కరోనా విజృంభణ

ABN , First Publish Date - 2020-06-23T10:10:55+05:30 IST

జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకూ కేసులు పెరుగుతున్నాయి. పట్టణాలు, పల్లెల్లోనూ నమోదవుతున్నాయి.

కరోనా విజృంభణ

ఒకేరోజు 21 కేసులు 

కలెక్టరేట్‌ ఉద్యోగిలో పాజిటివ్‌ లక్షణాలు

కంటైన్మెంట్‌ జోన్‌లో ఓ అపార్ట్‌మెంట్‌

జిల్లాలో మొత్తం కేసులు 162కి చేరిక


రింగురోడ్డు/ సీతానగరం/ మక్కువ/ మెరకముడిదాం/ కలెక్టరేట్‌, జూన్‌ 22: జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకూ కేసులు పెరుగుతున్నాయి. పట్టణాలు, పల్లెల్లోనూ నమోదవుతున్నాయి. సోమవారం 21 కేసులు నమోదయ్యాయి. ఒకేరోజు ఎక్కువ కేసులు నిర్ధారణ కావడం ఇదే మొదటిసారి. తాజా కేసులతో కొవిడ్‌-19 వైరస్‌ బారిన పడిన వారి సంఖ్య 162కి చేరింది. పార్వతీపురం, బొండపల్లి, నెల్లిమర్ల, రామభద్రపురం, మెరకముడిదాం, విజయనగరం, గరుగుబిల్లి మండలాల్లో ఒక్కొక్కరికి వైరస్‌ ప్రబలింది. డెంకాడ, బలిజిపేట మండలాల్లో ఇద్దరు చొప్పున, జియ్యమ్మవలసలో ముగ్గురికి, బొబ్బిలిలో అత్యధికంగా ఏడుగురిలో కరోనా కనిపించింది. మొత్తం 21 కేసులు సోమవారం నమోద య్యాయి. వీరందరినీ నెల్లిమర్లలోని మిమ్స్‌ కొవిడ్‌ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో 83 మంది చికిత్స పొందుతున్నారని, 58 మంది డిశ్చార్జ్‌ అయ్యారని ఇన్‌చార్జి డీఎంహెచ్‌వో డాక్టర్‌ జె.రవికుమార్‌ తెలిపారు. 


సీతానగరం మండలంలోని ఓ గ్రామంలో ఒకరికి కరోనా అనుమానిత లక్షణాలు కనిపించాయి. ఆయన చెన్నయ్‌ నుంచి ఇటీవలే గ్రామానికి వచ్చాడు. హోంక్వారంటైన్‌లో ఉంటున్నాడు. ప్రైమరీ కాంటాక్ట్స్‌ కింద ఆయన భార్య, మరో 12 మంది కుటుంబ సభ్యులకు కరోనా ప్రబలే అవకాశం ఉండడంతో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచించారు. గ్రామంలో పారిశుధ్య చర్యలు చేపట్టారు. 


మక్కువ మండలంలోని ఓ గ్రామంలో భార్యాభర్తల్లో కరోనా లక్షణాలు కనిపించాయి. వీరిద్దరూ ఈ నెల 20న చెన్నయ్‌ నుంచి వచ్చారు. వీరితో సన్నిహితంగా మెలిగిన 13 మందిని ప్రైమరీ కాంటాక్ట్స్‌ కింద గుర్తించారు. 80 మంది సెకండరీ కాంటాక్ట్‌ వ్యక్తులను కూడా గుర్తించారు. వీరందరికీ కరోనా పరీక్షలు చేయనున్నారు. గ్రామంలోని ఆ వీధికి రాకపోకలు నియంత్రించి బారికేడ్లు ఏర్పాటు చేశారు. 


మెరకముడిదాం మండలంలోని ఓ గ్రామంలో సోమవారం తాజాగా మరో కరోనా పాజిటివ్‌ కేసు నమోదైంది. విజయవాడ నుంచి వచ్చిన మహిళకు కరోనా సోకినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఇప్పటికే గ్రామాన్ని కంటైన్మెంట్‌ జోన్‌గా అధికారులు ప్రకటించారు. 


కలెక్టరేట్‌లో కరోనా కలకలం 

కలెక్టరేట్‌లో పనిచేస్తున్న ఒక మహిళా ఉద్యోగిలో కరోనా లక్షణాలు కనిపించడం జిల్లా కేంద్రంలో కలకలం రేగింది. బొబ్బిలికి ప్రాంతానికి చెందిన ఆమె నాలుగు రోజుల కిందట కలెక్టరేట్‌లోని వివిధ సెక్షన్లకు వెళ్లారు. జేసీ నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. ఆర్డీవోనూ కలిశారు. ఈ పరిణామంతో ఆమెను కలిసిన వారంతా భయపడుతున్నారు. ఈ పరిస్ధితిలో కలెక్టరేట్‌లోకి బయట వ్యక్తులు రాకుండా ఆదేశాలు ఇచ్చారు. సుమారు 100 మంది ఉద్యోగులకు ఆడిటో రియంలో సోమవారం కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. జిల్లా ఉన్నతాధికారులు కూడా పరీక్షలు చేయించుకున్నారు. ఫలితాల కోసం ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. 


కంటైన్మెంట్‌ జోన్‌లో అపార్ట్‌మెంట్‌

జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ- జిల్లా కేంద్ర ఆసుపత్రి సమీపంలో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌ పరిధిని కంటైన్మెంట్‌ జోన్‌గా ప్రకటిస్తూ విజయనగరం ఆర్డీవో కె.హేమలత ఉత్తర్వులు విడుదల చేశారు. అపార్ట్‌మెంట్‌ నుంచి 200 మీటర్ల వరకు కంటైన్మెంట్‌ జోన్‌గా ప్రకటించారు. అలాగే 400మీటర్ల వరకు బఫర్‌జోన్‌గా ప్రకటించారు. ఈ ప్రాంతంలో ఇళ్ల నుంచి బయటకు రావద్దని ఆదేశాలిచ్చారు. గృహాల్లో ఉంటూ గ్లౌజ్‌లు, మాస్క్‌లు వేసుకుని భౌతిక దూరాన్ని పాటించాలన్నారు. ఎవరికైనా జలుబు, దగ్గు, ఊపిరి ఆడని పరిస్థితి ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని ఆదేశించారు. కంటైన్మెంట్‌ జోన్‌ పరిధిలో మూడు వైపులా చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్లు ఆర్డీవో తెలిపారు. 

Read more