విధుల్లో అప్రమత్తంగా ఉండండి

ABN , First Publish Date - 2020-06-11T09:40:17+05:30 IST

కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు విధులు నిర్వహిస్తున్న సమయంలో పోలీసు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ..

విధుల్లో అప్రమత్తంగా ఉండండి

ఎస్పీ రాజకుమారి 


విజయనగరం క్రైం, జూన్‌ 10: కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు విధులు నిర్వహిస్తున్న సమయంలో పోలీసు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని.. స్వీయ నియంత్రణ, క్రమశిక్షణ.. పరిశుభ్రత పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఎస్పీ రాజకుమారి సూచించారు. ఆరోగ్య పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా పోలీసు కార్యాలయంలో  అధికారులు, సిబ్బందికి బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. కరోనా వైరస్‌ ఊపిరితిత్తులు, కిడ్నీ, కాలేయం, మధుమేహం, ఆస్తమా వ్యాధులతో బాధపడుతున్న వారిపై ఎక్కువ ప్రభావం చూపిస్తోందన్నారు. ఈ వ్యాధులతో బాధపడుతున్న వారు ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ వహించాలని చెప్పారు. ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. పౌష్టికాహారం తీసుకుంటూ వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవాలని, తద్వారా  కరోనా వైరస్‌ బారి నుంచి రక్షించుకోవచ్చునని సూచించారు.  55 ఏళ్లు పైబడి ఇతర వ్యాధులతో బాధపడుతున్న అధికారులు, సిబ్బందికి ఫీల్డ్‌ డ్యూటీల నుంచి మినహాయిస్తున్నామని వెల్లడించారు.


పోలీసుస్టేషన్‌ బయట టెంట్లు ఏర్పాటు చేసి ఫిర్యాదుదారుల నుంచి ఫిర్యాదుల స్వీకరించే విధంగా భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా కేంద్రాసుపత్రి వైద్యులు డాక్టరు సీహెచ్‌ శ్రీకాంత్‌ మాట్లాడుతూ, పోలీసు అధికారులు, సిబ్బంది విధుల నుంచి ఇంటికి వెళ్లగానే నేరుగా ఇంట్లోకి ప్రవేశించకుండా వేడినీటితో స్నానం చేసి దుస్తులను శుభ్రపరుచుకోవాలన్నారు. ఇతర రకాల వ్యాధులతో బాధపడుతున్న వారిపై కరోనా వైరస్‌ ఎక్కువ ప్రభావం చూపతుందని, తరచూ వైద్యుల సలహా మేరకు మందులు వాడి వ్యాధిని నియంత్రణలో ఉంచుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏఆర్‌ డీఎస్పీ శేషాద్రి, సీఐలు వెంకట అప్పారావు, రాంబాబు, ఆర్‌ఐ శ్రీహరి, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2020-06-11T09:40:17+05:30 IST