మళ్లీ సర్వే

ABN , First Publish Date - 2020-12-04T04:22:36+05:30 IST

భూముల రీ సర్వేకు ఆధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. వచ్చే నెల మొదటి వారంలో సమగ్ర సర్వే మొదలు కానుంది. ఇప్పటికే సర్వేయర్లకు మూడు బ్యాచ్‌లుగా శిక్షణ ఇచ్చారు. ఒక్కో బ్యాచ్‌కు 30 రోజుల పాటు శిక్షణ ఇస్తున్నారు.

మళ్లీ సర్వే

 జనవరి మొదటి వారంలో ప్రారంభం

 తొలిదశలో 499 గ్రామాల ఎంపిక

భూముల లెక్క తేల్చేందుకు సన్నద్ధం

మూడు విడతల్లో సర్వేయర్లకు శిక్షణ 

కలెక్టరేట్‌, డిసెంబరు 3 :

భూముల రీ సర్వేకు ఆధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. వచ్చే నెల మొదటి వారంలో సమగ్ర సర్వే మొదలు కానుంది. ఇప్పటికే సర్వేయర్లకు మూడు బ్యాచ్‌లుగా శిక్షణ ఇచ్చారు. ఒక్కో బ్యాచ్‌కు 30 రోజుల పాటు శిక్షణ ఇస్తున్నారు. కేడ్‌, ఈపీఎస్‌, డీజీపీఎస్‌ వంటి అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. భూముల రీ సర్వేకు ప్రతి గ్రామంలో పెద్ద ఎత్తున ప్రచారం చేయడం కోసం షెడ్యూల్‌ తయారు చేశారు. దీనిపై  మండల సర్వేయర్‌తో కలిసి గ్రామ సర్వేయర్లు, వలంటీర్లు, గ్రామ రెవెన్యూ కార్యదర్శులతో ఒక టెలిగ్రాం గ్రూపు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటివరకూ జిల్లా స్థాయిలో శిక్షణ తీసుకున్న సర్వేయర్లకు ఈనెల 5న మండల స్థాయిలో శిక్షణ ఇవ్వనున్నారు. 

సర్వే నెంబరు ఆధారంగా...

సర్వేలో ప్రధానంగా గ్రామాల మధ్య సరిహద్దులు గుర్తించడం.. ప్రభుత్వ భూముల వివరాల నమోదు కీలకం. సచివాలయ సర్వేయర్లు  భూముల స్వచ్ఛీకరణ వివరాలు తీసుకుని సర్వే నెంబరు వారీగా తనిఖీ చేస్తారు. నమూనా తయారీ, విదేశాల్లో ఉంటున్న వారి ఫోన్‌ నంబర్లు తీసుకుని వారికి వలంటీర్ల ద్వారా రీ సర్వేపై సమాచారం ఇవ్వడం చేస్తారు. ఈనెల 6న గ్రామ వలంటీర్లకు రీ సర్వేపై శిక్షణ ఇస్తారు. 7 నుంచి 10వ తేదీ వరకూ రీ సర్వేపై ఇంటింటా ప్రచారం చేయనున్నారు.  ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తారు. ఈనెల 14 , 15 తేదీల్లో గ్రామ సభలు పెట్టి కరపత్రాలు పంపిణీ చేయనున్నారు. రీ సర్వేపై గ్రామాల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తారు. జిల్లాలో ఉన్న 489 మంది సర్వేయర్ల ద్వారా రీ సర్వే జరగనున్నది. ప్రసుత్తం భూమి రికార్డులు పక్కాగా ఉన్న గ్రామాల్లో సర్వే మొదలు పెడుతున్నారు. మొదటి విడత గా 499 గ్రామాల్లో సర్వే ప్రారంభం కానుంది. ఈనెల 21న సీఎం జగన్‌ రీ సర్వేను రాష్ట్రస్థాయిలో ప్రారంభించనున్నారు. అదే రోజు జిల్లాలోని పార్వతీపురం డివిజన్‌ రామభద్రపురం మండలం మర్రివలసలోనూ, విజయనగరం డివిజన్‌లో బొండపల్లి మండలంలోని జియ్యన్నవలస గ్రామంలోనూ ప్రారంభించనున్నారు. 

అంతా సిద్దం కావాలి : జేసీ

వైఎస్‌ఆర్‌ జగనన్న శాశ్వత భూమి హక్కు... భూ రక్ష కార్యక్రమంలో భాగంగా జనవరి మొదటి నుంచి భూముల రీ సర్వే  ప్రారంభం కానుందని.. అందుకు అంతా సిద్ధంగా ఉండాలని జేసీ కిషోర్‌ కుమార్‌ తెలిపారు. గురువారం సాయంత్రం మండల స్థాయి అధికారులతో ఆయన కలెక్టరేట్‌ ఆడిటోరియంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రీ సర్వేకు సిద్ధం కావాల్సి ఉందన్నారు. అనంతరం సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణపై సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్‌డీవో భవానీ శంకర్‌, డిప్యూటీ కలెక్టర్లు పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-04T04:22:36+05:30 IST