జీతాలు చెల్లించాలని కార్మికుల ఆందోళన

ABN , First Publish Date - 2020-04-24T10:42:35+05:30 IST

వారంతా బీహార్‌, ఒడిశా నుంచి వలస వచ్చిన కార్మికులు.. ఎల్‌.కోట మండలం శ్రీరాంపురం

జీతాలు చెల్లించాలని కార్మికుల ఆందోళన

కొత్తవలస రూరల్‌(ఎల్‌.కోట), ఏప్రిల్‌23: వారంతా బీహార్‌, ఒడిశా నుంచి వలస వచ్చిన కార్మికులు.. ఎల్‌.కోట మండలం శ్రీరాంపురం వద్దగల స్టీల్‌ఎక్సేంజ్‌ ఇండియా పరిశ్రమలో పనిచేస్తున్నారు.. లాక్‌డౌన్‌ కారణంగా సుమారు 200 మంది తమ సొంతగూటికి చేరుకోలేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.. ఈక్రమంలో తమ జీతాలు చెల్లించాలంటూ పరిశ్రమ యాజమాన్యాన్ని నిలదీసేందుకుగాను గురువారం ఆందోళనకు దిగారు.


ఒక్కసారిగా పరిశ్రమ గేట్‌ వద్దకు చేరుకున్న కార్మికులను స్థానిక ఎస్‌ఐ కె.ప్రయోగమూర్తి ఆధ్వర్యంలో చెదరగొట్టే ప్రయత్నంలో పోలీసులకు భంగపాటు ఎదురైంది. పరుగులు తీస్తున్న కార్మికుల్లో కొందరు పోలీసు వాహనంపై రాళ్లు రువ్వారు. దీంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎస్‌.కోట సీఐ శ్రీనివాసరావు రంగప్రవేశం చేసి పరిస్థితిని తెలుసుకున్నారు. అనంతరం వాహనంపై రాళ్లు రువ్విన ఏడుగురిని గుర్తిం చి కేసు నమోదు చేశారు.  పోలీసులు యాజమాన్యం, కార్మికులతో మాట్లాడారు. 


జీతాలు చెల్లించేశాం

 లాక్‌డౌన్‌ కారణంగా కేవలం మార్చినెల జీతం మాత్రమే చెల్లించాల్సి ఉంది. వారంతా కాలి నడకనైనా సరే బీహార్‌ వెళ్లడానికి సిద్ధపడుతున్న నేపథ్యంలో చెల్లింపులు నిలిపివేశాం. మే3 తరువాత చెల్లించి వారి ప్రయాణానికి తగిన చర్యలు తీసుకుందామని యాజమాన్యం నిర్ణయించింది. ఇంతలో ఈవిధంగా చేశారు. పోలీసుల సూచనల మేరకు బకాయి జీతాలు చెల్లించేశాం. 

         - బాలకృష్ణ, స్టీల్‌ ఎక్సేంజ్‌ పరిశ్రమ ప్రతినిధి

Updated Date - 2020-04-24T10:42:35+05:30 IST