చేయూతనిచ్చే లక్ష ్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఏటా వైఎస్‌ఆర్‌ చేయూత కింద రూ.18,750 చొప్పున నాలుగేళ్ల పాటు రూ.75 వేల ఆర్థిక సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మూడు నెలల ముందునుంచే అర్హులను గుర్తించే పనిని సచివాలయ సిబ్బంది, వలంటీర్లు చేపట్టారు. క్షేత్ర స్థాయికి వెళ్లి దరఖాస్తు వివరాలతో సరిపోల్చుకున్నాక అప్‌లోడ్‌ చేశారు. పథకానికి సుమారు లక్షా 75 వేల మంది దరఖాస్తు పెట్టుకోగా మూడు నెలలు దాటిన తరువాత లక్షా 53 వేల మందిని మాత్రమే అర్హులుగా ప్రకటించారు. మిగతావారిలోనూ వేలాది మంది అర్హులున్నారు. వివిధ కారణాలతో వారికి సాయం అందలేదు.


రాజకీయ కారణాలతోనూ కొన్నింటిని తిరస్కరించినట్లు సమాచారం. బాధితులు అధికారులపై విమర్శలు గుప్తిస్తున్నారు. రాజకీయ నాయుకుల సూచనతో వలంటీర్లు కూడా అడ్డుకున్నారన్న విమర్శలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. దీంతో సచివాలయాల అధికారులు తలలు పట్టుకుంటున్నారు. సమాధానం చెప్పలేక ఇబ్బంది పడుతున్నారు. గతంలో సామాజిక పింఛన్ల పంపిణీల్లో కూడా ఇలాంటి తప్పులే దొర్లాయి. అప్పుడు వెలుగు అధికారులపై విమర్శలొచ్చాయి. జామి మండలం పావడకు చెందిన ఎ.పైడమ్మ, కె.పాపయ్యమ్మ, పి.రమణమ్మ, ఎ.సన్యాసమ్మలు తమకు పూర్తి అర్హత ఉన్నా చేయూత అందకుండా చేశారని ఆరోపిస్తూ ఇటీవల మరోసారి అధికారులకు గోడు వినిపించారు. తమను వేరే పార్టీ వారిగా స్థానిక వైసీపీ నాయకులు గుర్తించి.. ఈ విధంగా చేస్తున్నారని, న్యాయం చేయాలని కోరుతున్నారు. ఇలాంటి వారు జిల్లా వ్యాప్తంగా వేలాది మంది ఉన్నారు. 


అర్హులందరికీ పథకం..కె.సుబ్బారావు, పీడీ, డీఆర్‌డీఏ

వైఎస్‌ఆర్‌ చేయూత పథకం అర్హులైన మహిళలందరికీ వర్తిస్తుంది. కొంతమంది లబ్ధిదారులు వివరాలు సరిగ్గా అందివ్వకపోవడంతో తుది జాబితాలో పేర్లు రాలేదు. అర్హులైనవారిని గుర్తించే పనిలో సిబ్బంది ఉన్నారు. రెండుమూడు రోజుల్లో స్ర్కీనింగ్‌ పూర్తవుతుంది. ఇప్పటికే 1.53 లక్షల మందిని గుర్తించి రూ.288.7 కోట్లను మహిళల ఖాతాల్లో జమచేశాం. రెండో జాబితాను కొద్దిరోజుల్లో విడుదల చేస్తాం.

Updated Date - 2020-08-18T11:58:56+05:30 IST