‘పక్కా’ ప్లాన్?
ABN , First Publish Date - 2020-03-02T10:42:50+05:30 IST
‘పక్కా’ ప్లాన్?

రేషన్‌కార్డుల సంఖ్యకు మించి పక్కా ఇళ్లు
పెదచామలాపల్లిలో ప్రత్యేకం
తాజాగా మరికొందరికి ఇళ్ల పట్టాలు
అందులోనూ కొందరు అనర్హులు
నేత ల ఒత్తిళ్లకు అధికారుల జీహుజూర్
మెంటాడ, మార్చి 1: సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపికకు రేషన్‌కార్డులను ప్రాతిపదికగా తీసుకునే ప్రభుత్వ అధికారులు ఈ విషయంలో మెంటాడ మండలంలోని పెదచామలాపల్లి గ్రామానికి మినహాయింపు ఇచ్చారేమో అన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఈ గ్రామంలో రేషన్‌కార్డుల సంఖ్య కన్నా ప్రభుత్వం మంజూరుచేసిన పక్కా ఇళ్ల సంఖ్య ఎక్కువగా ఉండడమే దీనికి కారణం. గ్రామంలో హౌసింగ్ అక్రమాలు జరిగాయని జనం కోడై కూస్తుంటే అధికారులు అవేవీ పట్టించుకోకుండా తాజాగా మరో 14 ఇళ్లు మంజూరు చేయడం విశేషం. వీరిలో కూడా కొందరు అనర్హులున్నట్లు తెలుస్తోంది.
పెదచామలాపల్లి గ్రామంలో ప్రస్తుతమున్న తెల్ల రేషన్‌కార్డుల సంఖ్య 247 కాగా ఇప్పటి వరకు వివిధ పథకాల కింద ఆ గ్రామానికి (ఇందిరమ్మ, ఎన్‌టీఆర్ తదితర పథకాల్లో) మంజూరైన పక్కా ఇళ్లు 308. అంటే కార్డులకన్నా పక్కా ఇళ్లు 61 ఎక్కువ. ఇదెలా సాధ్యమైందో అధికారులకే తెలియాలి. సాధారణంగా సంక్షేమ పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేసినప్పుడు రేషన్‌కార్డును ప్రాతిపదికగా తీసుకుంటారు. కార్డు నెంబర్‌ను ఆన్‌లైన్‌లో చెక్ చేయడం ద్వారా ఆ వ్యక్తి లేదా కుటుంబం ఇదివరకు ఏఏ సంక్షేమ పథకాలు పొందిదీ సులువుగా గుర్తిస్తారు. అయితే పెదచామలాపల్లి విషయంలో అధికారులు ఆ ప్రక్రియను ఉద్దేశపూర్వకంగానే విస్మరించారా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఆధార్‌కార్డు ప్రాతిపదికన చూస్తే కుటుంబ పెద్ద లబ్ధి పొందిందీ లేనిది మాత్రమే గుర్తించే వీలుంటుంది. అదే రేషన్‌కార్డును చెక్‌చేస్తే ఆ కుటుంబంలో ఎవరి పేరున మంజూరైనా తెలిసిపోతుంది. అందువల్ల యంత్రాంగం రేషన్‌కార్డునే ప్రాతిపదికగా తీసుకోవడం పరిపాటి. అయితే ఈ గ్రామంలో కార్డులకన్నా పక్కా ఇళ్లు ఎక్కువగా ఉండడానికి చాలా కుటుంబాలకు గతంలో రెండేసి చొప్పున ఇళ్లు మంజూరు చేసేసారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని కుటుంబాలకు భార్యాభర్తలిద్దరిపేరునా ఇళ్లు మంజూరయ్యాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా ఇది పొరపాటున జరిగిందా? అధికారులు ఉద్దేశపూర్వకంగా చేశారా అన్నదానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రలోభాలకు లోనై ఉద్యోగులు అక్రమాలకు అవకాశమిచ్చారని పలువురు బహి రంగంగా విమర్శిస్తున్నారు. రేషన్ కార్డుల కన్నా 61 పక్కా ఇళ్లు అధికంగా ఉండడానికి కారణమిదేనని చెబుతున్నారు.
తాజాగా మరికొందరికి ..
ఇదిలా ఉంటే తాజాగా నవశకం కార్యక్రమంలో భాగంగా గ్రామంలో మరో 14 మందికి పక్కా ఇళ్ళు మంజూరయ్యాయి. అందులోనూ కొందరు అనర్హులుండడం చర్చనీయాంశమవుతోంది. వీరిలో కొందరికి ఇదివరకు ఇల్లు మంజూరై బిల్లులు చెల్లింపు జరిగిపోగా, తాజాగా అదే కుటుంబంలో మరో వ్యక్తి పేరున మంజూరవడం ఇక్కడి అవకతవకలకు అద్దం పడుతోంది. ఇప్పుడు కూడా అధికారులు పక్కాగా పరిశీలన చేయలేదని స్పష్టమవుతోంది. ఉదాహరణకు గ్రామానికి చెందిన కొండమ్మ గతంలో ఇల్ల బిల్లు పొందారు. సురేష్ అనే మరో వ్యక్తి కూడా గతంలో ఇల్లు బిల్లు పొందారు. తాజాగా వీరికి ఇల్లు మంజూరైంది. కాగా నవశకంలో భాగంగా మండలానికి 281 పక్కా ఇళ్లు మంజూరు కాగా ఇందులో 40 నుండి 50 శాతం వరకు అనర్హులున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. స్థానిక నాయకుల ఒత్తిడితో అధికారులు అడ్డు చెప్పలేకపోయారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తంమ్మీద పెదచామలాపల్లి వ్యవహారం తలనొప్పిగా తయారైందని ఇప్పటికే ఉద్యోగ వర్గాల్లో చర్చ నడుస్తోంది. నేతల ఒత్తిళ్లు తమ పీకల మీదకు తెచ్చేలా ఉన్నాయని లోలోపల దిగులు చెందుతున్నారు.
ఇదే విషయాన్ని వీఆర్‌వో రామునాయుడు వద్ద ప్రస్తావించగా గ్రామ సభల ద్వారా 22 మంది నిరుపేదలకు ఇళ్ల స్థలాలను ఎంపిక చేశామని, జాబితాను గృహ నిర్మాణ శాఖకు పంపించామని, గతంలో ఎవరైనా ఇళ్లు పొందినట్లయితే వారిని అనర్హులుగా గుర్తించి తొలగిస్తామని అన్నారు. రేషన్ కార్డులకన్నా ఎక్కువ ఇళ్లు మంజూరయ్యాయని తెలిసిందన్నారు.
ఫ దీనిపై హౌసింగ్ ఏఈ త్రినాధ్ వివరణ కోరగా రేషన్‌కార్డుల కన్నా ఇళ్లు ఎక్కువ ఎలా మంజూరయ్యాయో తెలియదన్నారు. ఇందిరమ్మ ఇళ్ల సమయంలో జరిగి ఉండవచ్చునని, పెదచామలాపల్లి గ్రామానికి ఇల్లు ఇవ్వాలంటే ఆలోచించాల్సి వస్తోందన్నారు. తాను ఇటీవలే వచ్చానని, ఇల్లు కొత్తగా ఎవరికీ మంజూరు కాలేదని, అయినా పరిశీలిస్తానని చెప్పారు.