పెళ్లి.. కళ తప్పింది!

ABN , First Publish Date - 2020-05-13T11:11:02+05:30 IST

పెళ్లంటేనే సందడి. బంధువులు... భారీ ఏర్పాట్లు... మేళతాళాల హడావుడి. కరోనా పుణ్యమా అని ప్రస్తుతం అవేమీ కనిపించడం లేదు.

పెళ్లి.. కళ తప్పింది!

నేటి నుంచి శుభ ముహూర్తాలు

‘కరోనా’ నేపథ్యంలో హంగూ ఆర్భాటాలకు దూరం

పరిమిత సంఖ్యలో అతిథుల మధ్య వివాహాలు


పెళ్లి...‘కళ’ తప్పుతోంది. రంగురంగుల పందిళ్లు... వాటికి దీటైన మండపాలు.. మిరుమిట్లుగొలిపే విద్యుద్దీపాల వెలుగులు... ఆపైన వధూవరుల స్థోమతకు తగ్గట్టు... భోజనాలు.. బంధువుల హడావుడి... ఇదీ సాధారణంగా మన ఇళ్లలో పెళ్లి సందడి. లాక్‌డౌన్‌ నేపథ్యంలో వివాహాల రూపు మారిపోయింది. ఏప్రిల్‌- మే నెలల్లో  ముహూర్తాలు పెట్టుకున్న వారిలో అత్యధికులు ఇప్పటికే వాయిదా వేసుకున్నారు. మరికొందరు మాత్రం ఎలాగోలా నిర్ణీత ముహూర్తానికే వివాహాలు పూర్తిచేయాలని యోచిస్తున్నారు. నిబంధనలను అనుసరించి పెళ్లిళ్లకు ఏర్పాట్లు చేస్తున్నారు.


విజయనగరం(ఆంధ్రజ్యోతి)/ సాలూరు

పెళ్లంటేనే సందడి. బంధువులు... భారీ ఏర్పాట్లు... మేళతాళాల హడావుడి. కరోనా పుణ్యమా అని ప్రస్తుతం అవేమీ కనిపించడం లేదు. సాదాసీదాగా చేసేందుకు వధూవరుల కుటుంబాలు సిద్ధమవుతున్నాయి. జిల్లాలో ఈ ఏడాది మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో సుమారు నాలుగు వేలకు పైగా వివాహాలు చేసేందుకు ముహూర్తాలు ఖరారు చేశారు. ముందుగానే కల్యాణ మండపాలు, కేటరింగ్‌, లైట్‌ సెట్టింగ్‌ వంటివి బుక్‌ చేసుకున్నారు. కానీ కరోనా ఉధృతి, లాక్‌డౌన్‌ కారణంగా చాలామంది పెళ్లిళ్లను వాయిదా వేసుకున్నారు. లాక్‌డౌన్‌ ప్రారంభమై 50 రోజులు పూర్తవుతోంది.  మరోవైపు బలమైన ముహూర్తాలు దాటిపోతున్నాయి. ఈ నెల 13, 14, 15, 23, 24 తేదీల్లో ముహూర్తాలు ఉన్నాయి.


ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనల మేరకు ఈ ముహూర్తాలకే సాదాసీదాగా వివాహం చేసేందుకు వధూవరుల కుటుంబాలు నిర్ణయిస్తున్నాయి. పురోహితులను సంప్రదించి ముహూర్తాలను ఖరారు చేస్తున్నారు. పెళ్లి నిర్వహణకు అధికారుల అనుమతి తీసుకుంటున్నారు. పరిమిత సంఖ్యలో అతిథులు, భౌతిక దూరం పాటించేలా, మాస్కులు ధరించి వివాహాలు చేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 30 నుంచి జూన్‌ 8 వరకూ శుక్రమౌఢ్యం కొనసాగుతుంది.


తరువాత కూడా మంచి ముహూర్తాలు లేవు. జూలై 21 నుంచి ఆగస్టు 19 వరకూ ముహూర్తాలున్నాయని పురోహితులు చెబుతున్నా.. అప్పుడు ముమ్మరంగా వ్యవసాయ పనులు సాగుతాయి. వర్షాలు అధికంగా పడతాయి. అప్పటికి కరోనా పరిస్థితి ఏ విధంగా ఉంటుందోనన్న బెంగతో పరిమిత బంధువులతో ఎలాగోలా ఈ నెలలోనే పెళ్లిళ్లు చేసేందుకు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు.

Read more