ఇటు రావద్దు

ABN , First Publish Date - 2020-04-05T10:15:00+05:30 IST

కరోనా మహమ్మారి నియంత్రణకు జిల్లా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు.

ఇటు రావద్దు

సరిహద్దుల్లో కంచె

జిల్లాలో ఇతరుల ప్రవేశానికి అడ్డుకట్ట

ఉద్యోగులకు ఇక్కట్లు 

నిత్యావసరాలు.. అత్యవసర పరిస్థితిలో సడలింపు

విశాఖలో కేసులు ఉన్న కారణంగానే.


(విజయనగరం-ఆంధ్రజ్యోతి)/ గంట్యాడ: కరోనా మహమ్మారి నియంత్రణకు జిల్లా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. అన్ని సరిహద్దులను మూసేస్తున్నారు. విశాఖ నుంచి వచ్చే రహదారులన్నీ శనివారం మూసివేశారు. ఆ జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు ఉండడంతో  ఎవరినీ విజయనగరం వైపు రానీయడం లేదు. నిత్యావసరాలు, పాలు, మందులు వంటి అత్యవసరాలకు కాస్త మినహాయింపు ఇచ్చారు. విశాఖ జిల్లాతో పాటు మిగిలిన జిల్లాల్లో భారీగా కరోనా కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విశాఖ జిల్లాను రెడ్‌జోన్‌గా ప్రకటించారు. దీనిని దృష్టిలో పెట్టుకుని అక్కడున్న వైరస్‌ మన జిల్లాకు రాకుండా ఉండేలా పోలీస్‌ శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది.


ఎస్పీ బి.రాజకుమారి రాత్రి పూట కూడా సరిహద్దు చెక్‌ పోస్టులను తనిఖీ చేస్తున్నారు. ఇటీవల ఒడిశా సరిహద్దుగా ఉన్న పి.కోనవలస కేంద్రాన్ని ఎస్పీ పరిశీలించారు. ఈ విధంగా కొమరాడ మండలం కూనేరు, పాచిపెంట, పార్వతీపురం, ఎస్‌.కోట, కొత్తవలస, డెంకాడ, భోగాపురం, పూసపాటిరేగ, గుమ్మలక్ష్మీపురం ఇలా సరిహద్దు జిల్లాలు, ఒడిశా రాష్ట్రాల నుంచి వచ్చే సరిహద్దుల వద్ద సైతం చెక్‌పోస్టుల ద్వారా కట్టడి చేశారు. గత రెండు రోజుల వరకు కాస్తా వెసులుబాటు ఉండేది. కానీ తాజాగా జిల్లా పరిధి సరిహద్దుల్లో సైతం కట్టుదిట్టం చేశారు. స్టాపర్లు పెట్టి పూర్తిగా రాకపోకలను ఆపేశారు. 


విధి నిర్వహణకు ఎలా?

జిల్లా కేంద్రంతోపాటు మండల స్థాయిలో విధులు నిర్వహిస్తున్న చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు విశాఖ నుంచి వస్తున్నారు. నిత్యం ఇక్కడికి వచ్చి విధులు నిర్వహించుకుని తిరిగి ఇంటికి చేరుతున్నారు. చాలా సంవత్సరాలుగా ఇదే తరహాలో కార్యకలపాలను కొనసాగిస్తున్నారు. గతంలో పని చేసిన కలెక్టర్లు, ఇటువంటి అధికారులపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్త్తం చేసిన సందర్భాలు ఉన్నాయి.


అయినా చాలా మంది అధికారుల్లో మార్పు రాలేదు. ఇప్పుడు కరోనా ప్రభావంతో  విశాఖపట్టణం జిల్లా సరిహద్దును శనివారం పూర్తిగా మూసివేశారు. జిల్లాలో విధులు నిర్వహించడానికి వస్తున్న అధికారులను కూడా అడ్డుకున్నారు. ఇప్పటి వరకూ చెక్‌ పోస్టు వద్ద తనిఖీ చేసినప్పుడు గుర్తింపు కార్డులు చూపించి జిల్లాకు వచ్చేవారు. శనివారం అనుమతించకపోవడంతో తిరుగు ప్రయాణమైనట్టు తెలిసింది.


స్థానికంగా ఉండాల్సిందే... బి.రాజకుమారి, ఎస్పీ

విశాఖను రెడ్‌జోన్‌గా ప్రభుత్వం ప్రకటించింది. కరోనా పాజిటివ్‌ కేసులు ఎక్కువగా ఉంటున్నాయి. విజయనగరంలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఈ పరిస్థితిలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లా సరిహద్దుల వద్ద నిఘా పెంచాం. రవాణాను కట్టుదిట్టం చేశాం. ఈనెల 14వరకు 144 సెక్షన్‌ అమల్లో ఉంటుంది. నిత్యావసర, అత్యవసర సేవలు మినహా ఎవ్వరినీ అనుమతించేది లేదు. ఒక వేళ మన జిల్లా నుంచి విశాఖ వెళ్లాలంటే అనుమతిస్తాం. కానీ తిరిగి ఎట్టి పరిస్థితిలోనూ జిల్లాలోకి రావడానికి వీల్లేదు. ఉద్యోగులు విధిగా జిల్లాలో ఉండాల్సిందే. 

                                   

Updated Date - 2020-04-05T10:15:00+05:30 IST