గెడ్డ మీద ఒట్టు... ఇదో కనికట్టు!

ABN , First Publish Date - 2020-12-18T04:15:57+05:30 IST

భూ కబ్జా రాయుళ్లు రాటుదేలిపోయారు. గెడ్డలను ఆక్రమించి.. అధికారులను మచ్చిక చేసుకుని దందా సాగిస్తున్నారు. విజయనగరంలో గెడ్డ(కొండ) పోరంబోకుగా రెవెన్యూ రికార్డుల్లో నమోదై ఉన్న స్థలాలను సైతం కబ్జా చేస్తున్నారు. పక్కనే ఉన్న జిరాయితీ సర్వేనెంబర్‌ పేరుతో కబ్జాకు తెగబడుతున్నారు.

గెడ్డ మీద ఒట్టు... ఇదో కనికట్టు!
గెడ్డను చదును చేసిన దృశ్యం

జిరాయితీ పేరిట...గెడ్డ ఆక్రమణ

గుట్టుగా చదును చేస్తున్న వైనం.. 

నిందితులకు రెవెన్యూ అధికారుల సహకారం

కలెక్టర్‌ను తప్పుదోవ పట్టిస్తున్న యంత్రాంగం 


భూ కబ్జా రాయుళ్లు రాటుదేలిపోయారు. గెడ్డలను ఆక్రమించి.. అధికారులను మచ్చిక చేసుకుని దందా సాగిస్తున్నారు. విజయనగరంలో గెడ్డ(కొండ) పోరంబోకుగా రెవెన్యూ రికార్డుల్లో నమోదై ఉన్న స్థలాలను సైతం కబ్జా చేస్తున్నారు. పక్కనే ఉన్న జిరాయితీ సర్వేనెంబర్‌ పేరుతో కబ్జాకు తెగబడుతున్నారు. అడ్డుకోవాల్సిన రెవెన్యూ శాఖ పట్టించుకోవడం లేదు. తెరవెనుక అధికారులు సహకరిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 


(విజయనగరం- ఆంధ్రజ్యోతి)

విజయనగరం పట్టణంలో చెరువుల కబ్జా విషయాన్ని కంట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌(కాగ్‌) నొక్కి చెప్పినా రెవెన్యూ శాఖ అధికారులకు చీమకుట్టినట్లు కూడా లేదు. జమ్మునారాయణపురం-పూడికలపేట మధ్యనున్న గుంతాడగెడ్డలో చదును చేసిన విషయాన్ని ‘గెడ్డపై గద్దలు’ శీర్షికన ఈనెల 14న ‘ఆంధ్రజ్యోతి’ కథనం ప్రచురించింది. రియల్‌ ఎస్టేట్‌కు దారి కోసం గెడ్డలో రోడ్డు వేసేస్తున్న వైనాన్ని అందులో స్పష్టంచేసింది. గెడ్డ ప్రవహించే ప్రాంతాన్ని పూర్తిగా కప్పేసి రోడ్డుగా మార్చేస్తున్నా.. అది గెడ్డ ప్రాంతం కాదని... జిరాయితీ భూభాగంలోనే చదును చేస్తున్నారని రెవెన్యూ వర్గాలు పేర్కొంటుండం గమనార్హం. పక్కనే ఉన్న జిరాయితీ సర్వే నెంబర్‌లో వారు చదును చేస్తున్నారని.. ఈ మేరకు వీఆర్‌వో, సర్వేయర్‌ రాతపూర్వకంగా రిపోర్టు ఇచ్చారని ఓ రెవె న్యూ అధికారి చెబుతుండడం విస్మయపరుస్తోంది. జమ్ము నారాయణపురం-పూడికలపేట మధ్య గుంతాడగెడ్డ ప్రవహం కొండపోరంబోకు(గెడ్డ) భూమిగా రెవెన్యూ రికార్టుల్లో ఉంది. వర్షం పడితే చాలు ఈ వాగు నిండుగా ప్రవహిస్తుంటుంది. ప్రస్తుతం వర్షాలు లేకపోవడం...నీరు తక్కువగా ఉండడంతో గెడ్డను చదును చేసేస్తున్నారు.

ఇదీ కథ

 సర్వే నెంబరు 18లో 2.56 ఎకరాలు.. సర్వే నెంబరు 19లో 3.67 ఎకరాలు.. మొత్తంగా 6.23 ఎకరాలు కొండ బోరంబోకు భూమిగా ఉంది. అంటే ఇది ప్రభుత్వ భూమిగా రెవెన్యూ రికార్డుల్లో ఉంది. ఈ వాగును ఆనుకుని సర్వే నెంబరు 20లో 1.59 ఎకరాల భూమి జిరాయితీగా ఉంది. చదును చేస్తున్నది 20వ సర్వే నెంబరులో ఉందని సర్వేయర్‌, వీఆర్‌ఓలు తేల్చారని రెవెన్యూ అధికారి చెబుతున్నారు. అంటే సర్వే నెంబరు 18, 19లో ఉన్న 3.67 ఎకరాలు ఎక్కడున్నాయన్నది రెవెన్యూ శాఖ తేల్చాలి. సర్వే నెంబరు 20లో చదును చేస్తున్నట్లు దురాక్రమణదారులను వెనకేసుకు వస్తున్న రెవెన్యూ శాఖ... ప్రభుత్వ భూమి ఎక్కడన్నది ఎందుకు తేల్చడం లేదో తెలియరావటంలేదు. చదును చేస్తున్న భూమి ప్రభుత్వానిది కాదని తేల్చిన రెవెన్యూ శాఖ సుమారు రూ.7 కోట్ల విలువ చేసే కొండగెడ్డ పోరంబోకు భూమి ఎక్కడున్నది గుర్తించకుండా ఆక్రమణదారులకు సహకరించడం అన్యాయమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

భారీగా ఆక్రమణలు

జమ్ము నుంచి పూడికల పేట వెళ్లే బీటీ రోడ్డు మార్గం క్రాస్‌ చేస్తూ ప్రవహిస్తున్న గెడ్డపై కల్వర్టును పూర్వమే నిర్మించారు. కల్వర్టు తరువాత కూడా గెడ్డ స్పష్టంగా  కనిపిస్తోంది. చదును చేస్తున్న వైపు గెడ్డ ఎందుకు కనిపించడం లేదన్నది గుర్తించాలి. అటు వైపు గెడ్డ స్థలం ఏమైందో అధికారులు తేల్చడం లేదు. ఇదిలా ఉండగా... ఇదే గెడ్డ వద్ద రోడ్డు కోసం చదును చేస్తున్న ప్రాంతానికి పైన అనేక ఇటుక బట్టీలు వెలిశాయి. వీరంతా గెడ్డను చదును చేసి ఇటుక బట్టీలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ భూమి కోసం వెంపర్లాడుతున్న రెవెన్యూ అధికారులు కార్పొరేషన్‌ పరిధిలో కోట్లు విలువ చేసే భూములను కాపాడలేకపోతున్నారు. 

కలెక్టర్‌ ఆదేశించినా..

గెడ్డ కబ్జాపై దర్యాప్తు చేయాలని కలెక్టర్‌ ఆదేశించగా.. సర్వేయర్‌కు బాధ్యత అప్పగించి సర్వే నెంబరు 20గా తేల్చేశారు. మరి రోడ్డు క్రాసింగ్‌ వద్ద గెడ్డకు సంబంధించిన భూమి ఎంత వెడల్పులో ఉంది? హద్దులేమిటి? గెడ్డ విస్తీర్ణం మొత్తం సురక్షితేమేనా అన్నది ఎవరు తేల్చాలో తెలియడం లేదు. కలెక్టర్‌ ఆదేశాలు బుట్టదాఖలేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీఆర్‌ఓ ఇచ్చిన రిపోర్టును కలెక్టర్‌కు సమర్పిస్తే తమ బాధ్యత ముగిసినట్లేనా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. 

సర్వే నంబర్‌ 20లో ఉందని..

చదును చేస్తున్న భూమి సర్వే నెంబరు 20లో ఉందని వీఆర్‌ఓ, సర్వేయర్లు పరిశీలించి రిపోర్టు ఇచ్చారు. ప్రవాహ ప్రాంతమంతా గెడ్డకు సంబంధించిన భూమి అనుకోకూడదు. సర్వే నెంబర్‌ 18, 19లో గెడ్డకు సంబంధించిన 2.56, 3.67 ఎకరాల చొప్పు న కొండపోరంబోకు ప్రభుత్వ భూమిగా ఉంది. రోడ్డుకు సమీపంలో గెడ్డను ఆనుకొని సర్వే నెంబరు 20లో 1.59 ఎకరాల భూమి ఉంది. జిరాయితీ భూమిని చదును చేస్తున్నారని సర్వేయర్‌ రిపోర్టు ఇచ్చారు. దీనినే కలెక్టర్‌కు నివేదిస్తాం. అయితే నేను కూడా ఒకసారి పరిశీలిస్తాను.

                                                - ప్రభాకరరావు,  తహసీల్దార్‌

Updated Date - 2020-12-18T04:15:57+05:30 IST