-
-
Home » Andhra Pradesh » Vizianagaram » Strict measures for population control
-
కరోనా కలవరం
ABN , First Publish Date - 2020-03-25T11:34:52+05:30 IST
కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా జిల్లా అంతటా మంగళవారం నుంచి 144వ సెక్షన్ అమలు చేస్తున్నారు.

స్వీయ నిర్బంధంలో జిల్లా ప్రజలు
బోసిపోయిన విజయనగరం
మిగిలిన పట్టణాల్లోనూ ఇదే పరిస్థితి
144సెక్షన్ అమలుతో అంతటా నిర్మానుష్యం
నిత్యావసరాలు మినహా అన్ని వ్యాపారాలు బంద్
కూరగాయల మార్కెట్ 31 వరకు క్లోజ్
వీధుల్లో అమ్మకాలకు ఒకే
అయోధ్య మైదానంలో బుధవారం ఉగాది సామగ్రి అమ్మకం
జనసంచారం నియంత్రణకు కఠిన చర్యలు
కరోనా వైరస్ కలవరంతో జిల్లా ప్రజలు స్వీయనిర్బంధంలో ఉన్నారు. అత్యసవర సమయంలో మంగళవారం ఒకరో.. ఇద్దరో బయటకు వచ్చారు. ఉదయం కొద్దిసమయం నిత్యావసరాలు.. కూరగాయల కోసం రైతుబజారు, మార్కెట్‌లకు రావడం కనిపించింది. పోలీసులు 144 సెక్షన్‌ను పకడ్బందీగా అమలు చేశారు. నిత్యావసరాలు మినహా అన్ని వ్యాపారాలను కట్టడి చేశారు. కూరగాయాల మార్కెట్‌ను కూడా ఈ నెల 31 వరకూ తెరవకూడదని ఆదేశించారు. విజయనగరంలోని అయోధ్య మైదానంలో బుధవారం ఒక్కరోజు కూరగాయల అమ్మకానికి అవకాశం కల్పించారు. జిల్లా వ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లో జన సంచారం కట్టడికి పోలీసులు అన్ని చర్యలూ తీసుకుంటున్నారు. వాహనదారులను ఎక్కడికక్కడ నిలిపివేశారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని ముఖ్యకూడళ్లు...ప్రధాన రహదారులతో పాటు పార్వతీపురం, సాలూరు, ఎస్.కోట, బొబ్బిలి పట్టణాలు బోసిపోయాయి. అటు ఏజెన్సీలోనూ బంద్ వాతావరణం కనిపించింది.
(విజయనగరం-ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా జిల్లా అంతటా మంగళవారం నుంచి 144వ సెక్షన్ అమలు చేస్తున్నారు. దీంతో మంగళవారం ప్రధాన జంక్షన్లు, మండల కేంద్రాలన్నీ వెలవెలబోయాయి. జనాలను రోడ్డుపైకి వచ్చేందుకు పోలీసులు అనుమతించలేదు. ఉదయం 10గంటల వరకు వివిధ అవసరాల కోసం కాస్త వెసులుబాటు ఇచ్చారు. తరువాత కట్టుదిట్టంగా వ్యవహరించారు. విజయనగరంలోని అన్ని కూడళ్లలోనూ బారికేడ్లు ఏర్పాటు చేసి పహారా కాశారు. దీంతో రహదారులన్నీ నిర్మానుష్యంగా కనిపించాయి. సాధారణంగానే మంగళవారం మార్కెట్‌కు సెలవు కావటంతో షాపులన్నీ మూసివేశారు. కూరగాయల మార్కెట్ మాత్రం కిటకిటలాడింది.
దీనిని గర్తించిన పోలీసులు ఉదయం పది తర్వాత గంటస్తంభం వద్ద ఉన్న కూరగాయల మార్కెట్‌ను ఖాళీ చేయించారు. ఈ ప్రాంతం ఇరుగ్గా ఉండటంతో కూరగాయల మార్కెట్‌ను బుధవారం నుంచి క్లోజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈనెల 31వరకు కూరగాయలను వీధుల్లో తిరిగి అమ్మకాలకు మాత్రం అనుమతిచ్చారు. అయోధ్య మైదానంలో బుధవారం ఉదయం పది గంటల వరకు కూరగాయలు, ఉగాది సామగ్రి అమ్మేందుకు అవకాశం కల్పించారు.
మండలాల వారీగా గుర్తింపు
ఇతర దేశాల నుంచి వచ్చే ప్రతి ఒక్కరికీ ఆరోగ్య పరీక్షలు చేస్తున్నారు. కరోనా వైరస్ రెండో దశలో ఉండడంతో మూడో దశకు ఎట్టి పరిస్థితిలోనూ రాకుండా చేయాలన్న సంకల్పంతో అధికారులు అనేక చర్యలు తీసుకుంటున్నారు. మండలాల వారీగా ఇతర దేశాల నుంచి వచ్చేవారిని గుర్తిస్తున్నారు. ఇదే విషయమై మంగళవారం ఎస్పీ, ఓఎస్‌డీ, వైద్యులు, డీఎంఅండ్‌హెచ్‌ఓ, డీసీహెచ్‌ఎస్, జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎమ్మార్వోలు, ఎంపీడీఓలతో కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇతర దేశాల నుంచి 321 మంది జిల్లాకు వచ్చారని వివరించారు. విజయనగరంలో అత్యధికంగా ఉన్నారని, తరువాత స్థానంలో సాలూరు, పార్వతీపురం, బొబ్బిలి, నెల్లిమర్ల ప్రాంతాల్లో ఉన్నట్లు వివరించారు.
డోర్ డెలివరీ
కూరగాయల మార్కెట్‌లో రద్దీని దృష్టిలో పెట్టుకుని పట్టణంలో కొంతమంది వ్యాపారులు ముందుకు వచ్చినట్లు డీఆర్‌ఓ కలెక్టర్‌కు వివరించారు. ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు ఇళ్లకే నిత్యవసర సరకులు పంపించే ఏర్పాట్లు చేయనున్నట్లు చెప్పారు. ఇందుకు సాధ్యాసాధ్యాలపై కలెక్టర్ ఎస్పీని అడిగి తెలుసుకున్నారు. తద్వారా వైరస్ వ్యాప్తికి అవకాశం ఉండదని ఆలోచన చేస్తున్నారు.
స్వీయ నియంత్రణ
జిల్లాలో 144 సెక్షన్ ప్రభావం గ్రామాలను తాకింది. కొన్ని గ్రామాల్లో ప్రవేశ ద్వారాల వద్ద బయట వారు రాకుండా అడ్డుగా చెక్ గేటు ఏర్పాటు చేసి మరీ స్వీయ నియంత్రణ పాటించారు. గ్రామంలోకి ఎవరినీ అనుమతించడం లేదు. అలాగే గ్రామాల నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా కూడా జాగ్రత్తలు పాటించారు. జియ్యమ్మవలస, సాలూరు, ఎస్.కోట మండలాల్లోని గ్రామాల్లో ఈ పరిస్థితి కన్పించింది.