ఉపాధ్యాయ బదిలీలకు పచ్చజెండా

ABN , First Publish Date - 2020-10-13T09:20:59+05:30 IST

ఉపాధ్యాయ బదిలీలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ బి.రాజశేఖర్‌ సోమవారం రాత్రి జీవో నెంబరు 54ను విడుదల చేశారు.

ఉపాధ్యాయ బదిలీలకు పచ్చజెండా

 ఉద్యోగ విరమణకు రెండేళ్లు లోపు ఉన్న వారికి మినహాయింపు


సాలూరు రూరల్‌, అక్టోబర్‌ 12: ఉపాధ్యాయ బదిలీలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ బి.రాజశేఖర్‌ సోమవారం రాత్రి జీవో నెంబరు 54ను విడుదల చేశారు. ఉపాధ్యాయ బదిలీల మార్గదర్శకాలను అందులో వివరించారు. ఒక పాఠశాలలో ఎనిమిది అకడమిక్‌ విద్యాసంవత్సరాలు పూర్తయిన ఉపాధ్యాయులు, ఐదు అకడమిక్‌ విద్యాసంవత్సరాలు పూర్తిచేసిన గ్రేడ్‌ టూ ప్రధానోపాధ్యాయులను తప్పనిసరిగా బదిలీ చేస్తారు.


ఉద్యోగ విరమణకు ఇంకా రెండేళ్ల సమయం ఉన్న ఉపాధ్యాయులకు మినహాయింపు ఇచ్చారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య, ఉండాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య తదితర మార్గదర్శకాలతో జీవోను జారీ చేశారు. బదిలీలు కావాలని  గత ఏడాది జూన్‌ నుంచి ఉపాధ్యాయులు కోరుతున్నారు. అప్పట్లో దసరా సెలవుల్లో బదిలీ చేస్తారని ప్రభుత్వం ప్రకటించినా చేపట్టలేదు. సంక్రాంతి సెలవుల్లో బదిలీలు ఉంటాయని గతేడాది నవంబర్‌ ఐదున విద్యాశాఖ మంత్రి  సురేష్‌ ప్రకటించారు. అప్పుడూ కాలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి పలువురు ఉపాధ్యాయులు ఏడు నుంచి పదేళ్లకు పైగా ఒకే స్థానంలో పనిచేస్తున్నారు.


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2010, 2012, 2013, నవ్యాంధ్రలో 2015,2017ల్లో వరుసగా బదిలీలు జరిగాయి. ఆ సంవత్సరాల్లో తమకు నచ్చిన స్థానాల్లో చేరిన వారు బదిలీల కోసం ఎదురు చూస్తున్నారు. 2010 జూన్‌, 2012 జూలై, 2013 మేలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బదిలీలు జరిగాయి. నవ్యాంధ్రలో 2015 అక్టోబర్‌, 2017 ఆగస్టులో బదిలీలు జరిగాయి. రాష్ట్రంలో 15 వేల మంది ఉపాధ్యాయులు ప్రస్తుతం బదిలీల కోసం ఎదురుచూస్తున్నారు. 


జిల్లాలో 3,500 మంది

 జిల్లాలో దాదాపు 3,500 మంది వరకు ఉపాధ్యాయులు బదిలీల కోసం ఎదురుచూస్తున్నారు. వీరిలో ఎనిమిదేళ్లు నిండిన ఎస్జీటీ(సెకండరీ గ్రేడ్‌ టీచర్స్‌)లు 727 మంది, పాఠశాల సహాయకులు 250 మంది, పీఈటీలు ఇద్దరు, పీడీలు 43 మంది, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు (ఎల్‌ఎఫ్‌ఎల్‌) 40 మంది, ఐదేళ్లు నిండిన ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు 21 మంది ఉన్నట్టు ఉపాధ్యాయ వర్గాలు తెలిపాయి. బదిలీలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో ఉపాధ్యాయులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయ బదిలీల కోసం ఫ్యాప్టో సోమవారం చేపట్టిన నిరాహార దీక్ష ఉద్యమం విజయవంతమయ్యిందని ఆ సంఘ నేత మీసాల గౌరీశంకరరావు అన్నారు.  

Updated Date - 2020-10-13T09:20:59+05:30 IST