వేకువనే పింఛన్
ABN , First Publish Date - 2020-03-02T10:38:28+05:30 IST
వేకువనే పింఛన్

ఉదయానికే చాలా చోట్ల పుంజుకున్న పంపిణీ
ముందుగా వలంటీర్లకు సమాచారం ఇచ్చి చెల్లింపులు
రాష్ట్రంలో నాలుగో స్థానంలో మన జిల్లా
నెట్వర్క్ లేని చోట్ల ఇబ్బందులు
(విజయనగరం - ఆంధ్రజ్యోతి)
ప్రభుత్వం వేకువజాము నుంచే పింఛన్ల పంపిణీ ప్రారంభించాలని ఇచ్చిన మౌఖిక ఆదేశాలను జిల్లాలో చాలాచోట్ల వలంటీర్ల అనుసరించారు. ఎంపీడీవో ఆదేశాలతో సచివాలయ సిబ్బంది వలంటీర్లను ముందస్తుగానే సన్నద్ధం చేశారు. కార్యదర్శులు శనివారం అర్ధరాత్రి నుంచే ఫోన్లలో ఎప్పటికప్పుడు అందుబాటులోకి వచ్చి ఇళ్లకు పంపారు. కొన్నిచోట్ల వలంటీర్లు స్వచ్ఛందంగానే త్వరగా నిద్ర లేచి పింఛన్లను పంపిణీ చేశారు. అందుకనే పింఛన్ల పంపిణీలో రాష్ట్రంలో జిల్లా నాలుగో స్థానంలో నిలిచింది.
గడపగడపకు వెళ్లిఒకటో తేదీనే గరిష్ఠ స్థాయిలో పింఛన్లు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఆ మేరకు అధికారులకు సూచనలు ఇచ్చింది. పైనుంచి వచ్చిన ఆదేశాలను అనుసరిస్తూ వలంటీర్లు, సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్‌లు కలసి ఆదివారం వేకువజాము నుంచే ఇళ్లకు వెళ్లి లబ్ధిదారుల బయోమెట్రిక్ తీసుకుని పింఛన్లు అందజేశారు. ఈ విధంగా అనేక మండలాల్లో పింఛన్ల పంపిణీ వేగంగా ప్రారంభమైంది. మండలాల్లో ఎంపీడీవోలు.. మున్సిపాలిటీల్లో కమిషనర్లు వీటిపై ప్రత్యేక శ్రద్ధ వహించారు. ఎస్.కోట మండల కేంద్రంలో తెల్లవారు జామున 3గంటల నుంచే వలంటీర్లు వీధుల్లోకి వెళ్లి పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ముందు రోజునే వీరికి సమాచారం అందించారు. జిల్లా కేంద్రంలోని డీఆర్‌డీఏ- గ్రామీణాభివృద్ధి సిబ్బంది కూడా రాత్రి 12 గంటలు దాటిన తరువాత పింఛన్ల పంపిణీకి సంబంధించిన రోల్స్‌ను ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేశారు. తద్వారా తెల్లవారుజాము మూడు గంటలకే పంపిణీ చేసేందుకు అవకాశం కలిగింది. ఇదిలా ఉండగా కొన్ని మండలాల్లో పంపిణీ మందకొడిగా సాగింది. ముఖ్యంగా ఏజన్సీ మండలాల్లో తక్కువ శాతం పంపిణీ నమోదైంది. నెట్వర్క్ అందుబాటులో లేని కారణంగా ఈ పరిస్థితి ఎదురైంది. దీనిని దృష్టిలో పెట్టుకుని సిగ్నల్స్ ఉన్న ప్రాంతానికి లబ్ధిదార్లను రప్పించి పంపిణీ చేపట్టడం గమనార్హం. ఇలాంటి ఇబ్బందుల వల్ల గుమ్మలక్ష్మీపురం మండలంలో ఆదివారం సాయత్రం 6గంటల సమయానికి 40శాతమే పంపిణీ చేయగలిగారు. కురుపాం మండలం తరువాత స్థానంలో ఉంది. ఈ మండలంలో 52శాతమే పంపిణీ నమోదైంది. అయితే ప్రతి గంటను పింఛన్ల పంపిణీ విషయంలో అధికారులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకోవడం ద్వారా డ్వామా పీడీ, ఎంపీడోవోలు పింఛన్ల పంపిణీని పర్యవేక్షించారు. ఉదయం 7గంటలకే జిల్లాలో 30 శాతం, 8గంటలకు 50 శాతం పూర్తి చేశారు. సాయంత్రం 6.30కి 90శాతం పంపిణీ పూర్తి చేశారు. జిల్లాలో అత్యధికంగా బొండపల్లి మండలంలో 7535 మంది పింఛన్‌దార్లకు గాను 7308 మందికి అంటే 96.99 శాతం పంపిణీ చేశారు. తరువాత స్థానంలో రామభద్రపురం ఉంది. ఇక్కడ 95.69 శాతం పూర్తి చేశారు. అత్యల్పంగా గుమ్మలక్ష్మీపురం, కురుపాం ఏజన్సీ మండలాలున్నాయి.
పార్వతీపురం మండలంలో ఉదయం ఐదు గంటలకే పంపిణీ ప్రారంభించారు. పార్వతీపురం మున్సిపాలిటీలో తెల్లవారు జామున 4.15 సమయంలో మున్సిపల్ కమిషనర్ కనక మహాలక్ష్మి పింఛన్ల పంపిణీని పర్యవేక్షించారు. సాలూరు, బొబ్బిలి మండలాల్లోనూ, మున్సిపాలిటీల్లో పంపిణీ ఉదయాన్నే ప్రారంభించారు. ఇలా 34 మండలాల్లోనూ సిబ్బంది ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని పంపిణీ చేశారు. దీంతో రాష్ట్ర స్థాయిలో సాయంత్రం 6గంటల సమయానికి 90శాతం పూర్తిచేయగలిగారు.
రాత్రి 10వరకు పంపిణీ చేస్తాం
సాయంత్రం 6.30 గంటలకు 90శాతం పంపిణీ చేశామని డీఆర్‌డీఏ పీడీ సుబ్బారావు తెలిపారు. ఏజెన్సీ మండలాల్లో నెట్వర్క్ సమస్య వల్ల ఇంకా పంపిణీ జరగుతున్నదని, దీనిని దృష్టిలో పెట్టుకుని మరింత శాతం పెరిగి రెండు లేదా మూడో స్థానాల్లో ఉండొచ్చునని అన్నారు. రాత్రి పది గంటల వరకూ పంపిణీ కొనసాగించేలా సూచనలు ఇచ్చామన్నారు.