ఇళ్ల స్థల యోగం

ABN , First Publish Date - 2020-06-18T11:30:54+05:30 IST

ఇళ్ల స్థలాల పంపిణీకి మరో 13,548 మంది లబ్ధిదారులను తాజాగా ఎంపిక చేశారు. వారందరికీ స్థలాలను గుర్తించే పనిలో రెవెన్యూ అధికారులు

ఇళ్ల స్థల యోగం

 మరింత మంది పేదలకు త్వరలో పంపిణీ

అదనంగా 13,500 మంది లబ్ధిదారుల ఎంపిక 

స్థలాలను గుర్తించే పనిలో రెవెన్యూ ఉద్యోగులు 

జూలై 8న పట్టాల పంపిణీకి సన్నద్ధం


కలెక్టరేట్‌, జూన్‌ 17: ఇళ్ల స్థలాల పంపిణీకి మరో 13,548 మంది లబ్ధిదారులను తాజాగా ఎంపిక చేశారు. వారందరికీ స్థలాలను గుర్తించే పనిలో రెవెన్యూ అధికారులు ఉన్నారు. జూలై 8న ఇళ్ల స్థలాలను పంపిణీ  చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఆ తేదీకి ఎలాంటి సమస్య లేకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సేకరించిన స్థలాలపై వివాదాలుంటే హుటాహుటిన కొత్తవి కొనుగోలు చేసి సిద్ధం చేస్తున్నారు. రెవెన్యూ అధికారులంతా ఇళ్ల స్థలాల ప్రక్రియలో నిమగ్నమయ్యారు. మొదటి విడతగా జిల్లాలో 56 వేల మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. వీరికోసం 1,810 ఎకరాలను గుర్తించి లేఅవుట్లు వేశారు. చాలా పంచాయతీల్లో లబ్ధిదారులకు లాటరీ ద్వారా స్థలాలను ఎంపిక చేశారు.


అనంతరం వారికి కేటాయించిన స్థలాల వద్ద లబ్ధిదారులకు ఫొటోలు తీసి ఆన్‌లైన్‌ చేశారు. మార్చిలో ఉగాది రోజున ఇళ్ల స్థలాల పంపిణీకి ప్రభుత్వం నిర్ణయించింది. అంతలో స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్‌ రావడంతో వాయిదా పడింది. ఆ తర్వాత కరోనా వ్యాప్తి నివారణకు కేంద్రం లాక్‌డౌన్‌ ప్రకటించడంతో ఏప్రిల్‌లో కూడా పంపిణీకి అవకాశం లేకపోయింది. దీంతో చేసేదిలేక ప్రభుత్వం చివరిగా జూలై 8న చేపట్టాలని నిర్ణయించింది. ఇంకా అర్హులు ఉండిపోతే వారికి కూడా స్థలాలు ఇవ్వాలని యోచించి అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. ఆ మేరకు గ్రామాల్లో ఎవరైనా అర్హులుంటే ఇళ్ల స్థలాలకు దరఖాస్తు చేసుకోవాలని గత నెలలో అధికారులు ప్రకటించారు.  అనంతరం వచ్చిన దరఖాస్తుల్లో 13,548 మందిని ఎంపిక చేశారు. వీరందరికీ స్థలాలు ఇవ్వాలంటే 292 ఎకరాలు అవసరం ఉంటుందని అధికారులు నిర్ధారించారు. భూములు గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. లేవుట్లలో మొక్కలను వేయాలని, ఉపాధి హామీ పథకం ద్వారా ఆ పనులు చేయాలని అధికారులకు గతంలోనే  కలెక్టర్‌ సూచించారు. విద్యుత్‌ సదుపాయం కల్పించాలని కూడా చెప్పారు. 


రెండు రోజుల్లో  పనులు పూర్తి చేయాలి

జిల్లాలో పేదల కోసం సేకరించిన ఇళ్ల స్థలాల్లో రెండు రోజుల్లో లేఅవుట్‌ పనులు పూర్తి చేయాలని కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ బుధవారం ఆదేశించారు. మండల స్థాయి అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ తహసీల్దార్లు అందరూ లేఆవుట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. గ్రామ సచివాలయాలు, విలేజ్‌ క్లినిక్‌లు, రైతు భరోసా కేంద్రాలకు స్థలాలు గురించాలని కూడా చెప్పారు. కార్యక్రమంలో జేసీలు కిషోర్‌, మహేష్‌ కుమార్‌ రవిలాల,ఆర్‌.కూర్మనాథ్‌, వ్యవసాయ శాఖ జేడీ  ఆశాదేవి, డీపీవో సునీల్‌ రాజకుమార్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - 2020-06-18T11:30:54+05:30 IST