కన్నుల పండువగా తెప్పోత్సవం
ABN , First Publish Date - 2020-11-04T04:24:51+05:30 IST
పైడిమాంబ తెప్పోత్సవం కన్నుల పండువగా సాగింది. ఈ కమనీయ దృశ్యాన్ని వీక్షించేందుకు విజయనగరం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. రైల్వే స్టేషన ప్రాంగణంతో పాటు పెద్ద చెరువు చుట్టూ భక్తులు చేరి తెప్పోత్సవాన్ని తిలకించారు.
హంస వాహనంలో పైడిమాంబ జల విహారం
విజయనగరం రూరల్, నవంబరు 3: పైడిమాంబ తెప్పోత్సవం కన్నుల పండువగా సాగింది. ఈ కమనీయ దృశ్యాన్ని వీక్షించేందుకు విజయనగరం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. రైల్వే స్టేషన ప్రాంగణంతో పాటు పెద్ద చెరువు చుట్టూ భక్తులు చేరి తెప్పోత్సవాన్ని తిలకించారు. జై పైడిమాంబ నామస్మరణతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. మేళతాళాలు.. వేదమంత్రోచ్ఛారణలనడుమ సాయంత్రం 5.30 గంటలకు రైల్వేస్టేషన వద్ద ఉన్న వనంగుడి నుంచి పైడిమాంబ ఉత్సవ విగ్రహంతో ఊరేగింపు ప్రారంభమైంది. పెద్ద చెరువు వద్దకు బయలుదేరారు. ఆలయ ఈవో జీవీఎస్ సుబ్రహ్మణ్యంతో పాటు అర్చకులు, సిబ్బంది వెంటరాగా అమ్మవారి విగ్రహాన్ని హంసవాహనంలోకి తీసుకెళ్లారు. సాయంత్రం 6 గంటల నుంచి 45 నిమిషాల పాటు పెద్ద చెరువులో మూడు పర్యాయాలు పైడిమాంబ జలవిహారం చేశారు. హంస వాహనానికి రంగు, రంగుల విద్యుత దీపాలు అమర్చడంతో పైడిమాంబ జలవిహారం భక్తులకు కనువిందు చేసింది.. ఆధ్యాత్మికత ఉట్టిపడింది.. కరోనా నిబంధనల నేపథ్యంలో భౌతిక దూరం పాటించారు. మాస్క్‌లను తప్పనిసరి చేశారు.. వనటౌన, టూటౌన సీఐలు మురళి, శ్రీనివాసరావుల పర్యవేక్షణలో పోలీసు సిబ్బంది బందోబస్తు విధులు నిర్వహించారు. అగ్నిమాపక, మత్స్యశాఖ, రెవెన్యూ అధికారులు కార్యక్రమానికి హాజరయ్యారు. పైడిమాంబ సిరిమానోత్సవంలో భాగంగా మంగళవారం జరిగిన తెప్పోత్సవానికి ముందు రైల్వే స్టేషన వనం గుడి వద్ద వేద పండితులు వేద సభను నిర్వహించారు. ఆలయ అర్చకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం పైడిమాంబకు స్నపన కార్యక్రమాన్ని నిర్వహించారు.
సిరిమానోత్సవ ఘట్టం ముగిసిన మరుసటి మంగళవారం కావడంతో చదురుగుడి వద్ద అమ్మవారిని భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. ఉదయం 4.45 గంటలకు సుప్రభాత సేవ అనంతరం ఆలయ అధికారులు, అర్చకులు భక్తులకు దర్శన అవకాశాన్ని కల్పించారు. 11 గంటల వరకూ భక్తులు అధిక సంఖ్యలో పైడిమాంబను దర్శించుకున్నారు. అదే విధంగా సాయంత్రం కూడా మొక్కుబడులు చెల్లించుకున్నారు.