బ్రేక్‌!..కొత్త పంచాయతీల ఏర్పాటుకు అవాంతరం

ABN , First Publish Date - 2020-02-12T10:23:56+05:30 IST

కొత్త పంచాయతీల ఏర్పాటు ప్రక్రియకు బ్రేక్‌ పడనుంది. జనాభా లెక్కలు పూర్తయ్యే వరకు పంచాయతీలకు పరిపాలనా పరమైన సరిహద్దులను మార్చే ప్రక్రియ జోలికి వెళ్లవద్దని జాతీయ జనాభా లెక్కల రిజిస్ట్రార్‌ జనరల్‌, కేంద్ర కార్యదర్శి స్పష్టమైన

బ్రేక్‌!..కొత్త పంచాయతీల ఏర్పాటుకు అవాంతరం

బౌండరీల మార్పులు వద్దన్న కేంద్ర కార్యదర్శి


(విజయనగరం-ఆంధ్రజ్యోతి)

కొత్త పంచాయతీల ఏర్పాటు ప్రక్రియకు బ్రేక్‌ పడనుంది. జనాభా లెక్కలు పూర్తయ్యే వరకు పంచాయతీలకు పరిపాలనా పరమైన సరిహద్దులను మార్చే ప్రక్రియ జోలికి వెళ్లవద్దని జాతీయ జనాభా లెక్కల రిజిస్ట్రార్‌ జనరల్‌, కేంద్ర కార్యదర్శి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ పరిణామంతో కొత్తగా జిల్లాలు, మండలాలు, పంచాయతీల ఏర్పాటు ప్రక్రియ ఆగిపోవచ్చు. జిల్లాలో గ్రామ పంచాయతీల ఏర్పాటుకు ప్రభుత్వం కొద్దిరోజులుగా సన్నాహాలు చేస్తోంది. ఇంకోవైపు మున్సిపాలిటీల్లో గ్రామాల విలీన ప్రక్రియను కూడా ముమ్మరం చేయాలని- అధికారులకు ఆదేశాలిచ్చింది. గెజిట్‌ నోటిఫికేషన్లూ ఇస్తోంది. 34 పంచాయతీలను కొత్తగా ఏర్పాటు చేయదలిచింది. ప్రస్తుతం 921 గ్రామ పంచాయతీలు ఉన్నాయి.


ఇవి కాకుండా మరో 38 కొత్త పంచాయతీలు అవసరమని జిల్లా నుంచి ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదించారు. 34 కొత్త పంచాయతీలనే ప్రభుత్వం ప్రకటించింది. రెండు రోజుల కిందట పార్వతీపురం మండలంలోని అడారు, డొంకలకొత్తపట్నం.. తెర్లాం మండలంలోని అప్పయ్యపేట పంచాయతీల ప్రకటనతో జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేయనున్న వాటి సంఖ్య 34కు చేరింది. జనాభా లెక్కల రిజిస్ట్రార్‌ స్పష్టమైన ఆదేశాల నేపథ్యంలో ఈ ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోయినట్లేనని భావిస్తున్నారు. ఈ లోగా ఒక వేళ పంచాయతీ ఎన్నికలు వస్తే పూర్వం నుంచి ఉన్న 921 గ్రామ పంచాయతీలకు మాత్రమే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. జనాభా గణాంకాలు పూర్తయ్యాకే కొత్త వాటికి అనుమతి వచ్చే అవకాశం ఉంది. అయితే మళ్లీ గెజిట్‌ నోటిఫై చేయాల్సి ఉండొచ్చు.


అరకు జిల్లా ఆగుతుందా?

ఇదిలా ఉండగా మన జిల్లాలోని మూడు నియోజకవర్గాలను కలుపుతూ ఏర్పాటు చేస్తున్న అరకు జిల్లా ఏర్పాటుకు కూడా తాజాగా బ్రేక్‌ పడినట్టే. ప్రస్తుతం అరకు నియోజకవర్గంలో నాలుగు జిల్లాల అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. శ్రీకాకుళంలోని పాలకొండ.. విజయనగరం జిల్లాలోని కురుపాం, పార్వతీపురం, సాలూరు.. విశాఖ జిల్లాలోని అరకు, పాడేరు.. తూర్పుగోదావరి జిల్లాలోని రంపచోడవరం నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిని కలుపుతూ ఉన్న పార్లమెంట్‌ నియోజకవర్గాన్ని జిల్లాగా చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. గిరిజన వైద్య కళాశాల ఏర్పాటును దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వ నిధుల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. అయితే అధికారికంగా ప్రకటించలేదు.  ప్రస్తుతం జనాభా గణాంకాల నేపథ్యంలో కొత్త జిల్లా నిర్ణయాన్ని కూడా వెనక్కు తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అరకు పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో మన జిల్లాకు చెందిన పార్వతీపురం, కురుపాం, సాలూరు ఉన్నాయి.


అరకు భౌగోళికంగా దూరంగా ఉందని.. శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండ, మన జిల్లాలోని రిజర్వ్‌ కేటగిరీలో ఉన్న మూడు నియోజకవర్గాలు(అరకు పరిధి) కలిపి పార్వతీపురం కేంద్రంగా ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ ఉంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇదే డిమాండ్‌ చేస్తున్నారు. ప్రస్తుతానికి అరకు జిల్లాపైనే ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇందులో భాగంగానే ప్రభుత్వం గిరిజన వైద్య కళశాల ఏర్పాటుకు చర్యలు చేపడుతోంది. మంగళవారం ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్‌ సందర్భంలో కూడా అరకు వైద్య కళాశాల ప్రతిపాదిత ప్రాంతాన్ని పరిశీలించాలని జవహర్‌రెడ్డికి  ఆదేశించడం గమనార్హం. జనాభా గణాంకాల రిజస్ట్రార్‌ జనరల్‌ ఆదేశాలపై ప్రభుత్వం ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి. 


జిల్లాలో కొత్త పంచాయతీల కథ అడ్డం తిరిగింది. జనాభా లెక్కలు పూర్తయ్యే వరకూ పరిపాలనపరమైన సరిహద్దులను మార్చే ఆలోచన వద్దని జాతీయ జనాభా లెక్కల రిజిస్ట్రార్‌ జనరల్‌ ఆదేశించారు. దీంతో కొత్త పంచాయతీల ఏర్పాటుకు అవాంతరాలు ఎదురైనట్టే. ఇప్పటికే కొన్ని మండలాల్లో నూతన పంచాయతీలను గుర్తించారు. తాజా ఆదేశాల నేపథ్యంలో వీటి పరిస్థితి ఏమిటన్నది తెలియాల్సి ఉంది.

Updated Date - 2020-02-12T10:23:56+05:30 IST