పోస్టుల బ్లాక్‌తో టీచర్లకు అవస్థలు.. బదిలీల వెబ్ ఆప్షన్ కోసం హైరానా
ABN , First Publish Date - 2020-12-13T05:30:00+05:30 IST
బదిలీ పర్వం తుది అంకానికి చేరుకోవడంతో వెబ్ ఆప్షన్లు ఇవ్వడానికి ఉపాధ్యాయులు హైరానా పడుతున్నారు. ఎస్జీటీలకు వెబ్ ఆప్షన్లు ఇవ్వడానికి ఆదివారం నుంచి సైట్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చింది. వాస్తవానికి ఉపాధ్యాయులు వెబ్ ఆప్షన్లు ఈ నెల 11 నుంచి 15 వరకు నమోదు చేయాల్సి ఉంది.

‘వెబ్’.. డబ్..
ఎస్జీటీలకు రెండు రోజులు తెరుచుకోని వెబ్‌సైట్
సమయం పెంచని ప్రభుత్వం
సాలూరు రూరల్, డిసెంబరు 13: బదిలీ పర్వం తుది అంకానికి చేరుకోవడంతో వెబ్ ఆప్షన్లు ఇవ్వడానికి ఉపాధ్యాయులు హైరానా పడుతున్నారు. ఎస్జీటీలకు వెబ్ ఆప్షన్లు ఇవ్వడానికి ఆదివారం నుంచి సైట్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చింది. వాస్తవానికి ఉపాధ్యాయులు వెబ్ ఆప్షన్లు ఈ నెల 11 నుంచి 15 వరకు నమోదు చేయాల్సి ఉంది. ఈ నెల 11న కేవలం హెచ్‌ఎంలు, పీఎస్‌హెచ్‌ఎంలకే వైబ్‌సైట్ అందుబాటులోకి వచ్చింది. అది కూడా నమోదుకు చుక్కలు చూపింది. ఎస్జీటీలకు శనివారం వరకు సైట్ అందుబాటులోకి రాలేదు. ఆప్షన్ల నమోదుకు రెండురోజుల కాలం గాలిలో కలిసిపోయినట్లయింది. ప్రస్తుతం సైట్ అందుబాటులోకి వచ్చినా రెండు రోజులు వృథా పోయిన సమయం మాటేమిటని వారు ప్రశ్నిస్తున్నారు. తప్పనిసరి బదిలీలు కావాల్సిన ఉపాధ్యాయులు తమ వెబ్ నమోదులో ఖాళీలన్నీ చూపించకుంటే వెబ్‌సైట్ తిరస్కరిస్తోంది. ఈ నమోదుకు గంటలకొద్దీ సమయం వెచ్చించాల్సి రావడంతో వారు హైరానా పడుతున్నారు. ఎస్జీటీలకు రెండు రోజులు సైట్ అందుబాటులోకి రాకున్నా ప్రభుత్వం తుది గడువు 15ను ఇప్పటి వరకు పొడిగించకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో 4217 మంది ఉపాధ్యాయులు బదిలీలకు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 2290 మంది ఎస్జీటీలే ఉండడం విశేషం. తప్పనిసరిగా బదిలీ కావాల్సిన వారు 1643 మంది ఉండగా వారిలోనూ 1058 మంది ఎస్జీటీలే ఉన్నారు. జిల్లాలో ఎస్జీటీ ఖాళీలు 1815 ఉన్నాయి. వాటిలో 1106 ఖాళీలను చూపి 706 ఖాళీలను బ్లాక్ చేశారు. ఈ వ్యవహారం కూడా ఒక్కో మండలానికి ఒక్కో విధంగా చేశారు. అత్యధికంగా సాలూరు మండలంలో 77 ఖాళీలకుగాను 38 ఖాళీలను బ్లాక్ చేశారు. మరో మండలంలో ఖాళీల కంటే బ్లాక్ చేసినవే అధికంగా ఉన్నాయి. పోస్టులు బ్లాక్ వల్ల ఉపాధ్యాయులు తాము పనిచేస్తున్న మండలం, పక్క మండలంలో స్థానం దొరుకుతుందా! లేదోననే సంశయం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చెప్పిన దానికంటే బ్లాక్ చేసిన శాతం అధికంగా ఉందని ఉపాఽధ్యాయులు అంటున్నారు.
గడువు పెంచాలి
ఎస్జీటీలకు వెబ్‌సైట్ ఆదివారం నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చింది. ఇచ్చిన గడువులో రెండు రోజులు వృథాగా పోయాయి. వెబ్‌ఆప్షన్ల నమోదు గడువును పెంచాలి. పోస్టుల బ్లాక్‌లో మండలాల ప్రతిపాదికన శాతం లెక్కించాలి.
- మీసాల వెంకటగౌరీశంకరరావు, ఏపీటీఎఫ్ జిల్లా కార్యదర్శి