గ్రీన్‌జోన్‌ దిశగా

ABN , First Publish Date - 2020-12-28T04:56:02+05:30 IST

కరోనా చెర నుంచి వీడుతున్నామని అనుకుంటున్న జిల్లా ప్రజలకు తాజా కబురుతో మరింత ఊరట కలిగింది. కొవిడ్‌ కేసులు జిల్లాలో మొదలయ్యాక మొదటిసారిగా ఆదివారం ఒక కేసు కూడా నమోదు కాలేదు.

గ్రీన్‌జోన్‌ దిశగా
కరోనా పరీక్షలు చేస్తున్న దృశ్యం

జిల్లాలో తొలిసారిగా నమోదు కాని కరోనా కేసులు

కొద్దిరోజులుగా సింగిల్‌ డిజిట్‌లోనే

ఊరట చెందుతున్న ప్రజలు

విజయనగరం (ఆంధ్రజ్యోతి)/ కలెక్టరేట్‌, డిసెంబరు 27 : కరోనా చెర నుంచి వీడుతున్నామని అనుకుంటున్న జిల్లా ప్రజలకు తాజా కబురుతో మరింత ఊరట కలిగింది. కొవిడ్‌ కేసులు జిల్లాలో మొదలయ్యాక మొదటిసారిగా ఆదివారం ఒక కేసు కూడా నమోదు కాలేదు. వైరస్‌ ప్రభావం కొద్దికొద్దిగా తగ్గుముఖం పడుతోందనడానికి తాజా పరిస్థితే ఓ ఉదాహరణగా అధికారులు చెబుతున్నారు. కేసుల తగ్గుముఖంతో వైద్య సిబ్బంది ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్నారు. భౌతిక దూరం పాటించడం.. మాస్క్‌ ధరించడం.. శానిటైజర్‌ వాడకంలో జిల్లా ప్రజలు ముందున్నారు. ఎవరికి వారు అవగాహనతో జాగ్రత్తలు తీసుకోవడం వల్లే వైరస్‌ జిల్లాలో తొందరగా అదుపులోకి వచ్చింది. ఇకముందు కూడా ఇదే విధంగా కొనసాగాలని..ఏమరుపాటు వద్దని అధికారులు సూచిస్తున్నారు. సెకెండ్‌ వేవ్‌ ప్రభావం జిల్లాపై పడకూడదంటే యథావిధిగా జాగ్రత్తలు తీసుకోవాలని  చెబుతున్నారు. ఈ ఏడాది మార్చి 24న లాక్‌డౌన్‌ సమయంలో కరోనా ప్రభావాన్ని ప్రజలు ఊహించలేదు. ప్రాణాలు తీసే మహమ్మారి అని అనుకోలేదు. తొలుత దేశంలోకి.. తర్వాత రాష్ట్రంలోకి.. చివరకు జిల్లాకు వైరస్‌ వ్యాపించింది. కొన్ని నెలల పాటు అందరినీ వణికించింది. జిల్లాలో రోజుకు 600కు పైగా కేసులు నమోదయ్యేవి. కరోనా వారియర్స్‌గా ఉన్న వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుధ్య కార్మికుల సంయుక్త కార్యాచరణతో మహమ్మారి రాష్ట్రంలోని మిగతా జిల్లాల కంటే ముందుగానే అదుపులోకి వచ్చింది. కొద్దిరోజులుగా నాలుగు లేదా ఐదు చొప్పున కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ఆదివారం ఒక కేసు కూడా నమోదు కాలేదు. ఈనెల ఒకటి నుంచి 26వ తేదీ వరకు జిల్లాలో 74వేల 41 కొవిడ్‌ పరీక్షలను చేయగా 310 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. 

గ్రీన్‌జోన్‌లో జిల్లా: కలెక్టర్‌

జిల్లా ప్రస్తుతం గ్రీన్‌జోన్‌లోకి వెళ్లిందని కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల మొదటి నుంచి 26 తేదీ వరకూ చేపట్టిన కరోనా పరీక్షల్లో కేసులు తగ్గడంతో పాటు మూడు మరణాలు మాత్రమే సంభవించాయని తెలిపారు. గతవారం రోజులతో పోల్చుకుంటే 20తేదీన 4 కేసులు, 21న 8 కేసులు, 22, 23 తేదీల్లో 4 కేసులు, 24న 6 కేసులు చొప్పున నమోదైనట్లు పేర్కొన్నారు. 26 తేదీన ఒక్క కేసు కూడా నమోదు కాలేదని, కొవిడ్‌ రెండో దశ విస్తరించకుండా ఉండేందుకు 50 రోజుల కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకున్నామన్నారు. ఈ సమయంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉంటే జిల్లాను గ్రీన్‌జోన్‌లో కొనసాగించేందుకు దోహదపడినవారవుతారని పేర్కొన్నారు. 


Updated Date - 2020-12-28T04:56:02+05:30 IST