ఆచరణకు ‘దూరం’

ABN , First Publish Date - 2020-03-30T10:48:46+05:30 IST

కరోనాపై అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయంలో నేతలే సామాజిక దూరాన్ని పాటించని దృశ్యాలు ఆదివారం

ఆచరణకు ‘దూరం’

గుంపులుగానే రేషన్‌ అందుకున్న వినియోగదారులు

ఆర్భాటంగా ప్రారంభ కార్యక్రమం

సమూహంలోనే డిప్యూటీ సీఎం

చాలాచోట్ల కనిపించని సామాజిక దూరం

వైరస్‌ వ్యాప్తిపై స్థానికుల్లో అందోళన

చేపలమార్కెట్‌లోనూ గుంపులుగా జనం


ఉచిత రేషన్‌ పంపిణీలో సామాజిక దూరం పాటించలేదు. గుంపులుగానే డిపోల వద్దకు వెళ్లారు. ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా నిబంధనలను పట్టించుకోలేదు. తమ చుట్టూ జనం ఉన్నా కూడా అవగాహన తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న దశలో ఆదివారం నుంచి పంపిణీ చేసే రేషన్‌ కోసం డిపో వద్దకు వెళ్లే వారు తప్పకుండా సామాజిక దూరం పాటించాలని.. చేతులు శుభ్రం చేసుకోవాలని.. సబ్బు, శానిటైజర్‌లను డిపోల వద్ద ఉంచాలని ప్రభుత్వం చెప్పింది. ఆచరణలో చాలా చోట్ల ఆ పరిస్థితి కనిపించలేదు. సాక్షాత్తూ డిప్యూటీ సీఎం పాల్గొన్న కార్యక్రమంలో కూడా ఆమెకు దగ్గరగానే నాయకులు, అధికారులు కనిపించారు. 


విజయనగరం(ఆంధ్రజ్యోతి) మార్చి29 :

కరోనాపై అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయంలో నేతలే సామాజిక దూరాన్ని పాటించని దృశ్యాలు  ఆదివారం కనిపించాయి. విజయనగరంలోని అవనాపు వీధిలో ఉచిత బియ్యం.. కందిపప్పు పంపిణీకి ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి హాజరయ్యారు. ఆ సమయంలో కరోనాపై ఎవరూ కనీస జాగ్రత్తలు పాటించకపోవడం విస్మయానికి గురిచేసింది. ఇలా అయితే వైరస్‌ వ్యాప్తి నిరోధక చర్యల ఫలితం ఏముంటుందని ఆ వీధిలోని ప్రజలు చర్చించుకున్నారు. ప్రభుత్వం చేపట్టిన రేషన్‌ పంపిణీలో జిల్లా వ్యాప్తంగా అనేక చోట్ల జనం సమూహంగా కనిపించారు.


ఎస్‌.కోట, పార్వతీపురం, బొబ్బిలి, సాలూరులో కొన్ని డిపోల్లో అడుగు దూరం కూడా పాటించకుండా రేషన్‌ కోసం బారులుతీరారు. ముఖ్యమంత్రి సూచనతో విలేకర్ల సమావేశాలు ఏర్పాటు చేసి మరీ జాగ్రత్తలు చెప్పిన నేతలే ప్రజల వద్దకు వచ్చేసరికి వాటిని విస్మరిస్తున్నారు. జిల్లాలో 144వ సెక్షన్‌, లాక్‌డౌన్‌, జాతీయ విపత్తు అమల్లో ఉన్నపుడు ప్రారంభోత్సవాలు చేసేందుకు అనుమతి ఎలా వచ్చిందనేదానిపై ప్రజల నుంచి అనేక సందేహాలు వినిపించాయి. కలెక్టర్‌ తగిన చర్యలు తీసుకోకపోవడాన్ని పలువురు విమర్శించారు.


కాగా కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టాలంటే జాగ్రత్త చర్యలొక్కటే మార్గం.. సామాజిక దూరం పాటించకుంటే తప్పదు భారీ మూల్యం అంటూ ప్రపంచ ఆరోగ్యసంస్థ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రచారం చేస్తున్నాయి. మనుషుల మధ్య కనీసం రెండు మీటర్ల దూరం పాటించాలని, మాస్క్‌లు ధరించాలని కలెక్టర్‌, ఎస్పీ, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు గొంతు చించుకునేలా చెబుతున్నా కొంతమంది నేతలు పట్టించుకోవడం లేదు. విజయనగరంలోని అవనాపు వీధిలో స్థానిక ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి ఆధ్వర్యంలో పౌరసరఫార శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.


కరోనా మహమ్మారిని తరిమికొట్టాలన్న సంకల్పం సర్వత్రా ఉట్టిపడాల్సిన సమయంలో నేతల వద్ద జనం గుమిగూడడం.. వారిని అనుసరించడం చర్చనీయాంశమైంది. ఉదయం 10.30 గంటలకు కార్యక్రమం అని నిర్వాహుకులు ప్రచారం చేయటంతో అధిక సంఖ్యలో జనాలు వచ్చారు. పుష్పశ్రీవాణి 11.30 గంటలకు హాజరయ్యారు. గంటపాటు వందమందికి పైగా ప్రజలు అదే ప్రాంతంలో కిక్కిరిసి గడిపారు. వీరిలో చాలామంది మాస్క్‌లు కూడా ధరించలేదు. కొందరు దగ్గుతూ, తమ్ముతూ కనిపించారు. ఈ పరిస్థితిని గమనించిన మహిళలు, వృద్ధులు ఆందోళన చెందారు. 


చేపల మార్కెట్‌లోనూ..

కరోనా వ్యాప్తిని అరికట్టాలంటే స్వీయ నియంత్రణ ఒక్కటే మార్గామని వైద్యులు చెబుతుండగా చేపల మార్కెట్‌లో  జనం ఆదివారం ఎగబడ్డారు. చేపలు, మటన్‌, చికెన్‌ కోసం గుంపులు గుంపులుగా కనిపించారు. జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ రైతు బజార్‌ సమీపంలో ఉన్న చేపల మార్కెట్‌ వద్ద వినియోగదారులు గుంపులుగా కనిపించారు. పెద్దమార్కెట్‌, చినమార్కెట్‌లో కూడా మాంసాహార ప్రియులు నిబంధనలను ఏమాత్రం పట్టించుకోలేదు.

Updated Date - 2020-03-30T10:48:46+05:30 IST