స్వచ్ఛత ఏదీ?

ABN , First Publish Date - 2020-03-25T11:38:03+05:30 IST

వ్యక్తిగత, సామాజిక స్వచ్ఛతే దేశానికి శ్రీరామ రక్ష అని ప్రధాని మోదీ చెబుతున్నారు.

స్వచ్ఛత ఏదీ?

జిల్లాలో పడకేసిన పారిశుధ్యం 

గ్రామాల్లో ఫినాయిల్‌, బ్లీచింగ్‌కు దిక్కులేదు

ఏడాదిగా పట్టించుకోని ప్రభుత్వం

నిధులు లేక చేతులెత్తేసిన కార్యదర్శులు

ఇంటి పన్నులతో చేపట్టవచ్చునని అధికారుల సలహా

కరోనా నేపథ్యంలో నిధులివ్వాలంటున్న ప్రజలు


పరిసరాల శుభ్రతకు.. స్వచ్ఛతకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నుంచి ఉన్నతాధికారుల వరకు చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. గ్రామాల్లో పారిశుధ్య పనులు చేపట్టడానికి నిధులు లేవని కార్యదర్శులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కనీసం ఫినాయిల్‌ స్ర్పే చేయాలన్నా.. బ్లీచింగ్‌ చల్లాలన్నా డబ్బుల్లేవంటున్నారు.  కొందరు ఉన్నతాధికారులు మాత్రం ఇంటి పన్నులతో పనులు చేయాలని సలహా ఇస్తున్నారు. కానీ ఇది అంత సులువైన పని కాదు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కనీస స్థాయిలో నిధులివ్వాలని ప్రజలు కోరుతున్నారు. 


మెంటాడ, మార్చి 24: వ్యక్తిగత, సామాజిక స్వచ్ఛతే దేశానికి శ్రీరామ రక్ష అని ప్రధాని మోదీ చెబుతున్నారు. శుభ్రతను ప్రతి ఒక్కరూ పాటించాలని అధికారులు సూచనలు ఇస్తున్నారు. వ్యక్తిగతంగా ఎవరికి వారు శుచిగా ఉన్నప్పటికీ సామాజికంగా పరిశుభ్రత రావాలంటే అధికారుల చర్యలు కీలకం. ప్రధానంగా గ్రామాల్లో ప్రతిరోజూ పారిశుధ్యాన్ని సమగ్రంగా చేపట్టాలి. నిధులు లేక ఏ పనీ పూర్తిస్థాయిలో జరగడం లేదు. పరిసరాలు దుర్గంధంగా ఉంటున్నాయి. దుర్వాసన వస్తుండడంతో చుట్టుపక్కల ఇళ్ల వారు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా పంచాయతీల్లో పారిశుధ్య పనులు చేపట్టి సుమారు ఎనిమిది నెలలు అవుతోంది.


ఎక్కడి చెత్త అక్కడే నిల్వ ఉండిపోతోంది. వీధులు డంపింగ్‌యార్డుల్లా మారుతున్నాయి. రెండడుగుల మందం మేర చెత్తపై రాకపోకలు సాగించాల్సిన దుస్థితి అక్కడక్కడ కనిపిస్తోంది. డ్రైనేజీలు పూడుకుపోయాయి. మురుగునీరు రోడ్లపైకి వస్తోంది. మొత్తంగా గ్రామీణ ప్రాంతాలు అస్తవ్యస్తంగా కనిపిస్తున్నాయి. 2018 ఆగష్టు 2తో నాటి సర్పంచ్‌ల పదవీకాలం ముగిసింది. అప్పటి నుంచి పంచాయతీ కార్యదర్శులను ఇన్‌చార్జిలుగా ప్రభుత్వం నియమించింది. కొన్నాళ్ల పాటు గుడ్డిలో మెల్ల చందాన అంతో ఇంతో పారిశుధ్య పనులు జరిగేవి. క్రమక్రమంగా వారు కూడా చేతులెత్తేశారు. కొత్త ప్రభుత్వం వచ్చాక ఈ పది నెలల్లో  గ్రామాల్లో కనీస స్థాయిలో పారిశుధ్య పనులు జరిగిన దాఖలాలు లేవు. అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. ఇదేమని అధికారులను అడిగితే ఆ బాధ్యత పంచాయతీ కార్యదర్శులదేనని చెప్పుకొస్తున్నారు. వారినడిగితే నిధులు లేకుండా పనులెలా అని లోగుట్టును భయటపెడుతున్నారు. మళ్లీ ఇదే మాటను అధికారుల వద్ద ప్రస్తావిస్తే ఇంటిపన్నులు వసూలు చేసి వాటితో పనులు చేపట్టాలని చెప్పామంటున్నారు.


ఇలా ఒకరిపై ఒకరు నెట్టుకుంటూ పారిశుధ్యాన్ని గాలికొదిలేస్తున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక పారిశుధ్యం కోసం జిల్లాకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. ఇక్కడి నుంచి ప్రతిపాదనలు వెళ్లేటప్పుడు ఇతర పద్దుల్లోంచి వాడుకోవాలంటూ సలహా మాత్రం ఇస్తున్నారు. మరో విశేషమేమంటే టీడీపీ ప్రభుత్వ హయాంలో పంచాయతీ సెక్రటరీలు కొనుగోలు చేసిన బ్లీచింగ్‌ పౌడర్‌, ఫినాయిల్‌ ఇంతవరకు దిక్కయ్యాయి. అవి అయిపోయాక ఆ ఊసే మర్చిపోయారు. ఇలా ఉండగా కరోనా మహమ్మారి విజృంభణ నేపధ్యంలో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. అక్కడక్కడ కరోనా అనుమానిత కేసులు నమోదవుతున్నాయి. ఇంకోవైపు అకాల వర్షాలతో గ్రామాల్లో పారిశుధ్యం మరింత దిగజారుతోంది. 


 మొత్తంగా జిల్లాలో అధ్వాన పరిస్థితులు నెలకొన్నాయి. జీతాల పెంపు లేక పారిశుధ్య కార్మికులు కూడా నిరాశతో పనిచేస్తున్నారు. గత ప్రభుత్వం స్వచ్ఛభారత్‌లో భాగంగా గ్రామాల్లో డంపింగ్‌ యార్డుల ఏర్పాటుకు ప్రాధాన్యమివ్వగా ఇప్పుడవి ఎక్కడున్నాయో తెలియని దుస్థితి.


 పంచాయితీలకు ఇటీవల మంజూరు చేసిన చెత్త తరలింపు బళ్ళు చాలాచోట్ల మూలకు చేరాయి.  మొత్తంమ్మీద ప్రస్తుతం నెలకొన్న అసాధారణ పరిస్థితుల్లో కూడా పారిశుధ్యంపై నిర్లక్ష్యం ప్రజల్లో ఆగ్రహాన్ని కలిగిస్తుంది.ఇకనైనా యంత్రాంగం మేలుకోవాల్సిన అవసరముంది. లేని పక్షంలో జరిగే అనర్ధాలకు ఎవరు బాధ్యత వహిస్తారన్న ప్రశ్నకు  అధికారులే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. 


ఇంటిపన్నులు వాడుకోవచ్చు:  ఇంఛార్జ్‌ డిపిఓ సునీల్‌ రాజ్‌కుమార్‌ 

నిధులు కొరత దృష్ట్యా ఇంటిపన్నులు వసూలు చేసి వాటితో (జనరల్‌ ఫండ్‌) పారిఽశుధ్య పనులు చేపట్టవచ్చునని పంచాయితీ కార్యదర్శులకు తెలిపాం. అవసరమైన చోట్ల స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించాలని సూచించాం. ప్రభుత్వం నుండి నిధులు విడుదల కాలేదు. ప్రభుత్వం నుండి పూర్తి స్థాయిలో విధులు విడుదలయ్యే వరకు గ్రామాల్లో పారిశుధ్య పనులు ఆగరాదని ఆదేశించాం. ఉదాసీనంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటాం.

Updated Date - 2020-03-25T11:38:03+05:30 IST