ఊరట!

ABN , First Publish Date - 2020-03-28T07:00:00+05:30 IST

పంచాయతీలు ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కనున్నాయి. పారిశుద్ధ్యం తాగునీటి సమస్యలు కొంతమేరకు పరిష్కారం కానున్నాయి. ఈమేరకు

ఊరట!

14వ ఆర్థిక సంఘం నిధులు విడుదల 

త్వరలో 920 పంచాయతీల ఖాతాల్లో రూ.46.46 కోట్లు

కరోనా నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం

పారిశుధ్యం, తాగునీటి సమస్యలకు మోక్షం


(కొమరాడ)

 పంచాయతీలు ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కనున్నాయి. పారిశుద్ధ్యం తాగునీటి సమస్యలు కొంతమేరకు పరిష్కారం కానున్నాయి. ఈమేరకు 14వ ఆర్థిక సంఘం నిధులు విడుదలయ్యాయి. ఇది పంచాయతీలకు ఊరటనిస్తోంది. జిల్లాలో 920 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. పాలకవర్గాలు లేకపోవడంతో 14వ ఆర్థిక సంఘం నిధులు మంజూరు కాలేదు. దీంతో పంచాయతీలు పారిశుధ్య పనులు, విద్యుత్‌ దీపాలు ఏర్పాటు చేసుకోవడం వంటి వాటికి కూడా కష్టతరంగా మారింది. స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయి...పంచాయతీల పాలకవర్గాలు కొలువుదీరిన తరువాతే 14వ ఆర్థిక సంఘం నిధులు కేటాయించనున్నట్టు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో స్థానిక ఎన్నికలకు షెడ్యుల్‌ విడుదల చేశారు.


ఈ నేపథ్యంలో కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు ఎన్నికల ప్రక్రియను తాత్కాలికంగా వాయిదా వేశారు. దీంతో 14వ ఆర్థిక సంఘం నిధులు రావని అంతా భావించారు. కానీ కరోనా మహమ్మారిని జాతీయ విపత్తుగా ప్రకటించిన నేపథ్యంలో గ్రామాల్లో పారిశుధ్య పనులకు, తాగునీటి వసతులకుగాను అన్ని రాష్ట్రాలకూ ప్రభుత్వం 14వ ఆర్థిక సంఘం నిధులు కేటాయించింది. విజయనగరం జిల్లాకు సంబంధించి రూ. 46,46,65,800 అందించనున్నారు. 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన ఒక్కొక్కరికీ రూ. 218  చొప్పున ఈ నిధులు విడుదలయ్యాయి.


చిన్నపనులకూ కష్టం

చాలా పంచాయతీలు విద్యుత్‌ దీపాలు, తాగునీటి పథకాల నిర్వహణ, పారిశుధ్య పనులు చేయించుకోలేని స్థితిలో ఉన్నాయి. పన్నుల రూపంలో ఆదాయం కూడా అంతంతమాత్రమే. రాష్ట్ర ప్రభుత్వం నిధుల కేటాయింపు ఆశాజనకంగా లేదు. దీనికితోడు పాలకవర్గాలు లేవు. ప్రత్యేకాధికారుల పాలన నడుస్తోంది. మండల స్థాయి అధికారులను ప్రత్యేకాధికారులుగా  నియమించడంతో వారు పంచాయతీలపై దృష్టి పెట్టలేదు. దీంతో పాటు కొన్ని గ్రామాల్లో తాగునీటి ఎద్దడి నెలకొంది. రక్షిత మంచినీటి పథకాలు మూలకు చేరగా..పాడైన బోర్లు బాగుచేయడానికి నిధులు లేని పరిస్థితి. వీటన్నింటికీ 14వ ఆర్థిక సంఘం నిధులతో మోక్షం కలగనుంది. 


నిబందనలకు లోబడే వినియోగించాలి

నిధులు అందుబాటులో ఉన్నాయని ఏ అవసరానికి పడితే వాటికి ఖర్చు చేయడానికి వీల్లేదు. ప్రభుత్వ నిబందనల మేరకే నిధులను వినియోగించాల్సి ఉంటుంది. ముఖ్యంగా కరోనా వ్యాధి ప్రబలకుండా ఉండేందుకు గ్రామాల్లో యుద్ధప్రాతిపదికన పారిశుధ్య పనులు చేపట్టాల్సి ఉంది. వీటితో పాటు వీధి దీపాలు నిర్వహణ, విద్యుత్‌ బిల్లుల చెల్లింపులు ఈ నిధుల నుంచే ఖర్చు చేయాలి.

గౌరీశంకరరావు, ఎంపీడీవో, కొమరాడ

Updated Date - 2020-03-28T07:00:00+05:30 IST