-
-
Home » Andhra Pradesh » Vizianagaram » We are giving real estate to the festival
-
పండుగకు స్థిరాస్థిని ఇస్తున్నాం
ABN , First Publish Date - 2020-12-30T05:30:00+05:30 IST
నిరుపేదలకు సంక్రాంతి పండుగ నాటికి స్థిరాస్తిని అందజేస్తున్నామని... పేదలకు ఇళ్లు అందజేయడం మహాయజ్ఞమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అన్నారు. ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా బుధవారం విజయనగరం మండలంలోని గుంకలాం గ్రామానికి వచ్చారు. తొలుత పైలానను ఆవిష్కరించారు.

నిరుపేదలకు ఇళ్లు అందజేయడం మహాయజ్ఞం
టీడీపీ అడుగడుగునా అడ్డు తగులుతోంది
గుంకలాం సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి
(విజయనగరం ఆంరఽధజ్యోతి/విజయనగరం రూరల్), డిసెంబరు 30:
నిరుపేదలకు సంక్రాంతి పండుగ నాటికి స్థిరాస్తిని అందజేస్తున్నామని... పేదలకు ఇళ్లు అందజేయడం మహాయజ్ఞమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అన్నారు. ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా బుధవారం విజయనగరం మండలంలోని గుంకలాం గ్రామానికి వచ్చారు. తొలుత పైలానను ఆవిష్కరించారు. అనంతరం మోడల్ గృహనిర్మాణాలను పరిశీలించారు. కలెక్టరు హరిజవహర్‌లాల్ అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. నిరుపేదలకు ఇళ్లివ్వడమనే మహాయజ్ఞానికి మాజీ సీఎం చంద్రబాబు, ఆయన అనుచరులు అడుగడుగునా అడ్డు తగులుతున్నారని సీఎం అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రభుత్వం చేపడుతున్న వివిధ కార్యక్రమాలను చెప్పడంతో పాటు..ప్రతిపక్ష పార్టీ తీరుపై విమర్శలు చేశారు. సీఎం ప్రసంగం ఆయన మాటల్లోనే... ‘మాజీ సీఎం చంద్రబాబు, ఆయన అనుచరులు కోర్టులకు వెళ్లి.. కుట్రలు పన్ని ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా చేస్తున్నారు. ఈ నెల 25న క్రిస్మస్, వైకుంఠ ఏకాదశి రోజున శుభఘడియల్లో ఇళ్ల స్థలాలు ఇవ్వడం ప్రారంభించాం. తొలి దశలో 15 లక్షల 60 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం. వచ్చే ఏడాది రెండోదశ కింద 12 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీకి రంగం సిద్ధం చేశాం. ఇళ్ల పట్టాలు ఇవ్వడమే కాకుండా... వాటి నిర్మాణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు రూ.7 వేల కోట్లను వెచ్చిస్తున్నాం. వీటితో పాటు 2 లక్షల 62 వేల మందికి టిడ్కో ఇళ్లు ఇస్తాం. పాదయాత్ర సమయంలో ప్రజల కష్టాలు చూశా. వారందరినీ ఆదుకునే ఉద్దేశంతోనే నవరత్నాల పేరిట సంక్షేమ పథకాలకు పెద్ద పీటవేశా.
అభివృద్ధిలో ప్రాధాన్యం
విజయనగరం జిల్లాకు సంబంధించి కురుపాంలో జేఎనటీయూ ఇంజినీరింగ్ కళాశాల నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ ప్రారంభమైంది. సాలూరులో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు సంబంధించి... కేంద్ర బృందం స్థలాన్ని పరిశీలించి... సంతృప్తి వ్యక్తం చేసింది. త్వరలో టెండర్ల ప్రక్రియ పూర్తికానుంది. విజయనగరంలో ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల నిర్మాణానికి వచ్చే నెలలో టెండర్లు పిలుస్తాం. మార్చిలో పనులు ప్రారంభమవుతాయి. తోటపల్లి ప్రాజెక్టుకు సంబంధించి 20 శాతం పనుల పూర్తికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. రూ.471 కోట్లతో రెండేళ్లలో పూర్తి చేస్తాం. తారకరామ తీర్థ సాగర్ ప్రాజెక్టును రూ.620 కోట్లతో రెండేళ్లలో పూర్తి చేస్తాం. వెంగళరాయసాగర్ ప్రాజెక్టు పూర్తికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. రాములవలస, లోచర్ల పథకాలకు అవసరమైన నిధులను కేటాయించి, దశల వారీగా పూర్తి చేస్తాం. పనిచేసే ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాల’లని ముఖ్యమంత్రి జగన పిలుపునిచ్చారు. ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ... ‘వందేళ్ల కిందట ఎప్పుడో భూ సర్వే జరిగింది. తాజాగా జగన ప్రభుత్వం భూ సర్వేకి శ్రీకారం చుట్టడం హర్షణీయమ’ని అన్నారు. మరో ఉపముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి మాట్లాడుతూ... గతంలో ముఖ్యమంత్రులు కొందరి కోసమే పని చేసేవారని... ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి అందరి సంక్షేమం కోసం పాటుపడుతున్నారని కొనియాడారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ భోగాపురం ఎయిర్‌పోర్టును గత పాలకులు పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. తోటపల్లి, తారకరామతీర్థసాగర్, వెంగళరాయ తదితర ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయాలని సీఎం జగన్మోహనరెడ్డిని బొత్స కోరారు. విజయనగరం నియోజకవర్గ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ... గుంకలాం వద్ద 397 ఎకరాల్లో 12,301 మందికి తొలి దశలో ఇళ్ల పట్టాలు ఇస్తున్నామన్నారు. ఈ కాలనీకి జేఎంఆర్ (జగన్మోహనరెడ్డి కాలనీ)గా నామకరణం చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మంత్రి అవంతి శ్రీనివాసరావు, ఇనచార్జి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యేలు పీడిక రాజన్నదొర, బొత్స అప్పలనర్సయ్య, శంబంగి వెంకట చినప్పలనాయుడు, బడ్డుకొండ అప్పలనాయుడు, కడుబండి శ్రీనివాసరావు, అలజంగి జోగారావు, అనకాపల్లి ఎమ్మెల్యే జి.అమరనాథ్, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీలక్ష్మి, వైసీపీ నాయకులు తలశీల రఘురాం, చిన్న శ్రీను, కలెక్టర్ హరిజవహర్‌లాల్, జాయింట్ కలెక్టర్లు కిషోర్‌కుమార్, ఆర్.మహేష్‌కుమార్, జి.వెంకటరావు, అసిస్టెంట్ కలెక్టర్ కట్టా సింహాచలం, డీఆర్‌డీఏ పీడీ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
మండుటెండలోనే..
గుంకలంలో ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమంలో లబ్ధిదారులు, అధికారులు మండుటెండలో గంటల తరబడి నిరీక్షించారు. టెంట్‌లు ఏర్పాటు చెయ్యకపోవటంతో వృద్ధులు ఆపసోపాలు పడ్డారు. పట్టాలు అందుకోవడానికి తప్పనిసరిగా సభకు హాజరు కావాలని వైసీపీ నాయకులు, వలంటీర్లు, వార్డు ఇన్‌చార్జ్జిలు ఒత్తిడి చేయడంతో చిన్నారులను సైతం వెంటబెట్టుకుని వచ్చారు. సుమారు 4 గంటల పాటు ఇబ్బందులు పడుతూ కూర్చొన్నారు. సభలో కొంతమందికే గొడుగులు అందాయి. మిగతావారు పేపర్లు, చీరకొంగులు, తువ్వాళ్లు అడ్డుపెట్టుకున్నారు. ముఖ్యమంత్రి మాట్లాడుతున్న సమయంలో ఎండకు తాళలేక కొంతమంది లబ్ధిదారులు, ప్రజలు, కార్యకర్తలు ఇంటికి తిరుగు ముఖం పట్టారు.
ఇంటి కల నెరవేరకుండానే...
ఇళ్ల పట్టా అందుకునేందుకు భార్యతో సంతోషంగా వచ్చిన ఓ వృద్ధుడు సభలోనే కుప్పకూలి ప్రాణాలొదిలాడు. విజయనగరంలోని అవనాపు వీధికి చెందిన మంతెన సత్తిబాబు (70)కు గుంకలాం లే అవుట్ ఎఫ్ బ్లాక్‌లో ఫ్లాట్ నెంబరు ఎఫ్ /1892 (భార్య మంతెన కళావ తి పేరున)ను కేటాయించారు. దీనిని తీసుకునేందుకు అందరితో పాటు కళావతి, సత్తిబాబులు బుధవారం గుంకలాం సభకు చేరుకున్నారు. పట్టా కోసం ఉదయం 8 గంటల నుంచి ఎండలో నిరీక్షించారు. వడదెబ్బకు గురైన సత్తిబాబు నీరసంగా ఉందని నీడ ఉన్న చోటుకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. అంతలోనే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. ఏఎనఎం వచ్చి సపర్యలు చేసినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. సీఎం ప్రసంగిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ విషయం బహిర్గతమైతే ఇబ్బంది కలుగుతుందన్న ఉద్దేశంతో వైద్య సిబ్బంది, అధికారులు మౌనం పాటించారు. మంతెన సత్తిబాబు, కళావతికి పిల్లలు లేరు. సొంతిల్లు కూడా లేకపోవడంతో ఆరోగ్యం బాగాలేకపోయినా ఆశతో ఇక్కడికి చేరుకున్నారు. ఎంతో ప్రయాసకు ఓర్చి చేరుకున్నా... పట్టా తీసుకోకుండానే ప్రాణాలు కోల్పోయాడు. భర్త మరణించడంతో భార్య కళావతి కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.