కార్మికులకు భద్రత కల్పించండి

ABN , First Publish Date - 2020-12-27T05:28:34+05:30 IST

కార్పొరేషన్‌, మున్సిపాల్టీలు, గ్రామాల్లో పారిశుధ్య పనులు చేపట్టే కార్మికులకు రక్షణ... సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్‌ ఎం.హరిజవహర్‌లాల్‌ సూచించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లా విజిలెన్స కమిటీ సమావేశం శనివారం జరిగింది.

కార్మికులకు భద్రత  కల్పించండి
మాట్లాడుతున్న కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌

 విజిలెన్స కమిటీ సమావేశంలో కలెక్టర్‌ సూచన

విజయనగరం(ఆంధ్రజ్యోతి)/ కలెక్టరేట్‌, డిసెంబరు 26 : కార్పొరేషన్‌, మున్సిపాల్టీలు, గ్రామాల్లో పారిశుధ్య పనులు చేపట్టే కార్మికులకు రక్షణ... సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్‌ ఎం.హరిజవహర్‌లాల్‌ సూచించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లా విజిలెన్స కమిటీ సమావేశం శనివారం జరిగింది. కార్మికుల సంక్షేమం కోసం 2013లో భారత ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం అమలుపై కలెక్టర్‌ సమీక్షించారు.  పట్టణ, గ్రామాల్లో ఇంకా అక్కడక్కడా సఫాయి కార్మిక వ్యవస్థ ఉందని, దీనిని పూర్తిగా రూపుమాపేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. కార్మికులందరూ బీమా పథకంలో నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని.. ప్రమాదం జరిగితే వెంటనే ఆర్థిక సాయం అందేలా చూడాలని సూచించారు. వీలైనంతవరకు సెప్టిక్‌ ట్యాంకులు, కాలువలు, మ్యానహోల్స్‌ను శుభ్రం చేసేటప్పుడు యంత్రాలను వినియోగించేలా చూడాలని చెప్పారు. ప్రత్యేక టోల్‌ ఫ్రీ నెంబరు 14420ను ప్రాచుర్యంలోకి తీసుకొచ్చి తద్వారా సెప్టిక్‌ ట్యాంకు శుభ్రపరిచే యంత్రాలను, సిబ్బందిని అధికారులే నేరుగా పంపించే ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ సూచించారు. ఇలా చేయడం ద్వారా కార్మికులకు రక్షణ, భద్రత ఉంటుందన్నారు. సమావేశంలో జేసీ(ఆసరా) జె.వెంకటరావు, డీపీవో కె.సునీల్‌రాజ్‌కుమార్‌, ఆర్‌డబ్లూఎస్‌ ఎస్‌ఈ రవి తదితరులు పాల్గొన్నారు.

 త్వరగా భూ సేకరణ

జిల్లా నుంచి నిర్మిస్తున్న జాతీయ రహదారులకు అవసరమైన భూసేకరణను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ ఆదేశించారు. తన చాంబర్‌లో భూ సేకరణ, జాతీయ రహదారులు శాఖల అధికారులతో  శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. చెల్లూరు నుంచి గుంకలాం  బైపాస్‌, సాలూరు బైపాస్‌, రాయిపూర్‌ నుంచి విశాఖపట్టణం, గుమడ రైల్వే ఓవర్‌ బ్రిడ్జి తదితర పనులపై సమీక్షించారు. నోటిఫికేషన్‌ పూర్తయిన వెంటనే వాటికి అవార్డు పాస్‌ చేయాలని సూచించారు. జాతీయ రహదారుల శాఖ అధికారులు, భూసేకరణ అధికారులు సమన్వయంతో పని చేసి ఇబ్బందులుంటే వెంటనే పరిష్కరించుకోవాలని చెప్పారు. విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు, స్తంభాల తరలింపునకు అవసరమైన అంచనాలను వెంటనే పంపించాలని  సంబంధిత ఎస్‌ఈ విష్ణుకు సూచించారు. కార్యక్రమంలో జేసీ కిషోర్‌ కుమార్‌, సబ్‌ కలెక్టర్‌ విదేఖర్‌, ఆర్‌డీవో భవానీ శంకర్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-27T05:28:34+05:30 IST