పేదో ‘డి’పట్టా...వారికే!
ABN , First Publish Date - 2021-01-01T04:57:14+05:30 IST
ప్రభుత్వం తాజాగా చేపడుతున్న సమగ్ర భూముల సర్వే కార్యక్రమం అక్రమార్కుల గుండెల్లో వణుకు పుట్టిస్తోంది. సర్వే ద్వారా అసలు భూ యజమానుల పేర్లు బయటపడి అక్రమాలు బహిర్గతం అవుతాయని భయపడుతున్నారు.
సర్వేతో భూ ఆక్రమణదారుల్లో వణుకు
చేతులు మారిన డీపట్టా భూములు
దేవదాయ భూములూ అన్యాక్రాంతం
సర్వేతో బట్టబయలవుతుందని భయం
(విజయనగరం-ఆంధ్రజ్యోతి)
ప్రభుత్వం తాజాగా చేపడుతున్న సమగ్ర భూముల సర్వే కార్యక్రమం అక్రమార్కుల గుండెల్లో వణుకు పుట్టిస్తోంది. సర్వే ద్వారా అసలు భూ యజమానుల పేర్లు బయటపడి అక్రమాలు బహిర్గతం అవుతాయని భయపడుతున్నారు. ప్రధానంగా డీపట్టా, దేవదాయ భూముల కబ్జాదారుల ఆగడాలకు చెక్ పడే అవకాశం ఉంది. ప్రభుత్వం సర్వే కోసం ఏర్పాట్లు పూర్తిచేసింది. ప్రత్యేక స్టేషన్లను కూడా ఏర్పాటు చేసింది. శుక్రవారం నుంచే సర్వే ప్రారంభం కానుంది. డీపట్టా భూములను కొనుగోలు చేయకూడదని తెలిసినా అనేక మంది వారిని మభ్యపెట్టి కొనుగోలు చేసి అనధికారికంగా అనుభవిస్తున్నారు. ప్రభుత్వం ఖచ్చితంగా వ్యవహరించే పక్షంలో డీ పట్టా పొందిన భూమిపై అమ్మకందారుకే హక్కులు ఇవ్వాల్సి ఉంటుంది. గతంలో భూ యజమానిగా ఉన్న డి పట్టాదారుని పేరుతోనే స్థిరీకరణ చేయాల్సి ఉంటుంది. జిల్లాలో వేలాది ఎకరాల డీపట్టా భూములను సంబంధిత పట్టాదారు నుంచి కొనుగోలు చేసి పురోనీ పేరుతో నోట్లు మాత్రమే రాయించుకున్న పరిస్థితి ఉంది. కొంతమంది మాత్రం రెవెన్యూ శాఖ అధికారుల చేతులు తడిపి తమ కుటుంబంలోని వారి పేరున డీపట్టా మార్పించుకున్నారు. పురోనీ పేరుతో కొనుగోలు చేసిన వారే అధికం. కొందరు ఎటువంటి రాత పూర్వక ఆధారం లేకుండా కొనుగోలు చేసిన వారూ ఉన్నారు. ఇంకో వింత పరిస్థితి కూడా ఉంది. డీపట్టా భూములను కొనుగోలు చేసి 100 ఏళ్లకు లీజు రూపంలో రాయించుకున్న ఘనులూ ఉన్నారు. ఇటువంటి వారు సాలూరు, మక్కువ, పాచిపెంట, మెంటాడ, భోగాపురం, డెంకాడ తదితర మండలాల్లో ఉన్నారు. డీపట్టా భూములు కొనుగోలు చేసి వాటిని తమ కుటుంబ సభ్యుల పేరున అదే క్లాసిఫికేషన్(డి పట్టా) రూపంలో మార్పించుకున్న వారు మాత్రం ప్రశాంతం. మిగిలిన పద్ధతులను అశ్రయించిన వారు ఇబ్బందులు ఎదుర్కొనాల్సి రావచ్చు. డి పట్టాదారు దశాబ్దాల కిందటే అమ్మకం చేసినా మళ్లీ వారి పేరునే డి పట్టా రూపంలో రీ సర్వేలో గుర్తించే పరిస్థితి ఉంటుంది. దీంతో సంబంధిత వర్గాల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 25,200 ఎకరాల్లో డి పట్డా భూములున్నాయి. ఇందులో సగానికి సగం చేతులు మారిపోయాయి.
దేవదాయ భూములకు...
రీ సర్వే ద్వారా తమకు లాభం చేకూరుతుందని దేవదాయ శాఖ ఆశగా ఉంది. ఈ శాఖ పరిధిలోని అనేక భూములు అన్యాక్రాంతమయ్యాయి. కొన్ని చోట్ల పెత్తందారుల చేతుల్లోనూ చిక్కుకున్నాయి. కొంతమంది లీజుల పేరుతో స్వాధీనం చేసుకుని ఏళ్ల తరబడి అనుభవిస్తూ దేవదాయ శాఖకు చిల్లిగవ్వ ఇవ్వకుండా ఉన్నారు. ఈవిధంగా ఎన్నాళ్ల నుంచో అక్రమణదారుల కబంధ హస్తాల్లో చిక్కుకున్న దేవదాయ శాఖ భూములకు సమగ్ర సర్వే ద్వారా విముక్తి కలుగుతుందని ఎదురు చూస్తున్నారు. విజయనగరం, పార్వతీపురం, సాలూరు, శంబర, మక్కువ, కొమరాడ ఇలా ఏ మండలంలో చూసుకున్నా దేవదాయ శాఖకు చెందిన భూములు ఇతరుల చేతుల్లో అధికంగానే ఉన్నాయి. సమగ్ర భూ సర్వే ద్వారా తమకు భూములు తిరిగి బదిలీ అవుతాయనే అభిప్రాయంతో వారు ఉన్నారు.