పైడితల్లీ.. పాహిమాం

ABN , First Publish Date - 2020-10-21T19:18:32+05:30 IST

పైడితల్లమ్మ ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. సిరిమానోత్సవం సమీపిస్తున్న కొద్దీ భక్తుల రద్దీ పెరుగుతోంది. తొలేళ్లు, సిరిమాను..

పైడితల్లీ.. పాహిమాం

అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు

కిలోమీటరు పొడవున క్యూ

సిరిమానోత్సవానికి ముందే మొక్కులు


విజయనగరం(ఆంధ్రజ్యోతి): పైడితల్లమ్మ ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. సిరిమానోత్సవం సమీపిస్తున్న కొద్దీ భక్తుల రద్దీ పెరుగుతోంది. తొలేళ్లు, సిరిమాను ఊరేగింపు రోజుల్లో ఎక్కువ మందికి ఆలయ ప్రవేశానికి అనుమతి లేదని అధికారులు ప్రకటిస్తున్నారు. ఈలోగా అమ్మవారిని దర్శించుకోవాలని భక్తులు క్యూ కడుతున్నారు. మంగళవారం కూడా అధిక సంఖ్యలో భక్తులు వచ్చారు. కిలోమీటరుపైగా బారులు తీరారు. ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ అనంతరం భక్తులకు దర్శనానికి అవకాశం కల్పించారు. 6 నుంచి 11 గంటల వరకూ, మధ్యాహ్నం 4 గంటల నుంచి రాత్రి ఎనిమిది వరకూ భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. రైల్వేస్టేషన్‌ రోడ్డులో ఉన్న వనంగుడి వద్ద కూడా భక్తుల కోలాహలం కనిపించింది. పైడిమాంబ సిరిమా నోత్సవానికి ముందు భక్తులు ముర్రాటలు సమర్పించడం ఆనవాయితీ. కరోనా నిబంధనల నేపథ్యంలో ఈ పర్యాయం కొన్ని వీధుల భక్తులు ముర్రాటలు ఇచ్చే కార్యక్రమాన్ని వాయిదా వేశా రు.


కొందరు మాత్రం ఆనవాయితీని అనుసరిస్తున్నారు. ఇప్పిలివీధి వాసులు ఇప్పటికే ముర్రాటలు సమర్పించగా.. నాగవంశం వీధి, సంతపేట, గొల్లవీధి, బూర్లుపేట, బీటీఆర్‌ కాలనీ, గాజులరేగ, జొన్నగుడ్డి, లంకా పట్టణంతో పాటు పలు ప్రాం తాల నుంచి భక్తులు మంగళవారం అధిక సంఖ్య లో వచ్చి పైడిమాంబకు ముర్రాటలు ఇచ్చారు.


పట్టు వస్త్రాలు అందజేయనున్న బొత్స

పైడితల్లమ్మ సిరిమానోత్సవానికి సంబంధించి ప్రభుత్వం తరపున మంత్రి బొత్స సత్యనారాయణ పట్టువస్త్రాలు అందజేయనున్నారు. ఈ మేరకు దేవదాయశాఖ ప్రత్యేక కమిషనర్‌ ఎం.గిరిజా శంకర్‌ మంగళవారం జీవో విడుదల చేశారు. ఈనెల 27న ఉదయం 8 నుంచి 9 గంటలలోపు బొత్స సత్యనారాయణ కుటుంబసమేతంగా పట్టువస్త్రాలు అందజేస్తారు.


పంపిణీలు నిషేధం:జేసీ వెంకటరావు

కలెక్ట్టరేట్: ఈ నెల 27న జరగనున్న పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం రోజున వాటర్‌ బాటిళ్లు, ఆహార పానీయాలు, ప్రసాదా ల పంపిణీని నిషేధించినట్లు జేసీ వెంకటరావు చెప్పారు. ఊరేగింపును ప్రత్యక్షంగా తిలకించేందుకు కూడా భక్తులకు అనుమతి లేదన్నారు. కలెక్టరేట్‌ ఆడిటోరియంలో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. కొవిడ్‌ ముప్పు ఇంకా పొంచి ఉందని, ఈ మహమ్మారి వ్యాప్తికి ఎటువంటి అవకాశం ఇవ్వకూడదన్న ఉద్దేశంతో సిరిమానోత్సవానికి భక్తుల ను అనుమతించడం లేదని చెప్పారు. సిరిమాను రథాన్ని, ఇతర రథాలను లాగేందుకు సంప్రదాయ భక్తులను, ఉత్సవ వారసులను, వలంటీర్లను ఎంపిక చేసి, వారికి మాత్రమే ప్రత్యేక పాస్‌లు మంజూరు చేస్తామన్నారు. కార్యక్రమంలో దేవదాయశాఖ అధి కారులు, మున్సిపల్‌ అధికారులు తదితరులు ఉన్నారు.


Updated Date - 2020-10-21T19:18:32+05:30 IST