-
-
Home » Andhra Pradesh » Vizianagaram » With Corona
-
కరోనాతోనే...
ABN , First Publish Date - 2020-12-29T04:58:33+05:30 IST
ఎదుటి మనిషితో మాట్లాడటానికి.. కరచాలనం చేయడానికి భయపడే పరిస్థితిని గతంలో ఎన్నడూ చూసి ఉండం. దగ్గినా.. తుమ్మినా...అమ్మో అని పారిపోయిన అనుభవాలు అరుదు. ఇవన్నీ ఈ ఏడాది మన అనుభవంలోకి వచ్చాయి.

ఏడాదంతా వేధించిన కొత్త వైరస్
విద్యా సంవత్సరం అస్తవ్యస్తం
ఉపాధికి గండి
ఆగిన అభివృద్ధి కార్యక్రమాలు
కళ తప్పిన పండగలు
తెరపైకి కొత్త సంప్రదాయాలు
ఆన్‌లైనలో వివాహ వేడుకలు
బంధువర్గానికే పరిమితమవుతున్న శుభకార్యాలు
ఎదుటి మనిషితో మాట్లాడటానికి.. కరచాలనం చేయడానికి భయపడే పరిస్థితిని గతంలో ఎన్నడూ చూసి ఉండం. దగ్గినా.. తుమ్మినా...అమ్మో అని పారిపోయిన అనుభవాలు అరుదు. ఇవన్నీ ఈ ఏడాది మన అనుభవంలోకి వచ్చాయి. కష్టమైనా.. సుఖమైనా నలుగురితో చెప్పుకోకుండా ఉండలేం. కష్టాల సంగతి పక్కన పెడితే...సంతోషాలను... సంబరాల సంగతులనూ పంచుకోలేకపోతున్నాం. ఇదంతా కరోనా వైరస్ సృష్టించిన విలయం. మహమ్మారి కరోనా ఈ ఏడాదిలో ఎన్నో మార్పులు తెచ్చింది. ఏకంగా 2020 సంవత్సరం ఎప్పటికి ముగుస్తుందా? అని జనం చర్చించుకునే స్థాయిలో కొవిడ్-19 సమాజంపై ప్రభావం చూపింది. రెండు నెలలు మినహా ఏడాదంతా వేధించింది. ఇప్పుడిప్పుడే ఆ భయం నుంచి జనం కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు.
(విజయనగరం- ఆంధ్రజ్యోతి)
కరోనా వైరస్ జన జీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. 2020 సంవత్సరాన్ని గుప్పిట్లో పెట్టుకుని దాదాపు ఏడాదంతా వణికించింది. పక్కనున్న వ్యక్తి తుమ్మితే మాస్కును సవరించుకోవడం.. శానిటైజర్ చల్లుకోవడం మామూలైపోయింది. మానవాళిలో ఇంతటి భయాన్ని సృష్టించిన కరోనా... జిల్లాలో 200మందికి పైగా మరణించేందుకు కారణమైంది. ఇలా ఒక వైపు మానవ జీవనాన్ని స్తంభింపజేయడమే కాదు... అన్ని రంగాలనూ నష్టాల్లో పడేసింది. అన్ని వర్గాలకూ బతుకుదెరువుకు దూరం చేసింది. పొట్టచేత పట్టుకుని వలస వెళ్లిన వారంతా బతికుంటే బలుసాకు తిందామని తిరిగి సొంతూళ్లకు పయనమయ్యారు. మరోవైపు చాలా మంది ఆరోగ్యపరంగా అనేక ఇబ్బందులు, అవస్థలు పడ్డారు. మరోవైపు కరోనా జనానికి కొత్త అలవాట్లు పరిచయం చేసింది. ఇంటర్ నెట్‌తో జీవనాన్ని ముడేసింది.
కళతప్పిన శుభకార్యాలు
వివాహాది శుభకార్యాలపై కరోనా తీవ్ర ప్రభావం సృష్టించింది. ఉత్సవంలా నిర్వహించాల్సిన వివాహాలు, గృహ ప్రవేశాలు, పుట్టినరోజు ఫంక్షన్లను వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తరువాత రోజుల్లో కాస్తా వెసులుబాటు ఇచ్చినా ఆంక్షల కారణంగా ఘనంగా నిర్వహించే పరిస్థితి లేదు. ఆహ్వాన పత్రికలు కూడా ఆన్‌లైన్‌లోనే బంధువులకు, స్నేహితులకు అందిస్తున్నారు. వివాహ మహోత్సవాన్నీ ఆన్‌లైన్లోనే చూసి మురిసిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉండగా ఈ రంగంపై ఆధారపడిన వారంతా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సప్లయర్స్, కేటరింగ్ కార్మికులు, కల్యాణ మండపాల నిర్వాహకులు ఉపాధి కోల్పోయారు.
కార్మికులకు తిప్పలు
వివిధ జిల్లాలు.. రాషా్ట్రలకు వలస వెళ్లిన వారు తిరిగి గ్రామాలకు చేరుకున్నారు. ఇక్కడా ఉపాధి లేక విలవిల్లాడారు. జిల్లాలోనూ పరిశ్రమలు మూతపడడంతో అధిక సంఖ్యలో కార్మికులు రోడ్డున పడ్డారు. భవన నిర్మాణ కార్మికులు, క్వారీల్లో పనిచేసే వారు కూడా ఉపాధి కోల్పోయారు. గ్రామాల్లో ఉపాధి పనులు అందుబాటులో ఉన్నా అంతంతమాత్రమే. లావాదేవీలు స్తంభించిన కారణంగా అన్ని రంగాలూ ఆర్థికంగా దెబ్బతిన్నాయి.
మూతపడిన విద్యా సంస్థలు
2020-21 విద్యా సంవత్సరం అస్తవ్యస్తమైంది. పరీక్షలు నిర్వహించకుండానే పాస్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. విచిత్రం ఏమిటంటే 10వ తరగతి వంటి కీలకమైన పబ్లిక్ పరీక్షను కూడా రద్దు చేయాల్సి వచ్చింది. ఈ విద్యా సంవత్సరంలో 10వ తరగతి విద్యార్థులంతా సమాన ప్రతిభ కనబర్చిన వారిగా గుర్తించి ఉత్తీర్ణులైనట్టు సర్టిఫికెట్లు అందించారు. ఇంటర్, డిగ్రీ, పీజీ తదితర పరీక్షలు దఫదఫాలుగా వాయిదాలు పడుతూ చివరికి ఆలస్యంగా కొలిక్కివచ్చాయి. ఇప్పటికీ ఒకటి నుంచి ఐదో తరగతి విద్యార్థులకు తరగతులే నిర్వహించలేదు.
అంతా ఆన్‌లైన్‌లోనే..
ఇతర దేశాలు.. రాషా్ట్రల్లో పనిచేస్తున్న వారు ఇళ్లకు చేరుకుని ఆన్‌లైన్‌లో విధులు నిర్వహించారు. వెబినార్ ద్వారా సమావేశాలు, చర్చలు సాగించారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఇంటి నుంచే పనుల్లో నిమగ్నమయ్యారు. టెలీ, వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా పరిపాలన, వ్యాపార, వాణిజ్య రంగాలు పనిచేశాయి. కరోనా కారణంగా అనేక ప్రైవేటు, ప్రభుత్వ సంస్థలు వేగంగా ఈ మార్పులను అందుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో నెట్ కనెక్షన్ల కోసం వైఫై కనెక్టవిటీకి డిమాండ్ పెరిగింది. ప్రైవేట్ యాజమాన్యాలు, ఏపీ ఫైబర్ కేబుల్ ఆపరేటర్లు వినియోగదారుల నుంచి ఇనస్టలేషన్ చార్జీలు రూ.3 వేల నుంచి 5వేల వరకు వసూలు చేశారు.
తలకిందులైన రవాణా
కరోనా కారణంగా రవాణా రంగం తలకిందులైంది. కనీసం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లాలన్నా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆటో సర్వీసుల నుంచి ఆర్టీసీ బస్సుల వరకు మితంగా నడిచేవి. అయినా వాటిని ఆశ్రయించేందుకు సంకోచించేవారు. సొంత వాహనాన్ని ఏర్పాటు చేసుకునేందుకు సంసిద్ధులు కావాల్సి వచ్చింది. ఈ కారణంతోనే ద్విచక్ర వాహనాలు, కార్లు విపరీతంగా అమ్ముడుపోయాయి. మూడేళ్లలో జరగాల్సిన అమ్మకాలు ఆరు నెలల వ్యవధిలో జరిగాయి. ట్రాఫిక్ సమస్యలు పెరిగాయి. జిల్లాలోని సీతానగరం, పారాది వంతెనల వద్ద నిత్యం ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. గంటల తరబడి వాహనాలు నిలిచిపోతున్నాయి. ఉదయం 9 నుంచి రాత్రి 9గంటల వరకు ఈ రెండు వంతెనల వద్ద నలుగురు పోలీస్ సిబ్బందిని నియమిస్తూ ట్రాఫిక్ క్లియరన్స్‌కు వినియోగిస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
వినోదానికీ దూరం
కరోనా కారణంగా ప్రజలు వినోద కార్యక్రమాలకూ దూరమయ్యారు. ముఖ్యంగా సినిమాలు చూసే అవకాశం లేకుండాపోయింది. థియేటర్లు మూతపడ్డాయి. వీటిపై ఆధారపడిన కార్మికులు ఉపాధి కోల్పోయారు. మార్చి నుంచి డిసెంబరు మొదటి వారం వరకూ థియేటర్లలో సినిమాలే కనిపించలేదు. ఈ నెల మొదట్లో ఒకటో, అరో థియేటర్లు తెరచుకున్నాయి. డిసెంబరు 25 నుంచి మళ్లీ అక్కడక్కడా థియేటర్లలో సందడి మొదలైంది.
క్రీడలపై ప్రభావం
క్రీడారంగాన్ని కూడా కరోనా దెబ్బతీసింది. మైదానాలకు వెళ్లకుండా చేసింది. గ్రామ స్థాయి నుంచి అంతర్జాతీయ క్రీడలన్నీ నిలిచిపోయాయి. ఆర్మీ, నేవీ వంటి రంగాల్లో నియామకాలూ ఆగిపోయాయి. ఈ కారణంగా చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు ఆన్‌లైన్ గేమింగ్‌పై దృష్టిపెట్టారు. ఈ పరిస్థితిలో స్మార్ట్ ఫోన్ల వినియోగం భారీగా పెరిగింది. ఇతర గ్రామాల్లో ఉన్న బంధువులతో, స్నేహితులతో మాట్లాడాలన్నా ఫోన్ తప్పనిసరైంది. కరోనా కారణంగా నెట్వర్క్ రంగానికి బాగా కలిసి వచ్చింది. ముఖ్యంగా ఇంటర్‌నెట్ లేనిదే జీవనం గడవని పరిస్థితి ఏర్పడింది.
మాస్కు.. ముసుగులోనే
కరోనాకు ముందు మొహం అంతా కప్పుకుని ద్విచక్రవాహనంపై వెళ్లే వ్యక్తులను చూస్తే గుసగుసలాడేవారు. నేడు ప్రతి ఒక్కరూ మాస్క్ ముసుగు వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండాలంటే ప్రభుత్వం ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని నిబంధన విధించింది. దీంతో ఒకరిని ఒకరు పోల్చుకునే వీలు లేకుండా అందరూ ప్రయాణం సాగిస్తున్నారు.
మళ్లీ గ్రీన్‌జోన్‌లోకి..
విజయనగరం జిల్లాలో మే నెలవరకు ఒక్క కరోనా కేసుకూడా లేకుండా గ్రీన్ జోన్‌లో కొనసాగింది. దీనికి ఇటు ప్రజలు, అటు అధికారుల చర్యలు ఫలితాలిచ్చాయి. ఆ తరువాత కేసులు మొదలయ్యాయి. 41వేల మంది పైగా కరోనా బారిన పడ్డారు. 200మందికిపైగా మృతి చెందారు. ప్రస్తుతం రెండు రోజులుగా మళ్లీ గ్రీన్ జోన్‌గా కొనసాగుతోంది. ఆదివారం, సోమవారం వరుసగా ఒక్క కేసు కూడా జిల్లాలో నమోదు కాలేదు. ఇదే పరిస్థితి కొనసాగేలా ప్రతి ఒక్కరూ ప్రయత్నించాల్సి ఉంది. ఇతర దేశాలు, రాషా్ట్రల్లో కరోనా రెండో దశ విజృంభిస్తోంది. మన జిల్లా అందుకు భిన్నంగా సాగడం శుభపరిణామం.