పెన్షన్‌.. టెన్షన్‌

ABN , First Publish Date - 2020-11-26T04:29:26+05:30 IST

సామాజిక పింఛన లబ్ధిదారుల ఏరివేతపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. గ్రామ, వార్డు వలంటీర్లు.. సచివాలయ ఉద్యోగుల ద్వారా డేటా సేకరించి... అనర్హులను ఏరివేయాలనుకుంటోంది. ఇందుకోసం రీ సర్వేకు ఆదేశించింది. వచ్చే నెలలో వందలాది పింఛనుదారులకు కోత వేసి...మిగిలిన వారికి మంజూరు చేసే అవకాశం కనిపిస్తోంది.

పెన్షన్‌.. టెన్షన్‌
పింఛనుదారులు

 పింఛన్ల తొలగింపునకు సన్నాహాలు

 వలంటీర్ల ద్వారా తాజాగా సర్వే

లబ్ధిదారుల్లో ఆందోళన 

సామాజిక పింఛన లబ్ధిదారుల ఏరివేతపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. గ్రామ, వార్డు వలంటీర్లు.. సచివాలయ ఉద్యోగుల ద్వారా డేటా సేకరించి... అనర్హులను ఏరివేయాలనుకుంటోంది. ఇందుకోసం రీ సర్వేకు ఆదేశించింది. వచ్చే నెలలో వందలాది పింఛనుదారులకు కోత వేసి...మిగిలిన వారికి మంజూరు చేసే అవకాశం కనిపిస్తోంది. దీంతో లబ్ధిదారుల్లో టెన్షన్‌ మొదలైంది. తమ పింఛను వస్తుందో...రాదోనని వారంతా ఆందోళన చెందుతున్నారు. 

(విజయనగరం- ఆంధ్రజ్యోతి)

సామాజిక పింఛన్లలో కోత తప్పదా? పెద్ద సంఖ్యలో లబ్ధిదారుల పేర్లు మాయం కాబోతున్నాయా? ‘అనర్హత’  పేరిట పింఛనుదారుల సంఖ్యకు కత్తెర పడబోతుందా? ప్రస్తుత పరిస్థితులను చూస్తే అవుననే సమాధానం వస్తోంది. ప్రతి అంశాన్నీ కూలంకషంగా క్షేత్ర స్థాయిలోనూ, సాంకేతిక పరిజ్ఞానంతోనూ పరిశీలించనున్నారు. ఏరివేతకు పూనుకునే పనిలో సిబ్బంది ఉన్నారు. ఈ ప్రక్రియ ప్రారంభం కాకముందే పింఛన్లపై వలంటీర్లు, సచివాలయ సిబ్బంది దృష్టి సారించారు. వలంటీర్లకు లక్ష్యాలు కూడా విధించారు. దీంతో వారు ఏమాత్రం అనర్హులుగా ఉన్నా  ముందునుంచే తొలగించే పని చేపట్టారు. ఇప్పటికే కొంత మంది పింఛన్లు తొలగించారు. 

గజపతినగరానికి చెందిన పి.లక్ష్మణరావు కంటి సంబంధిత సమస్యతో బాధ పడుతున్నాడు. దివ్యాంగ పింఛను పొందుతున్నాడు. ఆయనకు డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉన్నట్లు గుర్తించారు. ఎంతో కొంత చూపు ఉన్నా పింఛను పొందుతున్నట్లు భావించి డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఆధారంగా పింఛను తొలగించారు. దీంతో ఆయన లబోదిబోమంటున్నాడు. 

కొమరాడ మండలం గంగిరేయివలసకు చెందిన దొనక పార్వతమ్మకు 10 ఎకరాల పైబడి భూమి ఉంది. వాస్తవంగా ఈ భూమి ఆమె భర్త పేరున ఉంది. రేషను కార్డు అనుసంధానమై ఉన్న కారణంగా ఆన్‌లైన్‌లో పార్వతమ్మ భూమిగా  చూపుతోంది. దీంతో ఈ నెల నుంచే పింఛను తొలగించేశారు. 

ఒకే రేషను కార్డులోని ఇద్దరు పింఛన్లు పొందుతున్నా రెండో పెన్షన్‌ను తొలగిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో  వయసు, ఆదాయం వంటి నిబంధనలతో పింఛన్లు మంజూరుచేశారు. ఒక రేషను కార్డుకు... ఒక పింఛను విధానం తేవడంతో ఈవిధంగా కొంత మంది పింఛన్లు కోల్పోనున్నారు. 

గతంలో ప్రభుత్వం నవశకం సర్వే పేరుతో ఇంటింటి సర్వే చేపట్టింది. ఇందులో భాగంగా జిల్లాలో 21వేల పింఛన్లు తొలగించేశారు. దీంతో పెద్ద ఎత్తున ఫిర్యాదులు, విమర్శలు వచ్చాయి. విద్యుత్‌ బిల్లులు 300 యూనిట్లు వచ్చాయని.. తక్కువ భూమి ఉన్న వారికి 10 ఎకరాలకు మించి ఉందని, తక్కువ ఆదాయం ఉన్నా అర్హతకు మించి ఆదాయం వస్తోందని చూపుతూ అనేకమందిని తొలగించేశారు. వారంతా కార్యాలయాల చుట్టూ తిరిగి.. స్పందనలో ఫిర్యాదులు చేశారు. తీవ్ర ఆరోపణల తర్వాత తిరిగి అనేక మంది లబ్ధిదారుల పేర్లు పునరుద్ధరించారు. మరో వైపు కొన్ని కొత్తవి మంజూరు చేశారు. దీంతో అలజడి సద్దు మణిగింది. తాజాగా ప్రభుత్వం పింఛన్లపై రీ సర్వేకు ఆదేశించింది. ఇందులో భాగంగా జిల్లాలో 12వేల ఫించన్లు పైబడి రద్దయ్యే పరిస్థితి కనిపిస్తోంది. అనర్హుల జాబితాలను ఇప్పటికే మండల పరిషత్‌ అభివృద్ది అధికారి, మున్సిపల్‌ కమిషనర్ల లాగిన్లో డీఆర్‌డీఎ పొందుపర్చినట్లు సమాచారం. వలంటీర్లు, సచివాలయ సిబ్బంది రీ సర్వే తరువాత తొలగిపోయే అవకాశం ఉంది.

అనర్హుల గుర్తింపు ఇలా..

పింఛన్ల ఏరివేతలో మూడు అంశాలనే ప్రధానంగా పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఇటీవల కాలంలో ఆధార్‌ కార్డులో వయసు మార్పులు..చేర్పులు చేసి పింఛన్లు పొందిన వారు ఉన్నారు. వారిని గుర్తిస్తున్నారు. అలాగే ఒకే రేషన్‌కార్డులో ఇద్దరు పింఛన్లు అందుకుంటున్న వారిని ఆరా తీస్తున్నారు. ఇటువంటి వారు జిల్లాలో ఎక్కువ మంది ఉన్నట్లు సమాచారం. దీనికి కారణం ఇతర జిల్లాలకు, రాషా్ట్రలకు వెళ్లిన వారు అక్కడ రేషన్‌ కార్డులు పొందుతున్నారు. పింఛన్లు మాత్రం శాశ్వత నివాస ప్రాంతాల్లో ఉంటున్నాయి. మరోవైపు చాలా మంది రేషను కార్డును పింఛనుకు లింక్‌ చేయలేదు. ఇటువంటి వారిని గుర్తించి తొలగింపుల జాబితాలో చేర్చుతున్నారు. 

అనర్హులనే తొలగిస్తాం

పింఛన్ల ఏరివేత విషయాన్ని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పీడీ సుబ్బారావు వద్ద ప్రస్తావించగా అర్హులైన పింఛను లబ్ధిదారులు ధైర్యంగా ఉండవచ్చునన్నారు. ఆధార్‌లో వయసు మార్పు చేసినవారు.. రేషను కార్డును పింఛనుకు అనుసంధానం చేయని వారు... ఒకే రేషన్‌కార్డు ద్వారా కుటుంబంలో రెండు లేదా అంతకు మించి పింఛన్లు ఉన్న వారిని గుర్తిస్తున్నామన్నారు. అనర్హులను క్షేత్ర స్థాయిలోనూ, సాంకేతికంగానూ పరిశీలించాకే తొలగింపు ఉంటుందని చెప్పారు. తద్వారా మరికొంత మంది అర్హులకు పింఛన్లు అందించేందుకు అవకాశం ఉంటుందన్నారు. 


Read more