అయ్యో...రామా!
ABN , First Publish Date - 2020-12-30T05:29:16+05:30 IST
ఉత్తరాంధ్రుల నుంచి నిత్యం పూజలు అందుకుంటూ... మరో భద్రాద్రిగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలో దారుణం చోటుచేసుకుంది. ఇక్కడి బోడికొండపై ఉన్న కోదండరాముని ఆలయంల స్వామి వారి విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు.
కోదండరాముని ఆలయంలో విగ్రహం ధ్వంసం
విగ్రహం తలను పట్టుకెళ్లిన దుండగులు
400 ఏళ్ల కిందట ఏర్పాటు చేసిన విగ్రహం
ఆందోళనలతో అట్టుడికిన రామతీర్థం
సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్‌పీ
వివిధ పార్టీల నాయకుల నిరసన
కొండపై బీజేపీ నాయకుల జాగరణ
ఉత్తరాంధ్రుల నుంచి నిత్యం పూజలు అందుకుంటూ... మరో భద్రాద్రిగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలో దారుణం చోటుచేసుకుంది. ఇక్కడి బోడికొండపై ఉన్న కోదండరాముని ఆలయంల స్వామి వారి విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. తలను వేరుచేసి ఎత్తుకెళ్లారు. ఈ విషయం మంగళవారం ఉదయం తెలుసుకున్న ప్రజలు నిర్ఘాంతపోయారు. వివిధ పార్టీల నాయకులంతా అక్కడికి చేరుకుని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ నాయకులు మంగళవారం రాత్రి వణికించే చలిలో సైతం కొండపైనే జాగారం చేశారు.
నెల్లిమర్ల, డిసెంబరు 29:
రామతీర్థంలోని బోడికొండపై సుమారు 400 ఏళ్ల కిందట ఏర్పాటు చేసిన రాముడి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. ఈ ఘటన జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. రెండో భద్రాద్రిగా పేరొందిన రామతీర్థం ఆలయంలో జరిగిన సంఘటనపై హిందూ సంఘాలతో పాటు వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. రామతీర్థంలోని శ్రీరామస్వామి దేవస్థానం పక్కనే సుమారు 800 అడుగుల ఎత్తులో బోడికొండపై కోదండరాముని ఆలయం ఉంది. ఈ ఆలయంలో సీతారామలక్ష్మణుల ధ్రువమూర్తులు ఉంటాయి. వీటికి దేవస్థానం అర్చకులు ప్రతిరోజు ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తారు. బోడికొండపైకి వెళ్లే భక్తులు సీతారాములను దర్శించుకుని పూజలు చేస్తుంటారు. విధుల్లో భాగంగా అర్చకుడు పాణంగిపల్లి వరప్రసాద్ మంగళవారం ఉదయం కొండపైకి వెళ్లేసరికి ఆలయ తలుపులకు తాళం లేకపోవడం.. కేవలం గడియ పెట్టి ఉండడాన్ని గమనించారు. సందేహంతో లోపలకు వెళ్లకుండానే దేవస్థానం అధికారులకు ఫోన్‌లో సమాచారం అందించారు. వారు నెల్లిమర్ల పోలీసులకు తెలిపారు. అందరూ కలసి కొండమీద ఆలయానికి చేరుకుని లోపల పరిస్థితులను పరిశీలించారు. శ్రీరామచంద్రస్వామి రాతి విగ్రహం తల తెగి ఉండడాన్ని గుర్తించారు. ఆ తల భాగాన్ని పరిసరాల్లో వెతికారు. ఎక్కడా ఆచూకీ లభించలేదు. పోలీస్ జాగిలాలు, క్లూస్ టీమ్ ప్రతినిధులు చేరుకుని ఆధారాల సేకరణ ప్రారంభించారు.
పరిశీలించిన ఎస్పీ
విగ్రహ ధ్వంసం విషయం తెలిసిన వెంటనే ఎస్‌పీ రాజకుమారి హుటాహుటిన బోడికొండపైకి చేరుకున్నారు. డీఎస్‌పీ అనిల్ కుమార్‌తో కలిసి ఆలయ లోపలి భాగాన్ని పరిశీలించారు. దేవస్థానం సిబ్బందితో మాట్లాడారు. దర్యాప్తునకు ప్రత్యేక పోలీస్ బృందం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం తహసీల్దార్ జి.రాము, డిప్యూటీ తహసీల్దార్ డి.శైలజ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.
ఆలయాలకు రక్షణ లేదు: టీడీపీ
ఈ ప్రభుత్వంలో ఆలయాలకు రక్షణ లేదని టీడీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు సువ్వాడ వనజాక్షి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్రోతు బంగార్రాజు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మహంతి చిన్నంనాయుడు, పతివాడ తమ్మినాయుడు, సువ్వాడ రవిశేఖర్ ఆందోళన వ్యక్తం చేశారు. విగ్రహ ధ్వంసంపై నిరసన తెలిపారు. బోడికొండపైకి చేరుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముఖ్యమంత్రితో పాటు దేవదాయ శాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
బీజేపీ జాగారం
రామతీర్థం ఘటనకు ప్రభుత్వం బాధ్యత వహించాలని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి పావని, నాయకులు నడికుదిటి ఈశ్వరరావు (ఎన్‌ఈఆర్), నారాయణరావు, పతివాడ రమణ, దంతినాడ అప్పలాచారి, కుసుమంచి సుబ్బారావు డిమాండ్ చేశారు. సాయంత్రం వరకు వీరంతా అక్కడే బైఠాయించారు. అనంతరం జాగరణకు దిగారు. వణికించే చలిలో సైతం నిరసన తెలియజేస్తున్నారు. నిందితులను పట్టుకునేంత వరకు కొండపైనే నిరసన కొనసాగుతుందని స్పష్టం చేశారు. సంఘటన దృష్ట్యా ఆలయం లోపలికి అనుమతించకపోవడంతో బయటే ఉండి వారు చలిలో నిరసన తెలియజేస్తున్నారు.
నిందితులను కఠినంగా శిక్షించాలి: శ్రీనివాసానంద సరస్వతి
రామతీర్థంలో శ్రీరాముని విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని రాష్ట్ర సాధు పరిషత్ అద్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి కోరారు. గత సంఘటనలకు సంబంధింఇ నిందితులను శిక్షించడంలో ప్రభుత్వం విఫలం కావడం వల్లనే ఈ దుర్ఘటన చోటుచేసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు.