లెక్క తగ్గింది

ABN , First Publish Date - 2020-12-30T05:42:49+05:30 IST

జీఎస్‌టీ (వస్తుసేవల పన్ను)పై కరోనా ప్రభావం తీవ్రంగా పడింది. వ్యాపార కార్యకలాపాలు లేకపోవడంతో వ్యాపారులకు ఆదాయం తగ్గింది. దీంతో సకాలంలో రిటర్న్స్‌ దాఖలు చేయడంలో ఇబ్బందులు పడ్డారు. గత ఏడాది 2019-20 (నవంబరు వరకు)లో 73.44 శాతం జీఎస్‌టీ వృద్ధి రేటు నమోదైంది.

లెక్క తగ్గింది
రాష్ట్ర పన్నుల శాఖ కార్యాలయం

జీఎస్‌టీ వసూలు 61.59 శాతంగా నమోదు 

ఈ ఏడాదిలో తనిఖీలు అంతంతమాత్రమే 

(విజయనగరం రింగురోడ్డు)

జీఎస్‌టీ (వస్తుసేవల పన్ను)పై కరోనా ప్రభావం తీవ్రంగా పడింది. వ్యాపార కార్యకలాపాలు లేకపోవడంతో వ్యాపారులకు ఆదాయం తగ్గింది. దీంతో సకాలంలో రిటర్న్స్‌ దాఖలు చేయడంలో ఇబ్బందులు పడ్డారు. గత ఏడాది 2019-20 (నవంబరు వరకు)లో 73.44 శాతం జీఎస్‌టీ వృద్ధి రేటు నమోదైంది. ఈ ఏడాది 61.59 (2020 నవంబరు వరకు) శాతానికి పరిమితమైంది. మార్చి 21 నుంచి లాక్‌డౌన అమల్లోకి రావడంతో అన్ని వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. కొన్ని నెలల తరువాత వ్యాపార సంస్థలు తెరుచుకున్నా ఆశించిన స్థాయిలో కొనుగోళ్లు లేక ఆ రంగంలో ఉన్న వారికి ఆదాయం తగ్గిపోయింది. జిల్లాలో జీఎస్‌టీ పరిధిలో 7,239 మంది వ్యాపారులు ఉన్నారు. వీరిలో 5,043 మంది రిటర్నులు సమర్పించారు. 2,196 మంది అందివ్వలేదు. వాణిజ్య పన్నుల శాఖ అధికారులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2020 నవంబరు నెలాఖరు వరకూ రూ.349 కోట్ల 82 లక్షలు వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇంతవరకూ రూ.215 కోట్ల 45 లక్షలు మాత్రమే రాబట్టగలిగారు. 2019-20కి ఆర్థిక సంవత్సరం నవంబరు నెల వరకూ రూ.337 కోట్ల 91 లక్షలు వసూలు లక్ష్యం కాగా... రూ.248 కోట్ల 16 లక్షలు సమకూరింది.  

తనిఖీలు అంతంతమాత్రం 

జీఎస్‌టీ అమల్లోకి రావడంతో పూర్తిగా చెక్‌పోస్టులు ఎత్తివేశారు. దీంతో యథేచ్ఛగా వాహనాల్లో సరుకు రవాణా అవుతోంది. గతంలో ఎక్కడికక్కడ తనిఖీలు చేసి అపరాధ రుసుం వసూలు చేసేవారు. నేడు ఆ పరిస్థితి లేదు.  సరుకు రవాణా వాహనాలను గుర్తించి వాటిలో సరైన పత్రాలు లేని వాటి నుంచి అపరాధ  రుసుం వసూలు చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియ పూర్తిస్థాయిలో చేయకపోవడంతో ఎలాంటి పత్రాలు లేకుండా జిల్లాలో వాహనాలు తిరుగుతున్నట్టు సమాచారం. దీనిపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

లక్ష్యాన్ని అధిగమిస్తాం

జిల్లాలో వాహన తనిఖీలు ముమ్మరం చేశాం. పెనాల్టీలు విధిస్తాం. అలాగే జీఎస్‌టీ వసూళ్లను పెంచి నిర్దేశించిన లక్ష్యాన్ని అధిగమిస్తాం. పన్ను చెల్లింపుదారులు సకాలంలో రిటర్నులు సమర్పించేలా ఇప్పటికే చర్యలు చేపడుతున్నాం. కరోనా ప్రభావంతో ఇప్పుడిప్పుడే వ్యాపార సంస్థలు తెరుచుకోవడం వ్యాపారలావాదేవీలు ఊపందుకుంటున్నాయి.  దీనిపై ప్రత్యేక దృష్టి సారిస్తాం. 

- వై.కిరణ్‌కుమార్‌, సంయుక్త కమిషనర్‌ (రాష్ట్ర పన్నులు) 


Updated Date - 2020-12-30T05:42:49+05:30 IST