ఎందుకలా?

ABN , First Publish Date - 2020-11-20T04:43:56+05:30 IST

పాచిపెంట మండలం మూటకూడు పంచాయతీ చిల్లమామిడి గిరిజన గ్రామంలోని పరిస్థితులపై ఉన్నత స్థాయిలో విచారిస్తున్నారు. ఈ గ్రామంలో ఒకే తరహా సమస్యతో అనేక మంది చనిపోవడం ఇటీవల చర్చనీయాంశమైంది. విషయం తెలుసుకున్న వైద్య శాఖ సమస్యను గుర్తించేందుకు నడుంబిగించింది.

ఎందుకలా?
వింత వ్యాధితో బాధపడుతున్న చిల్లమామిడి గిరిజనులు

వింత వ్యాధిపై వైద్య నిపుణుల ఆరా

త్వరలోనే చిల్లమామిడికి వైద్య బృందం

విశాఖ కేజీహెచ్‌కు ముగ్గురు గిరిజనుల తరలింపు

2018 అనంతరం మళ్లీ గ్రామంలో అలజడి

పాచిపెంట మండలం మూటకూడు పంచాయతీ చిల్లమామిడి గిరిజన గ్రామంలోని పరిస్థితులపై ఉన్నత స్థాయిలో విచారిస్తున్నారు. ఈ గ్రామంలో ఒకే తరహా సమస్యతో అనేక మంది చనిపోవడం ఇటీవల చర్చనీయాంశమైంది. విషయం తెలుసుకున్న వైద్య శాఖ సమస్యను గుర్తించేందుకు నడుంబిగించింది. త్వరలోనే గ్రామానికి ఉన్నత వైద్య బృందం రానుంది. ఒకే గ్రామాన్ని పట్టి పీడించడానికి గల కారణాలేమిటి? అనారోగ్య సమస్యలకు దారితీస్తున్న పరిణామాలు ఏమిటి? మద్యం.. మడ్డికల్లు తాగడం తదితర అంశాలేమైనా ఉన్నాయా? ఆహార అలవాట్లు కారణమా? పర్యావరణ సమస్యలేవైనా ఉన్నాయా? అనే కోణంలో ఇప్పటికే అధికారులు ఆరా తీస్తున్నారు.   


పార్వతీపురం/ పాచిపెంట, నవంబరు 19:

పాచిపెంట మండలం మూటకూడు పంచాయతీ చిల్లమామిడి గ్రామంలో గిరిజనులు వింత వ్యాధితో బాధ పడుతున్నారు. కాళ్లు, చేతులు పొంగడం.. శరీరంపై వాపు రావడంతో తెలిసిన వైద్యాన్ని ఆశ్రయిస్తున్నారు. బయట పడలేక కొందరు తనువు చాలిస్తున్నారు. ఈ విషయం బయటకు తెలియడంతో వైద్యశాఖ నిపుణులు ఆ గ్రామంలో పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. ఈ వ్యాధి ఎందుకు సోకింది? ఆహారపు అలవాట్లా?వ్యసనాలా? తాగునీరా? ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? అని లోతుగా తెలుసుకుంటున్నారు. పరిష్కారానికి రాష్ట్ర వైద్యాధికారులు త్వరలోనే చిల్లమామిడి గిరిజన గ్రామాన్ని సందర్శించాలని భావిస్తున్నారు. వింత వ్యాధి రావడానికి గల కారణాలను క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. గ్రామంలో ఐదుగురు గిరిజనులు వింత వ్యాధితో బాధపడగా... ఇందులో ఇద్దరు కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. మరో ముగ్గురు సింబోయిన లక్ష్మి, ముఖి అప్పమ్మ, సింబోయిన లచ్చయ్యలను వైద్యులు సాలూరు సీహెచ్‌సీ నుంచి విశాఖకు తరలించారు. విశాఖ వెళ్లేందుకు గిరిజనులు తొలుత నిరాకరించడంతో వారిని ఒప్పించి కేజీహెచ్‌కు తరలించారు. చిల్లమామిడి గిరిజన గ్రామంలో 2018లో పలువురు గిరిజనులు మృతిచెందారు. సింబోయిన సింహాచలం (42), ముఖి అమ్మన్న (55), ముఖి కొత్తయ్య (56), ముఖి అప్పలస్వామి తదితర గిరిజనులు అప్పట్లో ప్రాణాలు కోల్పోయారు. కలుషిత నీరు తాగడం వల్ల మృతి చెంది ఉంటారని అప్పట్లో అధికార యంత్రాంగం భావించి తాత్కాలిక చర్యలు చేపట్టారు. ఇదిలాఉండగా ఈ నెల 17న ముఖి వెంకటి(72), గత నెల 18న ముఖి పెద్దమ్మ కూడా ఇవే లక్షణాలతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో గ్రామానికి చెందిన గిరిజనులు వణుకుతున్నారు. చిల్లమామిడి గిరిజనులకు వింత వ్యాధి సోకినట్లు తెలుసుకున్న ఎమ్మెల్యే రాజన్నదొర దీనిపై ఐటీడీఏ పీవో ఆర్‌.కూర్మనాథ్‌, డీఎంఅండ్‌హెచ్‌వోలకు తెలియజేశారు. ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. వ్యాధి నివారణకు చర్యలు తీసుకోవాలని డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్‌ రవికుమార్‌రెడ్డికి ఫోన్‌లో ఆదేశించారు.

గ్రామానికి వెళ్లి పరిశీలిస్తా

వింత వ్యాధి రావడానికి కారణాలపై ఆరా తీస్తున్నాం. గ్రామానికి శుక్రవారం వెళ్లి పరిస్థితిని స్వయంగా తెలుసుకుంటాను. భవిష్యత్తులో గిరిజనులకు వింత వ్యాధి రాకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే గ్రామంలో వైద్య శిబిరం ప్రారంభించాం. ఇద్దరు గిరిజనులను కేజీహెచ్‌కు పంపించాం. వారిలో ఒకరు కోలుకొని... డిశ్చార్జ్‌ అయ్యారు. మరో ముగ్గురు గిరిజనులను సాలూరు సీహెచ్‌సీ వైద్యుల సూచనల మేరకు కేజీహెచ్‌కు తరలించాం. 

                            - ఆర్‌.కూర్మనాథ్‌, ఐటీడీఏ పీవో, పార్వతీపురం

Updated Date - 2020-11-20T04:43:56+05:30 IST