పీవీజీ విగ్రహం దగ్గర మౌనం పాటించిన ఊర్మిళ గజపతి

ABN , First Publish Date - 2020-10-28T18:04:47+05:30 IST

పైడితల్లి సిరిమానోత్సవంలో పూసపాటి వంశీయుల పంచాయితీ హాట్‌టాపిక్‌గా మారింది.

పీవీజీ విగ్రహం దగ్గర మౌనం పాటించిన ఊర్మిళ గజపతి

విజయనగరం: పైడితల్లి సిరిమానోత్సవంలో పూసపాటి వంశీయుల పంచాయితీ హాట్‌టాపిక్‌గా మారింది. కోట బురుజుపై కూర్చోవడానికి మాన్సాస్ ఛైర్మన్ సంచయిత పేచీ పెట్టారు. ముందుగా వచ్చిన ఆనందగజపతిరాజు భార్య సుధ, కుమార్తె ఊర్మిళ కోటపై కూర్చున్నారు. అయితే ఆ ఇద్దరిని కోట నుంచి దింపాలని పోలీసులపై సంచయిత రుస రుసలాడారు. వారిని కోట నుంచి కిందికి వెళ్లమని తాము చెప్పలేమంటూ పోలీసులు ఆమెకు తేల్చి చెప్పారు. దీంతో సంచయిత కోటకు మరోవైపు కుర్చీ వేసుకుని కూర్చొని ఉత్సవాన్ని తిలకించారు. అయితే సంచయిత తీరుకు నిరసనగా బుధవారం ఆనందగజపతి రాజు రెండవ భార్య సుధ, ఊర్మిళ మౌనం పాటించారు. ఆనందగజపతిరాజు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.


విజయనగరం చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి కొత్త కొత్త వివాదాస్పదమైన అంశాలను తెరమీదరకు తీసుకురావడానికి ప్రధాన కారకులుగా మాన్సాస్ ఛైర్మన్ సంచయిత నిర్ణయాలే కారణమని విజయనగరంలో ప్రతి ఒక్కరు చర్చించుకుంటున్నారు. మహారాజకోట బురుజులపై నుంచి సిరిమానోత్సవాన్ని సందర్శించే సంప్రదాయం కొన్ని దశాబ్దాల నుంచి సాగుతూ వస్తోంది. ఎవరినీ కోటపైకి రానీయకుండా తలుపులు మూసేయమని సంచయిత అధికారులకు చెప్పారు. అలాగే దేవాదాయ శాఖ అధికారులను పిలిచి కోటపై కూర్చున్న ఆనందగజపతిరాజు భార్య సుధ, కుమార్తె ఊర్మిళను కిందకు పంపించేయమని చెప్పించారు. దీన్ని అవమానంగా భావించిన సుధ, ఊర్మిళ ఇద్దరూ కిందికి దిగి వారి బంగ్లాలోకి వెళ్లిపోయారు. 

Updated Date - 2020-10-28T18:04:47+05:30 IST