చేపల వేటకు వెళ్లిన యువకుడి గల్లంతు

ABN , First Publish Date - 2020-12-08T05:21:51+05:30 IST

చేపల వేటకు వెళ్లిన ముక్కాం గ్రామానికి చెందిన గుంటు హరి (22) అనే యువకుడు సముద్రంలో గల్లంతయ్యాడు.

చేపల వేటకు వెళ్లిన యువకుడి గల్లంతు

 భోగాపురం, డిసెంబరు7: చేపల వేటకు వెళ్లిన ముక్కాం గ్రామానికి చెందిన గుంటు హరి (22) అనే యువకుడు సముద్రంలో గల్లంతయ్యాడు. ఈ ఘటన ఆదివారం రాత్రి విశాఖ తీరంలో ఆదివారం జరిగింది. ముక్కాం గ్రామానికి చెందిన గుంటు దాసు స్థానికంగా చేపల వేట సాగక కుటుంబంతో కలిసి విశాఖలో నివాసముంటున్నాడు. సొంతగా బోటు కొనుగోలు చేసి చేపల వేట సాగిస్తున్నాడు. ఆయనకు హరి, మహేష్‌ అనే ఇద్దరు కుమారులున్నారు. ఇందులో హరి పదో తరగతి వరకూ చదువుకున్నాడు. విశాఖ పోర్టులో రోజువారి కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఖాళీ సమయాల్లో తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో రెండు రోజుల కిందట తండ్రి దాసు, మరో ఐదుగురు మత్స్యకారులతో కలిసి చేపల వేటకు బయలుదేరాడు. సాధారణంగా సముద్రంలో వల వేసి మత్స్యకారులు బోటు లోపలికి వెళ్లిపోతారు. ఆదివారం రాత్రి దాసుతో పాటు వేటకు వెళ్లిన మత్స్యకారులు వల వేసి బోటు లోపలికి వెళ్లిపోయారు. ఆ సమయంలో హరి కూడా వారితో లోపలికి వెళ్లి నిద్రించాడు. వేకువజామున 3 గంటల సమయంలో వారంతా నిద్ర లేచి వల లాగేందుకు సమాయత్తమవుతుండగా హరి కనిపించలేదు. అంతటా వెతికినా ఆచూకీ లేకపోయింది. దీంతో మరుగుదొడ్డికి బయటకు వచ్చి ప్రమాదవశాత్తూ కాలుజారి సముద్రంలో పడిపోయి ఉంటాడని భావిస్తున్నారు. తోటి మత్స్యకారులతో కలిసి సముద్రంలో గాలించినా ఫలితం లేకపోయింది. తండ్రి దాసు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాడు. దీంతో ముక్కాంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తల్లి నూకాలమ్మ రోదిస్తోంది. ఆమెను ఓదార్చడం ఎవరి తరం కాలేదు. 

 

Updated Date - 2020-12-08T05:21:51+05:30 IST