ప్రాణ స్నేహితుడు కోలుకొని తిరిగి వస్తాడనుకుని ఎదురు చూశారు.. కానీ..

ABN , First Publish Date - 2020-07-22T18:58:30+05:30 IST

తమ ప్రాణ స్నేహితుడి ప్రాణాలు కాపాడుకోవాలన్న..

ప్రాణ స్నేహితుడు కోలుకొని తిరిగి వస్తాడనుకుని ఎదురు చూశారు.. కానీ..

వారి ఆరాటం నిష్ఫలం.. ప్రాణ స్నేహితుడు దూరం!

రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడు మృతి

పెదఖండేపల్లిలో  విషాదం


శృంగవరపుకోట(విజయనగరం): తమ ప్రాణ స్నేహితుడి ప్రాణాలు కాపాడుకోవాలన్న వారి ఆశ నేరవేరలేదు. చికిత్స పొంది కోలుకొని తిరిగి వస్తాడనుకుని ఎదురుచూసిన వారికి నిరాశే ఎదురైంది. మండలంలోని పెదఖండేపల్లిలో చోటుచేసుకున్న విషాదం ఇది. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన టోంపల గౌరి అప్పారావు (29) అందరికి సుపరిచితుడు. తాను పేదరికంలో ఉన్నా ఎవరైనా ఆపదలో ఉన్నారని తెలిస్తే చాలు తన పనులను పక్కనపెట్టి వారి కష్టం తీర్చేందుకు ముందు నిలిచేవాడు. ఇలా.. అప్పారావు స్నేహితులతోపాటు, గ్రామస్థుల అభిమానం పొందాడు.


ఆయన శ్రీకాకుళంలోని ఒక ప్రైవేటు కంపెనీలో పనిచేస్తూ ఆ వచ్చిన జీతంతో  భార్య, తల్లి దండ్రులను పోషిస్తున్నాడు. అయితే కరోనా వచ్చాక ఆయనకు పని లేకుండా పోయింది. ఈ సమయంలో ఆయన బావ విశాఖలోని ఆసుపత్రిలో చేరారు. అయితే అతనికి అప్పారావు సపర్యలు చేశాడు. పెదఖండేపల్లినుంచి విశాఖకు బైక్‌పై రోజూ వెళ్తుండేవాడు. ఈక్రమంలో ఈనెల 5వతేదీన అప్పారావు స్వగ్రామానికి వస్తుండగా రోడ్డుప్రమాదం జరిగి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే విషయం తెలుసుకున్న స్నేహితులు హూటాహూటీన ఆయనను ఆసుపత్రిలో చేర్పించారు.


తమ స్నేహితుడిని కాపాడుకోవడానికి వైద్య ఖర్చులకు సోషల్‌ మీడియాను ఆశ్రయించారు. దీంతో దాతలు, స్నేహితులు, గ్రామస్ధులంతా రూ. 3 లక్షల వరకు పోగుచేసి అప్పారావుకు ప్రైవేట్‌ ఆసుపత్రిలో వైద్యం చేయించారు. అయినా, పరిస్థితి విషమించడంతో ఆయనను కేజీహెచ్‌లో చేర్పించారు. వైద్యం పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు. తమ ప్రాణ మిత్రుడు ప్రమాదం నుంచి కోలుకొని వస్తాడని ఎంతో ఆశతో చూసిన గ్రామస్థులు, స్నేహితులు విషాదంలో మునిగిపోయారు. అప్పారావు మృతదేహానికి అంత్య క్రియలను స్నేహితులే  దగ్గరుండి నిర్వహించారు. 16రోజులపాటు పడిన తమ ప్రయత్నాలేవీ ఫలించ లేదని వారు విచారం వ్యక్తంచేశారు.


Updated Date - 2020-07-22T18:58:30+05:30 IST