-
-
Home » Andhra Pradesh » Vizianagaram » The mass war on Corona
-
ఒక్కరూ కదల్లేదు!
ABN , First Publish Date - 2020-03-23T09:39:42+05:30 IST
జనతా కర్ఫ్యూకు జిల్లా ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. ప్రధాని ఇచ్చిన పిలుపునకు అందరూ విశేషంగా స్పందించారు. స్వీయ

కరోనాపై సామూహిక యుద్ధం
విజయనగరంలో జనతా కర్ఫ్యూ విజయవంతం
స్తంభించిన జనజీవనం
కదలని వాహనాలు
పాల ప్యాకెట్లూ అందని వైనం
ముందు నుంచే సిద్ధం... ఇబ్బందులకు దూరం
నిశ్శబ్దం...అంతటా నిశ్శబ్దం. రణగొణ ధ్వనులు లేవు. వాహనాల హారన్ల శబ్దాలు లేవు. ఎక్కడి వారు అక్కడే. ఎక్కడా... ఎవరూ ఇల్లు కదల్లేదు. సాయంత్రం 5 గంటల వరకూ బయటి ప్రపంచాన్ని చూడలేదు. పల్లె నుంచి పట్టణం వరకూ... వీధి రోడ్ల నుంచి జాతీయ రహదారుల వరకూ అంతటా నిర్మానుష్యం. ఎవరికి వారు విధించుకున్న నిర్బంధం. రహదారులన్నీ బోసిపోయాయి. పట్టణాల్లో ఎన్నడూ లేనంత నిశ్శబ్ద వాతావరణం కనిపించింది. బస్సులు... రైళ్లు... ఆటోలు ఇలా ఏ వాహనమూ కదల్లేదు. .. ఒక్క షాపూ తెరచుకోలేదు. ఆఖరికి పాల ప్యాకెట్లు కూడా జనానికి అందలేదు.
ఆలయాలూ మూతపడ్డాయి. ఇదీ జనతా కర్ఫ్యూ ప్రభావం. కరోనా వైరస్‌పై యుద్ధం నేపథ్యంలో ప్రధాని మోదీ పిలుపుమేరకు ఆదివారం తలపెట్టిన జనతా కర్ఫ్యూ విజయనగరం జిల్లాలో విజయవంతమైంది. ప్రజలు స్వచ్ఛందంగా దీనిలో భాగమయ్యారు. నాయకులు... అధికారులు... సాధారణ ప్రజానీకం అందరూ పూర్తిగా ఇళ్లకే పరిమితమయ్యారు. అత్యవసర సేవలు అందించిన వారికి కృతజ్ఞతగా సాయంత్రం 5 గంటల ప్రాంతంలో చప్పట్లు కొట్టి...ధన్యవాదాలు చెప్పడానికి ఆబాలగోపాలం ముందుకొచ్చారు.
అంతవరకూ నిశ్శబ్దం రాజ్యమేలింది. రాత్రి వరకూ ఇదే పరిస్థితి కొనసాగింది. కర్ఫ్యూ నేపథ్యంలో అనాథలు, అభాగ్యులు ఇబ్బందులు పడకుండా కొందరు యువకులు, పోలీసులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఆహార పొట్లాలు అందించి..మానవత్వాన్ని చాటుకున్నారు.
(విజయనగరం- ఆంధ్రజ్యోతి)
జనతా కర్ఫ్యూకు జిల్లా ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. ప్రధాని ఇచ్చిన పిలుపునకు అందరూ విశేషంగా స్పందించారు. స్వీయ నిర్భందంలో ఉండి మద్దతు తెలిపారు. మహమ్మారి కరోనా వైరస్‌ను తరిమికొట్టాలన్న సంకల్పంతో కర్ఫ్యూను విజయవంతం చేశారు. కంటికి కన్పించని శత్రువుపై ఎంతవరకైనా పోరాడాలన్న పట్టుదల ప్రజలందరిలో కనిపించింది. విజయగనరం జిల్లా కేంద్రంతో పాటు మున్సిపాలిటీలు, ప్రధాన పట్టణాలు, మండల కేంద్రాలు, గ్రామాలన్నీ ఆదివారం కనుచూపు మేరలో నిర్మాణుష్యంగా కన్పించాయి.
ప్రధాన మార్కెట్లు, హోల్ సేల్ వ్యాపార, వాణిజ్య కూడళ్లు, మాల్స్, గ్రామీణ వీధులు, పట్టణ ప్రధాన రోడ్లు, కూడళ్లు సైతం బోసిపోయాయి. ఒక్క మనిషి కూడా కానరానంతగా కర్ఫ్యూలో పాల్గొనడం విశేషం. విజయనగరం మార్కెట్‌కు ఆదివారం కీలకమైన రోజు. ఉద్యోగులు, వ్యాపారులు, సాధారణ పౌరులు సైతం ఈ రోజున మార్కెట్ చేసేందుకు ప్రాధాన్యం ఇస్తుంటారు.
అలాంటి రోజున పట్టణంలో ఎక్కడా మనిషి కూడా కనిపించలేదు. కర్ఫ్యూలో స్వచ్ఛందంగా పాల్గొనడం ప్రజల ఐకమత్యాన్ని, ప్రజల్లో ఉన్న అవగాహనను తేటతెల్లం చేసింది. వాస్తవంగా చెప్పాలంటే విజయగనగరం పట్టణంలో ముందునుంచి కర్ఫ్యూపై పెద్దగా ప్రచారం చేయలేదు. మున్సిపాలిటీల్లో మాత్రం రిక్షా, ఆటోలపై ప్రచారం చేశారు. అయినప్పటికీ ప్రజలంతా కర్ఫ్యూను విజయవంతం చేశారు. స్వీయ నిర్బంధంలో 14 గంటల పాటు ఉంటే వ్యాధి తీవ్రత తగ్గుతుందని అందరూ బలంగా నమ్మారు.
నిలిచిన ఆర్టీసీ సర్వీసులు
ఆరీస్టీ కాంప్లెక్స్‌లో ఎక్కడి బస్సులు అక్కడే నిలిచిపోయాయి. విజయనగరం, ఎస్.కోట, సాలూరు, పార్వతీపురం ప్రాంతాల్లో అర్టీసీ డిపోలు విస్తరించి ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా ప్రతి రోజూ ఈ డిపోల నుంచి 370 బస్సుల వరకు నడుస్తున్నాయి. ఇవి కాకుండా విశాఖ, శ్రీకాకుళం జిల్లాల నుంచి సర్వీసులు తిరుగుతున్నాయి. ఇవి కాకుండా రాజమండ్రి, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, తెలంగాణా రాష్ట్రం నుంచి కొన్ని సర్వీసులు వస్తుంటాయి. ఇవన్నీ రద్దయ్యాయి. ఈ పరిణామంతో విజయనగరం రీజియన్‌లో ఆదివారం ఒక్క రోజే రెండు కోట్ల రూపాయల టర్నోవర్‌ను ఆర్టీసీ కోల్పోయింది.
రైళ్లు రద్దు
రైళ్లను రద్దు చేస్తూ రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. దీంతో ఆదివారం పగటిపూట గూడ్స్ రైళ్లు మినహాయిస్తే ఒక్క ప్రయాణికుల రైలు కూడా కనిపించలేదు. అందరూ ప్రయాణాలను వాయిదా వేసుకున్నారు. అత్యవసర పరిస్థితి గోచరిస్తోంది. విజయనగరం మీదుగా పలాస, రాయగడ వైపు వెళ్లే ఎక్స్‌ప్రెస్, పాసింజర్ రైళ్లు 150 వరకు నిలిచి పోయాయి. నెలాఖరు వరకు ఇదే పరిస్థితి ఉంటుందని రైల్వే శాఖ అధికారులు చెపుతున్నారు.
మూతపడిన చర్చిలు.. దేవాలయాలు
క్రిస్టియన్లకు ఆదివారం కీలకం. అందరూ ప్రార్థనలకు వెళుతుంటారు. కర్ఫ్యూతో జిల్లా వ్యాప్తంగా చర్చిలు ఆదివారం మూసివేశారు. ఎవరి ఇంటి వద్ద వారే ప్రార్థనలు చేసుకున్నారు. హిందూ దేవాలయాలు మొత్తం మూసివేశారు. విజయనగరంలోని పైడితల్లి అమ్మవారి ఆలయం, రామతీర్థం, పుణ్యగిరి, తోటపల్లిలోని వేంకటేశ్వర ఆలయం, బొబ్బిలిలోని వేణుగోపాల స్వామి ఆలయం కూడా మూతపడింది.
శుభ కార్యాలు వాయిదా
కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని అనేక మంది శుభ కార్యాలను సైతం వాయిదా వేసుకుంటున్నారు. గుర్ల మండలంలో ఇటీవల ఒక వివాహం కొద్ది మంది కుటుంబ సభ్యులతోనే పూర్తి చేశారు. అందరూ గుమిగూడే పరిస్థితి ఉంటుందన్న కారణంతో భోజన ఏర్పాట్లు వాయిదా వేసుకున్నారు. అలాగే వివాహాలు, గృహ ప్రవేశాలు మరికొన్ని శుభకార్యాలు వాయిదా వేసుకోవటం కన్పించింది.
చప్పట్లతో కృతజ్ఞతలు
కరోనా వైరస్‌పై స్వచ్ఛంద కర్ఫ్యూ పాటిస్తూ సాయంత్రం 5గంటలకు ప్రజలంతా కలసి అత్యవసర సేవలు అందించిన వైద్యులు, పోలీసులు, పారిశుధ్య కార్మికులకు కృతజ్ఞతగా చప్పట్లు కొట్టారు. పట్టణంలోని కొన్ని వీధుల్లో గంటలను మోగించారు. పళ్లేలను కూడా కొడుతూ తమ మద్దతు తెలిపారు. విజయనగరం కోట జియర్ క్లాంప్లెక్స్ వద్ద ఆర్‌ఎస్‌ఎస్ సభ్యులు డ్రమ్స్ వాయిద్యాలతో స్పందన తెలిపారు. ఇలా అన్నిచోట్లా ప్రజలు కొవిడ్-19పై తిరుగుబాటు చేశారు.