రోడ్డెక్కిన చీటీల వివాదం

ABN , First Publish Date - 2020-12-08T05:13:23+05:30 IST

చీపురుపల్లి పట్టణంలోని జి.అగ్రహారంలో కొంత కాలంగా గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న చీటీల వివాదం సోమవారం రోడ్డెక్కింది.

రోడ్డెక్కిన చీటీల వివాదం
భాగ్యలక్ష్మి నివాసం ఎదుట బైఠాయించిన బాధితులు

నిర్వాహకురాలి ఇంటిముందు బాధితుల బైఠాయింపు

పోలీసుల, గ్రామ పెద్దల రంగ ప్రవేశం

చీపురుపల్లి, డిసెంబరు 7: చీపురుపల్లి పట్టణంలోని జి.అగ్రహారంలో కొంత కాలంగా గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న చీటీల వివాదం సోమవారం రోడ్డెక్కింది. నిర్వాహకురాలి నివాసం ఎదుట బాధితులంతా బైఠాయించారు. సమాచారం అందుకున్న పోలీసులు, గ్రామ పెద్దలు జోక్యం చేసుకోవడంతో సమస్య తాత్కాలింగా సద్దు మణగింది. బాధితులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

పట్టణంలోని జి.అగ్రహారానికి చెందిన డోల భాగ్యలక్ష్మి చీటీల కోసం పలు గ్రూపుల్ని ఏర్పాటు చేసి వాటిలో సభ్యుల్ని చేర్పించారు. అదే గ్రామానికి చెందిన సుమారు రెండొందల మంది మహిళలు వివిధ గ్రూపుల్లో సభ్యులను చేర్పించి నెలనెలా వాయిదాలు వసూలు చేసేవారు. ఈ క్రమంలో పాట ద్వారా చీటీ మొత్తాలను దక్కించుకున్న వారు కూడా వారి అసలు సొమ్మును భాగ్యలక్ష్మి మీద ఉన్న నమ్మకంతో తిరిగి ఆమెకే అప్పుగా ఇచ్చారు. బాధితుల కథనం ప్రకారం ఈ రకంగా సేకరించిన సుమారు కోటిన్నర నగదు భాగ్యలక్ష్మి వద్దే ఉంచారు. అయితే సభ్యులకు తిరిగి చెల్లించే సమయానికి భాగ్యలక్ష్మి చేతులత్తేయడంతో ఈ వ్యవహారం వివాదంగా మారింది. ఈ నేపథ్యంలో గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ కూడా జరిగింది. ఆ సమయంలో భాగ్యలక్ష్మి చీటీలు పొందిన వారు తనకు చెల్లించాల్సిన వాయిదాలు సక్రమంగా చెల్లించలేదని, తనకు తిరిగి వస్తే సభ్యులకు తాను చెల్లిస్తానని బదులిచ్చారు. దీని కోసం గత అక్టోబరు వరకూ గడువు కూడా కోరారు.  గడువు పూర్తయినప్పటికీ భాగ్యలక్ష్మి డబ్బు చెల్లించకపోవండతో బాధితులంతా సోమవారం నిర్వాహకురాలి నివాసం ఎదుట బైఠాయించారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ ఐ.దుర్గాప్రసాద్‌, ఏఎస్‌ఐ సురేష్‌, చిన్నారావులు సిబ్బందితో ఘటనా స్థలానికి వచ్చి ఇరువర్గాలతో మాట్లాడారు. తమకు రావాల్సిన సొమ్ము వసూలు చేసి.. చీటీలు కట్టిన వారికి బకాయిలు చెల్లించాలని భాగ్యలక్ష్మికి సూచించారు. ఎవరివ్వాల్సిన సొమ్ము వారికిచ్చి వివాదాన్ని పరిష్కరించుకోవాలని, లేని పక్షంలో చట్ట రీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. 

వసూలైతేనే చెల్లింపులు

తమకు సభ్యుల నుంచి సుమారు 40 లక్షల రూపాయలు వసూలు కావాల్సి ఉందని, ఈ మొత్తం అందగానే సభ్యులకు బాకీ పడిన మొత్తాన్ని చెల్లించగలనని భాగ్యలక్ష్మి స్పష్టం చేశారు. తాను ఒక్క రూపాయి కూడా అవినీతికి పాల్పడలేదన్నారు.

కోటిన్నరకు పైగా బకాయిలు

బాధితుల తరపున కొసిరెడ్డి రమణ, మండల ఆదినారాయణ మాట్లాడుతూ డోల భాగ్యలక్ష్మికి ఇతరుల నుంచి కేవలం రూ.40 లక్షలు మాత్రమే రావాలని, అయితే చీటీలు కట్టిన సభ్యులకు దాదాపు కోటిన్నర చెల్లించాల్సి ఉందన్నారు. ఈ తేడా మొత్తం ఎక్కడుందో తేలాల్సి ఉందన్నారు.


Updated Date - 2020-12-08T05:13:23+05:30 IST