అనుమానం..‘సామాజిక’ భూతమై!

ABN , First Publish Date - 2020-03-27T11:17:04+05:30 IST

తెర్లాం మండలంలోని ఓ గ్రామానికి చెందిన..

అనుమానం..‘సామాజిక’ భూతమై!

బయటి నుంచి వస్తున్న వారికి ఇబ్బందులు

అపోహలతో దూరం పెడుతున్న స్థానికులు

సామాజిక మాధ్యమాల్లో పోస్టులు

అవగాహన లోపమే కారణం

అధికార యంత్రాంగం అప్రమత్తం కావాల్సిన తరుణం

 

(బొబ్బిలి/శృంగవరపుకోట): తెర్లాం మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువత విదేశాల్లో ఉద్యోగ, ఉపాధికి వెళ్లారు. వారంతా ఇంటి ముఖం పట్టగా స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వైద్య పరీక్షలు చేసుకున్న తరువాతే గ్రామంలోకి రావాలని తేల్చిచెప్పారు. దీంతో వారు స్వచ్ఛందంగా వెళ్లి వైద్య పరీక్షలు చేసుకున్నారు. కరోనా నెగిటివ్‌గా రావడంతో ఇళ్లకు చేరుకున్నారు.


వేపాడ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన యువకులు తెలంగాణాలో ఉపాధి పనులు చేస్తున్నారు. రెండురోజుల కిందట గ్రామాలకు చేరుకోగా స్థానికులు అడ్డుకున్నారు. వైద్య పరీక్షలు చేసుకున్న తరువాతే రావాలని పట్టుబట్టారు. దీంతో వారికి వైద్య పరీక్షలు చేయగా.. ఎటువంటి వైరస్‌ లక్షణాలు లేవని తేలాయి.


ఇలా స్వదేశం, విదేశం అని కాకుండా బయట ప్రాంతాల నుంచి స్వస్థలాలకు చేరుకుంటున్న వారికి చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. అవమానాలు, అనుమానపు చూపులతో బాధితులు ఇబ్బంది పడుతున్నారు. అప్రమత్తత అవసరమే కానీ.. మితిమీరిన అనుమానంతో బాధిత కుటుంబాలు బాధపడుతున్నాయి. ఇదే సమయంలో ఇతర ప్రాంతాల నుంచి స్వగ్రామాలకు చేరుకుంటున్న వారు కుదురుగా ఇంటి వద్ద ఉండడం లేదు. వారు 14 రోజులు స్వీయ గృహ నిర్బంధంలో ఉండాలి. కానీ వారు ఇష్టారాజ్యంగా బయట తిరుగుతున్నారు.  దీంతో స్థానికులు వైద్య ఆరోగ్య సిబ్బంది, పోలీసులతో వాదనకు దిగుతున్నారు. వారికి సర్ది చెప్పలేక  రెండు శాఖల సిబ్బంది అవస్థలు పడుతున్నారు. 


చిన్న రుగ్మతలు ఎదురైనా..

కరోనా వైరస్‌పై నిర్లక్ష్యంతో కొన్ని దేశాలు మూల్యం చెల్లించుకోగా.. మరికొన్ని దేశాలు ముందస్తు చర్యలతో వైరస్‌ వ్యాప్తిని నియంత్రించే పనిలో పడ్డాయి. ఉద్యోగ, ఉపాధి, ఉన్నత విద్య కోసం ఇతర దేశాలకు వెళ్లిన వారికి అక్కడి ప్రభుత్వాలు పంపిస్తుండడంతో...వారంతా స్వస్థలాలకు చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇతర ప్రాంతాల నుంచి సొంతూర్లకు చేరుకున్న వారికి స్థానికులు అనుమానపు చూపులు చూస్తున్నారు. దగ్గు, జలుబు వంటి చిన్నపాటి రుగ్మతలు వెలుగుచూసినా కరోనా అంటూ హడావుడి చేస్తూ అధికార యంత్రాంగానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. ముఖ్యంగా బొబ్బిలి నియోజకవర్గంలో వైరస్‌ బాధితులున్నట్టు సామాజిక మాధ్యమాల్లో ఇష్టారాజ్యంగా పోస్టులు పెడుతున్నారు. అధికార యంత్రాంగం మాత్రం అటువంటి పరిస్థితి లేదని నిర్ధారిస్తున్నా..కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు. 


అధికారులకు సహకరించాలి

కరోనా వైరస్‌ పేరిట పుకార్లను విడనాడాలి. సామాజిక దూరం పాటించడం ద్వారా వైరస్‌ వ్యాప్తిని నియంత్రించవచ్చు. ఇతర ప్రాంతాల నుంచి స్వస్థలాలకు వస్తున్న వారిపై అనుమానాపు చూపులు తగవు. వారి విషయంలో వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. కొందరు అతిగా వ్యవహరిస్తూ యంత్రాంగం విలువైన కాలాన్ని వృథా చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం మానుకోవాలి. 

- రమణకుమారి, డీఎంహెచ్‌వో, విజయనగరం


అపోహలు సృష్టిస్టే కఠిన చర్యలు

ప్రజలు స్వీయ గృహ నిర్బంధంలో ఉండాలి. సామాజిక దూరం ద్వారానే వైరస్‌ వ్యాప్తిని నియంత్రించవచ్చన్న విషయాన్ని గుర్తించాలి. అపోహలతో ఇరుగు పొరుగువారు, వీధిలో ఉన్నవారిపై దుష్ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. అనుమానంతో పక్కనున్న వారిపై ఫిర్యాదు చేయడం తగదు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని వైద్య ఆరోగ్య శాఖ పరీక్షలు చేస్తుంది. అటువంటి వారు 14 రోజుల పాటు స్వీయ గృహ నిర్బంధంలో ఉండాలి.

-ఇ.కేశవరావు, సీఐ, బొబ్బిలి

Updated Date - 2020-03-27T11:17:04+05:30 IST