భూములు భద్రమేనా..!

ABN , First Publish Date - 2020-09-25T10:50:14+05:30 IST

విజయనగరం పట్టణంలో కబ్జా సంస్కృతి పెచ్చుమీరుతోంది. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు చోటా నాయకులు తిష్ట వేసేయాలని చూస్తున్నారు. ఆక్రమణదారులకు లెక్కే

భూములు భద్రమేనా..!

రూ.కోట్ల విలువైన స్థలాలు కబ్జా

విజయనగరం జిల్లా కేంద్ర ంలో అక్రమాలు

చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం 

 

విజయనగరం కార్పొరేషన్‌ పరిధిలో అనేక చెరువులు.. ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి. ఇవి ఎకరం రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్లు విలువ చేసేవే. ఈ స్థలాలపై కబ్జాదారులు కన్నేస్తున్నారు.  వివిధ రూపాల్లో ఆక్రమణలకు పాల్పడుతున్నారు. ఇదంతా అధికారుల కళ్ల ముందే జరుగుతున్నా... కనీసం పట్టించుకుంటున్న దాఖలాలు లేవు. మీడియాలో కథనాలు వచ్చేవరకూ ఆక్రమణల సంగతి తమకు తెలియనట్టే వ్యవహరిస్తున్నారు. ఇది ఆక్రమణదారులకు వరంగా మారుతోంది. 


(విజయనగరం-ఆంధ్రజ్యోతి)

విజయనగరం పట్టణంలో కబ్జా సంస్కృతి పెచ్చుమీరుతోంది. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు చోటా నాయకులు తిష్ట వేసేయాలని చూస్తున్నారు. ఆక్రమణదారులకు లెక్కే లేదు. ప్రధానంగా చెరువు స్థలాలు, రోడ్డు పక్క ఖాళీ జాగాలను గుర్తించడం... తమ నాయకునికి ఓ మాట చెప్పడం... గుట్టుగా చదును చేయడం మొదలెడుతున్నారు. ఎవరైనా స్థలం యజమాని వచ్చి నిలదీస్తే బెదిరింపులకు దిగుతున్నారు. అది ప్రభుత్వ స్థలమైతే సొంతం చేసుకుంటున్నారు. మరోవైపు అనధికారికంగా లేఅవుట్‌ వేయడం.. కొనుగోలుదారులకు ఆశలు కల్పించి వారితో డబ్బులు కట్టించుకుని తర్వాత రిజిస్ట్రేషన్‌లకు సవాలక్ష సాకులు చెప్పి తప్పించుకోవడం కొందరు పనిగా చేసుకుంటున్నారు. ఈ భూములు సంబంధిత వ్యక్తులకు చెందినవని భావించి..కొనుగోలు చేసేవాళ్లు ఆ తరువాత వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. 


తాజాగా విజయనగరం పట్టణంలో రెండు చోట్ల ప్రభుత్వ చెరువులను కబ్జా చేసేందుకు వీలుగా ఏర్పాట్లు జరిగాయి. సింగపూర్‌ సిటీ వద్ద ఉన్న ఎర్రచెరువుకు సర్వే నెంబరు 815లోని 9 ఎకరాలుంది. చెరువును ఇతరుల అమ్మకానికి పెట్టేసి చెరువు గర్భాన్ని కప్పేసి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులతో ఒప్పందం కుదుర్చుకున్నారు. దీన్ని ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తీసుకువచ్చింది. రెవెన్యూ యంత్రాంగం స్పందించి ఇప్పటికే కోర్టులో ఉన్న స్థలాన్ని ఎలా కబ్జా చేస్తారంటూ అడ్డుకుంది. 


అలాగే ఎస్‌వీఎన్‌ నగర్‌ లేఔట్‌ ప్రధాన రోడ్డులోనూ, రింగ్‌ రోడ్డుకు సమీపంలోని సుజాతా కన్వెన్షన్‌ హాల్‌ను ఆనుకుని ఉన్న విలువైన చెరువు గర్భం మీదబంద కబ్జాకు కొంతమంది ప్రయత్నాలు ముమ్మరం చేశారు.  ఈ స్థలంలో ఇప్పటికే విజయనగరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మాణానికి రెవెన్యూ శాఖ ప్రతిపాదించింది. ఇంతటి విలువైన చెరువు గర్భం సర్వే నెంబర్‌ 86/5లోని 5.16 ఎకరాల స్థలంపై కొంత మంది రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల కన్ను పడింది. చెరువు దిగువన పూర్వం ఆయకట్టుగా ఉన్న రైతులను మభ్య పెట్టి ఈ స్థలం రిజిస్ట్రేషన్‌ కోసం గత కొన్నేళ్లుగా ప్రయత్నాలు సాగుతున్నాయి. రెవెన్యూ రికార్డుల్లో స్పష్టంగా చెరువు గర్భంగా నమోదై ఉన్న కారణంగా వెబ్‌ల్యాండ్‌లో పరిశీలించిన రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులు వాటిని రిజిస్ట్రేషన్‌ చేయటం లేదు. విశాఖ లేదా ఇతర జిల్లాల్లో ఆన్‌లైన్‌లో పెండింగ్‌ రిజిస్ట్రేషన్ల పేరుతో దొడ్డిదారిన రిజిస్ట్రేషన్‌ చేసేందుకు వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం. రెవెన్యూ శాఖ ఇప్పటికైనా స్పందించి   బోర్డులు ఏర్పాటు చేస్తే కబ్జాలను కొంతవరకైనా నియంత్రించే అవకాశం ఉంటుంది. కానీ ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్న దాఖలాలు లేవు.


 ప్రభుత్వ స్థలాల కబ్జా విషయాన్ని తహసీల్దార్‌ ప్రభాకరరావు వద్ద ప్రస్తావించగా ఎస్‌వీఎన్‌ నగర్‌ను ఆనుకుని ఉన్న ఆయకట్టు లేని చెరువు(మీదబంద)ను ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మాణం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామన్నారు. చెరువు గర్భం కావటం వల్ల ప్రభుత్వ అనుమతి తప్పనిసరని చెప్పారు. ప్రభుత్వ స్థలాలను సంరక్షించే చర్యలు చేపడతామన్నారు. 

Updated Date - 2020-09-25T10:50:14+05:30 IST