మేమని...మీరని..వేరుగా లేమని!

ABN , First Publish Date - 2020-05-24T08:26:31+05:30 IST

విజయనగర పట్టణంలోని చారిత్రక కట్టడాలంతా కలసి సమష్టిగా చేసుకుంటున్న విన్నపాలు వినండి. శతాబ్దాల మీ చరిత్రకు... మీ సంస్కృతీ ..

మేమని...మీరని..వేరుగా లేమని!

ప్రభుత్వ పెద్దలకు.... అధికార మహాశయులకు శతకోటి వందనాలు.విజయనగర పట్టణంలోని చారిత్రక కట్టడాలంతా కలసి సమష్టిగా చేసుకుంటున్న విన్నపాలు వినండి. శతాబ్దాల మీ చరిత్రకు... మీ సంస్కృతీ సంప్రదాయాలకు మేం చిహ్నాలం. మేమూ మీరూ వేరు కాదని.. మీ జీవితంలో మేమూ భాగమేనని అందరూ చెబుతుంటే మా సంతోషానికి అవధులే ఉండవు. ఏ దూరదేశపు పర్యాటకులో... చరిత్రకారులో.... మనదేశంలోని వివిధ ప్రాంతాల ప్రజలో మాచెంతకు వచ్చి... మమ్మల్ని చూసి... మన పూర్వీకుల నిర్మాణశైలిని... మన రాజుల కళాపిపాసను... ఈ సంస్కృతీ సంపదను కాపాడుకుంటున్న మీ మంచిమనసులను మెచ్చుకుంటుంటే... ఎంతో గర్వంగా ఉంటోంది. మాచెంతన నిలుచొని అందరూ ఫొటోలు దిగుతుంటే... ఈ రోడ్ల  మీద.. ఈ కూడళ్లలో...ఎండావానలకు తడుస్తూ నిలవడమే కాదు... మీ ఇళ్లలోకి...  మీ జ్ఞాపకాల్లోకి మేము చేరుతున్నందుకు ఆనందంతో మా గుండెలు ఉప్పొంగేవి.


ఈ గడ్డ మీద పుట్టిన వారే కాదు... ఎక్కడెక్కడో ఉన్న కవులు... రచయితలు... చరిత్రకారులు మా విశిష్టతను పుస్తకాల్లో వర్ణించినపుడు... మామీద డాక్యుమెంటరీలు నిర్మించినపుడు కలిగిన ఆనందాన్ని మాటల్లో చెప్పలేం. ఇన్నాళ్లూ మీ గుండెల్లో పెట్టుకుని మమ్మల్ని కాపాడుకున్నందుకు వేనవేల కృతజ్ఞతలు. కానీ నిన్నటికి నిన్న సాయం సంధ్యవేళ... విజయనగరం పట్టణ ప్రధాన కూడలిలోని మూడులాంతర్లను అధికారులు నిర్దాక్షిణ్యంగా కూల్చేసిన తీరు మమ్మల్ని ఎంతగానో కలచివేసింది. అభివృద్ధి చేయాలనుకుంటే.. ఆ పక్కనే మరో నిర్మాణం చేపడితే సరి. లేదంటే ఉన్న దీపాలకే కొత్త సొబగులు అద్దినా సరిపోతుంది. కానీ ఏకంగా కూల్చివేయడం దారుణం కాదా? అధికారుల తీరును చూశాక మా భవిష్యత్తుపై బెంగతో ఈ లేఖ రాస్తున్నాం. మేమూ భవిష్యత్తులో ఉంటామో... యంత్రాల దాడితో నేలకొరుగుతామో తెలియక తల్లడిల్లుతున్నాం. దయచేసి మీ వారసత్వ సంపదగా ఉన్న మమ్మల్ని కాపాడాలని చేతులెత్తి వేడుకుంటున్నాం. ఎలాగూ మూడులాంతర్లను కూల్చేసారు. కనీసం మమ్మల్నయినా బతకనివ్వండి. మీ చరిత్రకు ఆనవాలుగా నిలవనివ్వండి. ఒక్కసారి చరిత్ర మా చెబుతాం వినండి. ఆ తరువాత మీ ఇష్టం.


  నేను విజయనగరం రాజుల కోటను. మహారాజుల వైభవానికి... చారిత్రక వైశిష్ట్యానికి నిదర్శనంగా నిలుస్తున్నా నేను.. విజయనగరం పట్టణానికే మకుటాయమానంగా భాసిల్లుతున్నానని చెప్పుకుంటారు. 1713లో రెండోవిజయరామరాజు హయాంలో నన్ను నిర్మించారు. ఒకప్పుడు రాజుల నివాసభవనంగా ఉన్న నేను ప్రస్తుతం చదువుల తల్లికి గుడిగా మారాను. నా ఒడిలోనే అనేక విద్యా సంస్థలు నడుస్తున్నాయి. ఎంతోమంది  నా ఒడిలో అక్షరాలు దిద్ది... ఉన్నతస్థాయికి చేరుకుంటున్నారు. ప్రసిద్ధిచెందిన మూడులాంతర్లు మా రాజుల హయాంలో నిర్మించినవే. ఆధునికీకరణ పేరుతో మూడులాంతర్లను కూల్చివేసిన నేపథ్యంలో నా భద్రతపైనా భయం కలుగుతోంది. దయచేసి నన్నయినా కాపాడండి.


గంటస్తంభం

నేను గంటస్తంభాన్ని. విజయనగరం పేరు చెబితే ఠక్కున గుర్తొచ్చేది నేనే. 1885లో నన్ను నిర్మించారు. ఇతర దేశాల నుంచి తెప్పించిన గడియారాలను నా గోడల్లో అమర్చారు. అవి ఇప్పటికీ పనిచేస్తూ సమయాన్ని తెలియజేస్తున్నాయి. పట్టణం నడిబొడ్డున ఉన్న నేను ఒకప్పుడు  ఏమూల నిల్చున్న వారికైనా కనిపించేదానిని. కాలక్రమంలో భారీ భవంతులు పెరగడంతో వాటిని దాటుకొని నేను దూరప్రాంతాలకు కనిపించే అవకాశం లేదు. ప్రస్తుతం సమీపానికి వస్తేనే కనిపిస్తాను. ‘గంటస్తంభం దగ్గరకు వెళ్లి చూస్తే చరిత్ర చదివిన అనుభూతి కలుగుతుంద’ని అందరూ చెబుతుంటే సంతోషంగా ఉంటోంది. సందేహం లేదు. ఆధునికీకరణ పేరుతో పురాతన కట్టడాలను అధికారులు కూల్చివేస్తున్న ప్రస్తుత తరుణంలో   నా  భవిష్యత్తుపైనా బెంగ కలుగుతోంది. నన్ను ఇలాగే పదికాలాల పాటు నిలవనివ్వాలని చేతులెత్తి ప్రార్థిస్తున్నాను. 

- విజయనగరం

Updated Date - 2020-05-24T08:26:31+05:30 IST