నిరసన దారిలో...

ABN , First Publish Date - 2020-10-31T08:37:12+05:30 IST

తమ గ్రామాలకు పూర్తిస్థాయిలో రహదారులు నిర్మించాలని... రోడ్డు లేకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గిరిజనులు ఆందోళన వ్యక్తం చేశారు.

నిరసన దారిలో...

 రోడ్ల కోసం 54 కిలోమీటర్ల పాదయాత్ర


ఏజెన్సీలోని మారుమూల గ్రామాలు.. గూడేలకు రోడ్డు లేక నరకయాతన అనుభవిస్తున్న గిరిజనులు తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణయించుకున్నారు. అధికారులకు విన్నవించడానికి సాలూరు చుట్టు పక్కల గ్రామాలకు చెందిన దాదాపు 40 మంది కలసి కాలినడకన బయలుదేరారు. ఈ నెల 28న సీపీఎం ఆధ్వర్యంలో సాలూరులో ర్యాలీ ప్రారంభించారు. మూడు రోజుల పాటు 54 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. శుక్రవారం రాత్రి పార్వతీపురం ఐటీడీఏకు చేరుకొని... పీవోకు తమ సమస్యలను విన్నవించారు. 


పార్వతీపురం/ రూరల్‌/ సీతానగరం, అక్టోబరు 30 : తమ గ్రామాలకు పూర్తిస్థాయిలో రహదారులు నిర్మించాలని... రోడ్డు లేకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గిరిజనులు ఆందోళన వ్యక్తం చేశారు. రహదారులు లేకపోవడంతో...ఏ చిన్న అనారోగ్య సమస్య తలెత్తినా...సకాలంలో ఆస్పత్రికి వెళ్లలేక మృత్యువాత పడుతున్నామని వాపోయారు. ఈమేరకు ఐటీడీఏ పీవో కూర్మనాథ్‌ను కలసి తమ గోడు వినిపించారు. సీపీఎం ఆధ్వర్యంలో మూడు రోజుల కిందట పాదయాత్రగా బయలుదేరిన వీరు శుక్రవారం రాత్రికి ఐటీడీఏకు చేరుకున్నారు. అనంతరం పీవోకు సమస్యలను వివరించారు. దీనిపై పీవో కూర్మనాథ్‌ మాట్లాడుతూ గిరిజన గ్రామాలన్నింటికీ ప్రాధాన్య క్రమంలో రహదారులు నిర్మిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి గిరిజన గ్రామానికీ రహదారి నిర్మిస్తున్నామన్నారు. సీపీఎం నాయకులు రెడ్డి శ్రీరామ్మూర్తి తదితరులు మాట్లాడుతూ గిరిజనుల సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ పాదయాత్రను ముగిస్తున్నట్లు ప్రకటించారు. సాలూరు మండలంలోని కండవలస, జిల్లేడువలస, కొరియా, సిరివర తదితర గ్రామాల్లో బీటీ రోడ్లు నిర్మించాలని.. కందులపదం, దండిగాం, దిగువకుసాయివలస తదితర గ్రామాల్లో వంతెనలు నిర్మించాలని కోరుతూ ఈ పాదయాత్ర నిర్వహించారు. 


 అపూర్వ మద్దతు

సీతానగరం మండలంలోని అనేక గ్రామాల మీదుగా శుక్రవారం పాదయాత్ర సాగింది. చినభోగిలి, అంటిపేట, చిన్నారాయుడుపేట గ్రామాల వద్ద వారికి స్థానిక నేతలు మద్దతు పలికారు.  పార్వతీపురం మండలంలోని నర్సిపురంలో ఈ బృందానికి సీపీఎం నాయకులు రెడ్డి శ్రీరామ్మూర్తి స్వాగతం పలికారు. 

Read more