అంగన్‌వాడీలకూ సెలవు

ABN , First Publish Date - 2020-03-23T09:41:30+05:30 IST

అంగన్‌వాడీ కేంద్రాలు మంగళవారం నుంచి మూత పడే అవకాశం ఉంది. వాటికి కూడా సెలవులు ఇవ్వనున్నారు. కరోనా వైరస్‌ సృష్టిస్తున్న అలజడి నేపథ్యంలో పిల్లలు, గర్భిణులు, బాలింతలకు

అంగన్‌వాడీలకూ సెలవు

రేపటి నుంచి తాత్కాలికంగా మూత పడే అవకాశం

వారం రోజులు పౌష్టికాహారం అందించేందుకు చర్యలు

అదనంగా గుడ్లు పంపిణీకి ప్రణాళిక 


(పార్వతీపురం)

అంగన్‌వాడీ కేంద్రాలు మంగళవారం నుంచి మూత పడే అవకాశం ఉంది. వాటికి కూడా సెలవులు ఇవ్వనున్నారు. కరోనా వైరస్‌ సృష్టిస్తున్న అలజడి నేపథ్యంలో పిల్లలు, గర్భిణులు, బాలింతలకు ఎటువంటి హాని కలగకూడదని ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. వాస్తవంగా పాఠశాలలతో పాటే అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవులు ప్రకటిస్తారని అంతా భావించారు. పౌష్టికాహారం పంపిణీపై సమగ్ర కార్యాచరణ రూపొందించడంలో జాప్యం జరగడంతో సెలవులపై అధికారులు ఆలస్యంగా నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉండగా ఈ నెల 24 నుంచి వారం రోజుల పాటు లబ్ధిదారులకు పౌష్టికాహారం అందించాలని అధికారులు భావిస్తున్నారు. దీనిపై జిల్లా అధికారులకు స్పష్టమైన సమాచారం రాకపోవడంతో అధికారికంగా ప్రకటించలేదు.


జిల్లాలోని 18 ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో 3,729 అంగన్‌వాడీ కేంద్రాలు పని చేస్తున్నాయి. ఈ కేంద్రాల్లో చిన్నారులు, బాలింతలు, గర్భిణులు కలిపి 1,38,529 మంది ఉన్నారు. సెలవులు అధికారికంగా ప్రకటిస్తే మంగళవారం నుంచి లబ్ధిదారుల ఇంటింటికీ వెళ్లి వారం రోజుల పాటు పౌష్టికాహారం అందించనున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో ఏ విధంగా వంట చేసి పౌష్టికాహారం అందిస్తారో అదే తరహాలో ప్రతిరోజూ సరుకుల పంపిణీ చేస్తారు. ఏజెన్సీ ప్రాంతాల్లో వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషకాహార పథకం కింద ప్రతి రోజు గుడ్డు, 200 ఎంఎల్‌ పాలు, రోజుకు 100 గ్రాముల చొప్పున పిల్లలకు బాలామృతాన్ని అందిస్తున్నారు.


అలాగే 36 నెలల నుంచి 72 నెలల వయసు చిన్నారులకు భోజనంతో పాటు గుడ్డు, 200 ఎంల్‌ పాలు, ప్రతిరోజూ పాయసం లేదా లడ్డూ లేదా బిస్కెట్లు నెలలో 25 రోజులు పాటు అందిస్తారు. గర్భిణులు, బాలింతలకు భోజనం, ప్రతి రోజు గుడ్డు, 200 ఎంఎల్‌ పాలు, నెలలో మొదటి వారం రెండు కేజీల అట్టా, రెండో వారం 500 గ్రాముల వేరుశెగన చక్కీలు, మూడో వారం 500 గ్రాముల రాగి పిండి, 500 గ్రాముల బెల్లం, నాలుగో వారం 500 గ్రాముల నువ్వుండలు నెలలో 25 రోజులు పాటు అందిస్తున్నారు.


ఈ ప్రకారమే ఈ నెల 31వ తేదీ వరకు సరిపడా పౌష్టికాహారం లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పంపిణీ చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇదే సమయంలో ప్రస్తుతం అందిస్తున్న గుడ్లు కంటే అదనంగా మరో గుడ్డును రోజుకు ఒకటి చొప్పున ఈ నెల 31వ తేదీ వరకు అందించనున్నారు.


ఆదేశాలు రావాల్సి ఉంది

జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవులపై అధికారికంగా ఆదేశాలు రావాల్సి ఉంది. సోమవారం యథావిధిగా కేంద్రాలు పనిచేస్తాయి. ఆదేశాలు వచ్చిన వెంటనే ప్రభుత్వ నిబంధనల ప్రకారం పౌష్టికాహారం పంపిణీ చేస్తాం. బహుశా మంగళవారం నుంచి కేంద్రాలకు సెలవులు ఇచ్చే అవకాశం ఉంది.

- రాజేశ్వరి, జిల్లా ఐసీడీఎస్‌ పీడీ

Updated Date - 2020-03-23T09:41:30+05:30 IST