‘చెత్త’ శుద్ధి లోపించిన యంత్రాంగం.. మెరుగుపడని పారిశుధ్యం

ABN , First Publish Date - 2020-12-16T04:18:30+05:30 IST

‘వ్యర్థాలపై యుద్ధం’ కార్యక్రమం వల్ల జిల్లాలో కాత్తగా ఒనగూరేదేమీ లేకపోగా... గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ మరింత అస్తవ్యస్తంగా మారే ప్రమాదం ఉంది. పారిశుధ్యం మెరుగుపరిచే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. నిర్వహణలో లోపాల వల్ల అసలుకే ఎసరు అన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

‘చెత్త’ శుద్ధి లోపించిన యంత్రాంగం.. మెరుగుపడని పారిశుధ్యం
మెంటాడ: పోరామ్‌ హైస్కూల్‌ సమీపంలో పేరుకుపోయిన చెత్త

యుద్ధం.. వ్యర్థం!

ప్రచారానికే ప్రాధాన్యం

కలుషితమవుతున్న చంపావతి


మెంటాడ, డిసెంబర్‌ 15: ‘వ్యర్థాలపై యుద్ధం’ కార్యక్రమం వల్ల జిల్లాలో కాత్తగా ఒనగూరేదేమీ లేకపోగా... గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ మరింత అస్తవ్యస్తంగా మారే ప్రమాదం ఉంది. పారిశుధ్యం మెరుగుపరిచే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. నిర్వహణలో లోపాల వల్ల అసలుకే ఎసరు అన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు కరోనా కేసులు... మరోవైపు చలికాలంలో అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం పొంచి ఉండడం వంటి కారణాల నేపథ్యంలో ముందుజాగ్రత్తగా ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రకటించింది. అన్ని గ్రామాల్లోనూ నిర్వహణ ఒకేసారి సాధ్యం కాదంటూ మండలాన్ని యూనిట్‌గా తీసుకుని మూడు విడతల్లో పూర్తి చేయాలని నిర్దేశించింది. పారిశుధ్యం, తాగునీటిపై అవగాహన కల్పిస్తూ చైతన్యపరచాలని సూచించింది. మూడు విడతల్లో అని ఉన్నతాధికారులు చెప్పడంతో మండలంలోని పంచాయతీలను మూడు భాగాలుగా విభజించి ఇప్పటికే తొలివిడతను పూర్తిచేసి.. రెండో విడతకు వెళ్లారు. తొలివిడత పూర్తయిన గ్రామాల్లో నిత్యం చేపట్టాల్సిన పారిశుధ్య పనులు పూర్తిగా పడకేశాయి. మళ్లీ మనవంతు వచ్చేటప్పుడు చూద్దాంలే అని ఉద్యోగులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. దీంతో వీధుల్లో చెత్త పేరుకుపోతోంది. డ్రైనేజీలు పూడుకుపోయి... మురుగు రోడ్డెక్కుతోంది. గ్రామాలు కంపు కొడుతున్నాయి. దోమలు వీరవిహారం చేస్తున్నాయి. అంటువ్యాధులు ముసురుకుంటున్నాయి. వ్యర్థాలపై యుధ్ధం చేస్తున్న పంచాయతీల్లోని చెత్తను(తడి, పొడి) సంపద కేంద్రాలకు తరలించకుండా పారిశుద్ధ్య సిబ్బంది గ్రామ పొలిమేరల్లోనే కుప్పలుగా పడేస్తున్నారు. కొంతమంది ఆ కుప్పలకు నిప్పు పెట్టడంతో పొగ ఊరిని చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. శ్వాసకోశ పరమైన ఇబ్బందులను తెచ్చిపెడుతోంది. చంపావతి సమీప గ్రామాల్లోని కార్మికులు చెత్తను నదిలో వేసేస్తున్నారు. వ్యర్థాలపై యుద్ధం పుణ్యమాని రోజూ చెత్త సేకరణ అటకెక్కింది. కొత్త సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని ప్రజలు ఎద్దేవా చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో అందరినీ భాగస్వాముల్ని చేయాల్సిన సచివాలయ సిబ్బంది, వలంటీర్లు, అంగన్వాడీలు, ఆశాకార్యకర్తలే డుమ్మా కొట్టడం విమర్శలకు దారితీస్తోంది. జిల్లాలో చాలా చోట్ల ఇదే పరిస్థితి ఉంటోంది. పారిశుధ్య పరిస్థితులు అస్తవ్యస్తమవుతున్న నేపథ్యంలో ప్రజల్లో భయాందోళన మొదలైంది. కరోనా ఇంకా సజీవంగానే ఉండడం... ఇంకోవైపు ఏలూరు ఘటనను తలుచుకుంటూ భీతిల్లుతున్నారు. ఉన్నతాధికారులు ఈ పరిస్థితిపై దృష్టి సారించాలని కోరుతున్నారు.

 నిత్యం పారిశుద్ధ్య పనులు

‘వ్యర్థాలపై యుద్ధం’ కార్యక్రమానికి పైలెట్‌ ప్రాజెక్ట్‌గా కొన్ని పంచాయతీలు ఎంపిక చేశాం. మిగతా గ్రామాల్లో యుద్ధ ప్రాతిపాదికన పారిశుధ్య కార్యక్రమాలు చేపడుతున్నాం. డంపింగ్‌ యార్డులు లేక ఆరుబయట వ్యర్థాలు పారబోస్తున్నారేమో. నిత్యం పారిశుధ్య పనులు, క్లోరినేషన్‌ ఇదివరకులాగానే చేపట్టాలి. గ్రామాలు కంపుకొడితే ఉపేక్షించేది లేదు.

  - వాణిశ్రీ, పంచాయతీ విస్తరణాధికారి 



Updated Date - 2020-12-16T04:18:30+05:30 IST