అంకితభావంతో విధులు నిర్వహిస్తే విజయం

ABN , First Publish Date - 2020-12-11T04:53:08+05:30 IST

అంకితభావంతో విధులు నిర్వహిస్తే ఏ వృత్తిలోనైనా విజయం సాధించవచ్చునని జిల్లా జడ్జి జి.గోపి అన్నారు. పోలీసుల్లో నైపుణ్యాభివృద్ధి కోసం జిల్లా పోలీసు పరేడ్‌ గ్రౌండ్‌లో విశాఖ రేంజ్‌ పోలీసు డ్యూటీ మీట్‌ను గురువారం ఏర్పాటు చేశారు.

అంకితభావంతో విధులు నిర్వహిస్తే విజయం
శాంతి కపోతాలను ఎగురవేస్తున్న జడ్జి గోపి, డీఐజీ రంగారావు, ఎస్పీలు

పోలీసు డ్యూటీ మీట్‌లో జిల్లా జడ్జి గోపి 

విజయనగరం క్రైం, డిసెంబరు 10: అంకితభావంతో విధులు నిర్వహిస్తే ఏ వృత్తిలోనైనా విజయం సాధించవచ్చునని జిల్లా జడ్జి జి.గోపి అన్నారు. పోలీసుల్లో నైపుణ్యాభివృద్ధి కోసం జిల్లా పోలీసు పరేడ్‌ గ్రౌండ్‌లో విశాఖ రేంజ్‌ పోలీసు డ్యూటీ మీట్‌ను గురువారం ఏర్పాటు చేశారు. కార్యక్రమాన్ని విశాఖ రేంజ్‌ డీఐజీ ఎల్‌కేవీ రంగారావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ముఖ్య అతిథిగా హాజరైన న్యాయమూర్తి గోపి మాట్లాడుతూ కేసుల దర్యాప్తులో నిందితులకు శిక్ష పడేందుకు భౌతిక సాక్ష్యాలను సేకరించడం పోలీసు వృత్తిలో ముఖ్య లక్ష్యమన్నారు. భారత రాజ్యాంగం ప్రకారం న్యాయం పొందడం కూడా ప్రాథమిక హక్కు కిందకు వస్తుందని, దర్యాప్తు సమయంలో సేకరించిన సాక్ష్యాధారాలతోనే బాధితులకు న్యాయం జరిగే అవకాశం ఉంటుందన్నారు. విశాఖ రేంజ్‌ డీఐజీ ఎల్‌కెవీ రంగారావు మాట్లాడుతూ, రాష్ట్రస్థాయి పోలీసు డ్యూటీమీట్‌కు వెళ్లేందుకు జిల్లా, రేంజ్‌ స్థాయిల్లో డ్యూటీమీట్‌ను నిర్వహిస్తున్నామన్నారు. ఈ మీట్‌లో నైపుణ్యం కనబరిచి విశాఖ రేంజ్‌ పోలీసు ప్రతిష్టను దేశస్థాయిలో ఇనుమడింప చేయాలన్నారు. దర్యాప్తులో నేరస్థల పరిశీలన, ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ, ఫోరెనిక్స్‌, ఫింగర్‌ప్రింట్స్‌, కంప్యూటర్‌ పరిజ్ఞానం ఇతర అంశాలపై 10, 11 తేదీల్లో మీట్‌ నిర్వహిస్తున్నామన్నారు. శ్రీకాకుళం ఎస్పీ అమితబర్డర్‌ మాట్లాడుతూ, దర్యాప్తులో మెలకువలను పెంపొందించుకోవడం ద్వారా కేసుల విచారణలో ఖచ్చితమైన సాక్ష్యాలను గుర్తించవచ్చునన్నారు. విశాఖ జిల్లా ఎస్పీ కృష్ణారావు మాట్లాడుతూ, పోలీసు వృత్తిలో దర్యాప్తు, మెలకువలు ముఖ్యమన్నారు. కార్యక్రమంలో విశాఖ ఆర్‌ఎఫ్‌ఎస్‌ఎల్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ నాగరాజు, ఓఎస్‌డీలు సూర్యచంద్రరావు, ఎస్‌ఈబీ ఎస్‌పీ శ్రీదేవిరావు, పలువురు డీఎస్పీలు, సీఐలు, ఆర్‌ఐలు, ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. 

 జిల్లా పోలీసు పరేడ్‌ గ్రౌండ్‌లో అధికారులు, సిబ్బందికి గుర్ల మండలం పున్నపురెడ్డి పేట సిద్దాయోగాశ్రమ యోగా గురూజీ లక్షనానందస్వామిజీ యోగాలో గురువారం శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో ఎస్పీ రాజకుమారి పాల్గొన్నారు.

మానవ హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డీజీపీ గౌతమ్‌సవాంగ్‌ సూచించారు. గురువారం జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా వీడియోకాన్ఫరెన్స ద్వారా డీఐజీలు, అన్ని జిల్లాల ఎస్పీలతో ఆయన మాట్లాడారు. మహిళల పట్ల, మైనర్‌ బాలికల పట్ల మానవ హక్కుల అతిక్రమణ జరుగుతున్న నేపథ్యంలో హక్కులను కాపాడాల్సిన ప్రథమ బాధ్యత పోలీసు అధికారులపై ఉందన్నారు. 


Updated Date - 2020-12-11T04:53:08+05:30 IST