కొడుకే కాలయముడై..

ABN , First Publish Date - 2020-05-13T14:29:17+05:30 IST

బాధ్యతను గుర్తుచేసిన తండ్రి పట్ల కిరాతకంగా ప్రవర్తించాడు. ఆయన పాలిట..

కొడుకే కాలయముడై..

పార్వతీపురంలో తండ్రి హత్య

పోలీసుల అదుపులో నిందితుడు


పార్వతీపురం టౌన్(విజయనగరం): బాధ్యతను గుర్తుచేసిన తండ్రి పట్ల కిరాతకంగా ప్రవర్తించాడు. ఆయన పాలిట కాలయముడయ్యాడు. ఇంట్లో ఉన్న సన్నిరాయితో బలంగా మోది హతమార్చాడు. పార్వతీపురంలో మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనలో రాయిపిల్లి ఎండయ్య ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పార్వతీపురం పట్టణంలోని ఇందిరా కాలనీకి చెందిన రాయిపిల్లి ఎండయ్య (46) తోపుడు బండిపై కూరగాయలు అమ్ముతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. భార్య పద్మ ఐదేళ్ల కిందట చనిపోయింది. ఇంట్లో కుమారుడు కల్యాణ్‌, కుమార్తెలు శ్రావణి, మేఘనలు నివాసముంటున్నారు.


ఎప్పటిలాగే ఎండయ్య మంగళవారం ఉదయం కూరగాయలు అమ్మడానికి వెళ్లి మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఇంటికి చేరుకున్నాడు. భోజనం చేశాక కాసేపు విశ్రాంతి తీసుకోదల్చాడు. ఇంతలో అప్పుడే బయట నుంచి వచ్చిన కుమారుడు కల్యాణ్‌తో మాట్లాడుతూ ‘అల్లరి చిల్లరిగా తిరగొద్దని, కుటుంబాన్ని నువ్వే పోషించాలని’ మందలించాడు. ఆ మాటకే కోపోద్రిక్తుడైన కుమారుడు సమీపంలో ఉన్న సన్నిరాయితో తండ్రి తలపై మోదాడు. రెండుమూడు సార్లు కొట్టడంతో ఎండయ్య క్షణాల్లో ప్రాణాలు కోల్పోయాడు. ఆర్తనాదాలు విని ఇంట్లోకి వచ్చిన కుమార్తెలు శ్రావణి, మేఘనలు రక్తపు మడుగులో ఉన్న తండ్రిని చూసి అక్కడే కుప్పకూలారు. భోరున విలపించారు. ఇంతలో చుట్టు పక్కల వారంతా చేరుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఐదేళ్ల కిందట తల్లిని పోగొట్టుకున్న కుమార్తెలు..ఇప్పుడు తండ్రి దూరమవ్వడంతో ఆయన మృతదేహం వద్ద రోదించిన తీరును చూసి ప్రతి ఒక్కరూ కంటనీరు పెట్టారు.


పోలీసుల అదుపులో నిందితుడు

తండ్రిని చంపిన కల్యాణ్‌ను అదుపులోకి  తీసుకున్నట్లు ఏఎస్సీ బింధుమాధవ్‌ తెలిపారు. ఘటనా స్థలానికి వచ్చిన ఏఎస్పీ తొలుత సీఐ దారశరథి, ఎస్‌ఐ కళాధర్‌తో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ నిందితుడు కల్యాణ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

Read more