రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువు
ABN , First Publish Date - 2020-12-07T05:18:13+05:30 IST
వైసీపీ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని టీడీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు సువ్వాడ వనజాక్షి, ప్రధాన కార్యదర్శి అనూరాధ బేగం అన్నారు.

పార్లమెంటరీ తెలుగు మహిళా అధ్యక్షురాలు వనజాక్షి
విజయనగరం రూరల్, డిసెంబరు 6: వైసీపీ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని టీడీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు సువ్వాడ వనజాక్షి, ప్రధాన కార్యదర్శి అనూరాధ బేగం అన్నారు. పూసపాటిరేగ మండలం గుంపాం గ్రామానికి చెందిన మహంతి అన్నపూర్ణ అనే మహిళపై అదే గ్రామానికి చెందిన వలంటీర్, ఆమె భర్త దాడి చేయడంపై వారు ఆగ్రహం వ్యక్తంచేశారు. జిల్లా కేంద్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత మహిళను ఆదివారం వారు పరామర్శించారు. వైసీపీ నాయకుల ప్రోద్బలంతోనే ఈ దాడి జరిగిందని ఆరోపించారు. దాడికి పాల్పడిన వారిని, వారిని ప్రేరేపించిన వైసీపీ నేతలపైన కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామాల్లో వలంటీర్లు అధికార పార్టీ నాయకుల అండతో పెచ్చుమీరుతున్నారని వారు విమర్శించారు. పోలీసులు నిస్పక్షపాతంగా వ్యవహరించి బాధితురాలికి న్యాయం చేయాలని వారు కోరారు.
బాధితురాలికి న్యాయం చేయండి
పూసపాటిరేగ: వలంటీర్ దాడిలో గాయపడిన మహిళకు న్యాయం చేయాలని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మహంతి చిన్నంనాయుడు డిమాండ్ చేశారు. గుంపాం గ్రామంలో ఆయన ఆదివారం విలేకర్లతో మాట్లాడారు. గ్రామంలోని మహంతి అన్నపూర్ణ అనే మహిళపై దాడిచేసిన గ్రామ వలంటీర్ కిలారి సంతోషి, ఆమె భర్తపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వంలో జరుగుతున్న ఇటువంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. నెల్లిమర్ల నియోజకవర్గ నాయకులు పతివాడ తమ్మినాయుడు మాట్లాడుతూ దీనిపై తగు చర్యలు తీసుకోకుంటే ఉద్యమిస్తామని తెలిపారు. సమావేశంలో జడ్పీటీసీ మాజీ సభ్యుడు ఆకిరి ప్రసాదరావు, నాయకులు మహంతి శంకరరావు, ఇజ్జురోతు ఈశ్వరరావు, కొత్తకోట రమణ, కొత్తకోట బాలకృష్ణ, గ్రామస్థులు పాల్గొన్నారు.