‘పిల్లకాలువ’లని వదిలేశారు!

ABN , First Publish Date - 2020-08-18T11:56:04+05:30 IST

తోటపల్లి ప్రాజెక్టు నీరు ఆయకట్టు అంతటికీ పూర్తి స్థాయిలో అందడం లేదు.

‘పిల్లకాలువ’లని వదిలేశారు!

పొలాలకు చేరని తోటపల్లి జలాలు

పూర్తి కాని పిల్ల కాలువల నిర్మాణం

సేకరించాల్సిన భూమి 155 ఎకరాలు

రూ.57.31 కోట్ల బిల్లులూ పెండింగే 

సర్కారు ప్రకటనపై అన్నదాతల ఆశలు


తోటపల్లి ప్రాజెక్టు నీరు వస్తుందని సంబరపడిన రైతులకు ఏళ్లుగా నిరాశే మిగులుతోంది. కాలువ తవ్వకాలు చేపట్టినా సంవత్సరాల కొద్దీ పనులు పూర్తి కావడం లేదు. జలాలు పొలాలకు చేరడం లేదు. రిజర్వాయర్‌ కుడి ప్రధాన కాలువ ద్వారా ఇబ్బడిముబ్బడిగా నీరు విడుదల చేస్తున్నప్పటికీ నీరు మాత్రం ఆయకట్టు అంతటికీ చేరడం లేదు. చాలా చోట్ల పిల్ల కాలువల నిర్మాణం నిలిచిపోయింది. వాటికి భూ సేకరణ కొలిక్కి రాలేదు. మరోవైపు బిల్లులూ పెండింగ్‌లో ఉండడంతో పనులకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. 


(చీపురుపల్లి): తోటపల్లి ప్రాజెక్టు నీరు ఆయకట్టు అంతటికీ పూర్తి స్థాయిలో అందడం లేదు. గత ప్రభుత్వం 2015 సెప్టెంబరు 11న తోటపల్లి ప్రాజెక్టును ఆగమేఘాల మీద జాతికి అంకితం చేసింది. కుడి ప్రధాన కాలువ నిర్మాణాన్ని వేగంగా పూర్తిచేసి నీళ్లు వదిలింది. అయితే పూర్తి స్థాయిలో నీరందడం లేదు. పిల్ల కాలువల నిర్మాణం పూర్తికాకపోవడమే ఈ పరిస్థితికి కారణం. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరి ఏడాదిన్నర గడిచినా పిల్ల కాలువల నిర్మాణం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా ఉంది.


ప్రభుత్వాలు మారుతున్నా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన తోటపల్లి ఆయకట్టుదారులకు న్యాయం జరగడం లేదు. అవసరమైన నిధులు విడుదల కాక, పిల్ల కాలువల నిర్మాణం పూర్తికావడం లేదు. తోటపల్లి జలాశయం కుడి ప్రధాన కాలువ ద్వారా విజయనగరం జిల్లాలోని 13 మండలాల్లో సుమారు 47 వేల ఎకరాలు, శ్రీకాకుళం జిల్లాల్లోని ఏడు మండలాల్లో 64 వేల ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉంది. కుడి ప్రధాన కాలువ పనులు పూర్తి కావడంతో 2015లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. దీంతో రైతులంతా సంబరాలు చేసుకున్నారు.


అయితే సంవత్సరాలు గడుస్తున్నా.. పొలాలకు నీరందించాల్సిన ప్రధాన పిల్ల కాలువలు, చిన్న పాటి కాలువల పనులు ముందుకు సాగడంలేదు. దీంతో నాలుగేళ్లుగా చాలా ప్రాంతాల్లోని రైతులు కుడి ప్రధాన కాలువకు ఎక్కడపడితే అక్కడ గండ్లు కొట్టి తమ ప్రాంతాల్లోని చెరువులకు నీరందే ఏర్పాట్లు చేసుకున్నారు. జల చౌర్యానికి సంబంధించి పలు చోట్ల రైతుల మధ్య ఘర్షణలు జరిగి పోలీసులు జోక్యం చేసుకున్న సంఘటనలూ   ఉన్నాయి.  


సేకరించాల్సింది 155 ఎకరాలు

తోటపల్లి కుడి ప్రధాన కాలువ 52,450 కి.మీ. నుంచి 117.890 కి.మీ వరకూ విస్తరించి ఉంది. మధ నున్న సుమారు 75 కిలో మీటర్ల పరిథిలో పిల్ల కాలువలు, డిస్ట్రిబ్యూటరీలు, సబ్‌ డిస్ట్రిబ్యూటరీల పనులు జరగాల్సి ఉంది. ఈ నిర్మాణాలకు సంబంధించి రెండు జిల్లాల్లో 115 ఎకరాల భూమి అవసరమని అధికారులు గుర్తించారు. అంటే విజయనగరం జిల్లాలోని తెర్లాం మండలం నుంచి కాలువ చివరి వరకూ కాలువ పొడవునా నిర్మాణ పనుల కోసం భూమిని సేకరించాల్సి ఉంది. పార్వతీపురం, బొబ్బిలి, చీపురుపల్లి, శ్రీకాకుళం జిల్లాలోని ఆమదాలవలస భూసేకరణ కార్యాలయాల పరిథిలో మొత్తం 155.75 ఎకరాలు సేకరించాల్సి ఉంది. దీంట్లో 17.69 ఎకరాలు ప్రభుత్వ భూములుండగా, మిగిలిన 133.06 ఎకరాలు రైతుల నుంచి తీసుకోవాలి. దీంట్లో 45.42 ఎకరాలకు బిల్లులు కూడా అధికారులు అప్‌లోడ్‌ చేయగా, 45.18 ఎకరాలకు బిల్లులు అప్‌లోడింగ్‌కు సిద్ధంగా ఉన్నాయి. మరో 1507 పనులు జరగాల్సి ఉంది.


 లైనింగ్‌ పనులు ఎప్పుడో..

కుడి ప్రధాన కాలువ తవ్వకం పూర్తయి సంవత్సరాలు గడుస్తున్నా.. కాలువలో లైనింగ్‌ పనులు ఇంకా మొదలు కాలేదు. దీంతో ప్రధాన కాలువ పొదలతో నిండిపోయింది. నీటి పారుదలకు ఆటంకం కలిగించే విధంగా పెరిగిపోయిన వీటిని తొలగించి, వెంటనే లైనింగ్‌ పనుల ప్రారంభించాలని ఆయకట్టుదారులు డిమాండ్‌ చేస్తున్నారు.


చిన్న కాలువలను నిర్మించాలి..  రేగిడి వరహాలమ్మ, రేగిడిపేట, చీపురుపల్లి మండలం.

పొలాలకు తోటపల్లి నీరందడం లేదు. పిల్ల కాలువలు లేక సాగునీరు గగనమైంది. పెద్ద కాలువ తవ్వి ఐదారేళ్లు పూర్తయినా,   చిన్న కాలువల తవ్వకాన్ని పట్టించుకోవడం లేదు. ఇవి పూర్తయితేనే రైతులకు ఆనందం.

వచ్చే నెలాఖరులోగా భూ సేకరణ పూర్తి..జే.శ్రీనివాస్‌, డీఈఈ, తోటపల్లి ప్రాజెక్టు.


తోటపల్లి కుడి ప్రధాన కాలువ పరిథిలో మిగిలి ఉన్న డిస్ట్రిబ్యూటరీలు, ఇతర నిర్మాణ పనుల కోసం సుమారు 155 ఎకరాలు సేకరించాల్సి ఉంది. రెండు జిల్లాల ఉన్నతాధికారుల మధ్య ఇటీవల చర్చలు జరిగాయి. 2020 సెప్టెంబరు నెలాఖరులోగా భూ సేకరణ పూర్తి చేసి మాకు అప్పగించవచ్చు. భూములు అప్పగించగానే మిగిలిన పనులు పూర్తి చేస్తాం.

Updated Date - 2020-08-18T11:56:04+05:30 IST