మన జలం.. ఎంత భద్రం అంటూ.. జిల్లాలో చర్చనీయాంశమైన ఏలూరు ఘటన

ABN , First Publish Date - 2020-12-11T04:51:06+05:30 IST

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో వింతవ్యాధి ప్రబలి అనేక మంది ఆస్పత్రి పాలు కావడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నీటి కాలుష్యమే ఆ పరిస్థితికి కారణమని కొంతమంది వైద్యులు అభిప్రాయపడుతున్నారు.

మన జలం.. ఎంత భద్రం అంటూ.. జిల్లాలో చర్చనీయాంశమైన ఏలూరు ఘటన
విజయనగరం పట్టణంలో మురుగు కాల్వలోనే తాగునీటి పైపులైన్లు

మునిసిపాలిటీల్లో ఎప్పటికపుడు కలుషిత నీరు సరఫరా

మురుగు కాల్వల్లో నుంచి పైపులైన్లు

చర్యలు తీసుకోని అధికారులు


(విజయనగరం-ఆంధ్రజ్యోతి): పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో వింతవ్యాధి ప్రబలి అనేక మంది ఆస్పత్రి పాలు కావడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నీటి కాలుష్యమే ఆ పరిస్థితికి కారణమని కొంతమంది వైద్యులు అభిప్రాయపడుతున్నారు. అస్వస్థతకు కచ్చితమైన కారణాలు ఇంకా నిర్ధారణ కానప్పటికీ ఎలాంటి నీరు తాగుతున్నామన్న చర్చ అందరిలో జరుగుతోంది. మున్సిపాలిటీలు, పంచాయతీలు తాగునీటి సరఫరాలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అన్నది కూడా కొద్దిరోజులుగా జిల్లా ప్రజలు ఆరా తీస్తున్నారు. అయితే తాగునీరు కలుషితం అవుతున్న ఘటనలు ఎప్పటికప్పుడు చోటుచేసుకుంటున్నాయి. విజయనగరం నగరపాలక సంస్థ అనేకమార్లు కలుషిత నీరు సరఫరా చేసిన సంగతి విదితమే. ఒక్కోసారి డయేరియా బారిన పడి పలువురు ఆస్పత్రి పాలయ్యారు. మున్సిపాలిటీలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న సీడబ్ల్యూసీ పథకాల ద్వారా సరఫరా అవుతున్న తాగునీరు ఎంత భద్రం అన్నది సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. 


విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలోని తోటపాలెం ప్రాంతంలో సెప్టెంబరు నెలాంతంలో కలుషిత నీరు సరఫరా చేశారు. నీరు రంగు మారడాన్ని గుర్తించిన స్థానికులు వారం రోజుల పాటు తాగునీటికి కటకటలాడారు. స్నానానికి కూడా వినియోగించలేని నీళ్లు కొళాయి ద్వారా రావడం చూసి అప్పట్లో అందరూ నిర్ఘాంతపోయారు. దీనిపై మున్సిపల్‌ సిబ్బందికి ఫిర్యాదు చేయగా తాగునీటి పైపులైన్‌ ఓ చోట లీకు అవ్వడంతో కాల్వల్లోని మురుగునీరు చొరపడి సరఫరా అయిందని గుర్తించారు. పార్వతీపురం, బొబ్బిలి, సాలూరు మున్సిపాటీల్లో అనేక చోట్ల తాగునీటి పైపులైన్లు మురుగుకాల్వల్లో నుంచే ఉన్నాయి.


ఏదైనా జరిగినప్పుడే అధికారులు వచ్చి ఆ ప్రాంతంలో పైపులైన్‌ మార్చుతున్నారు. పార్వతీపురం మున్సిపాలిటీ 24వ వార్డు పరిధిలోని ప్రజలకు ఈనెల మొదటి వారంలో కలుషిత నీరు సరఫరా అయింది. పైపు లైన్‌ లీకులే దీనికి కారణంగా గుర్తించారు. లీకేజీని అరికట్టేందుకు మున్సిపల్‌ యంత్రాంగం జాప్యం చేయడంతో మహిళలు నిరసన తెలిపారు. పార్వతీపురం మున్సిపాలిటీకి నాగావళి నదిలో ఏర్పాటు చేసిన ఊటబావుల ద్వారా నీరు సరఫరా చేస్తున్నారు. ఈ క్రమంలో నిరంతరం జాగ్రత్తలు కూడా అవసరం. పైపులైన్‌ను ఎప్పటికప్పుడు పరిశీలించాలి. అదే జరగడం లేదు. నాలుగేళ్ల కిందట బొబ్బిలి మున్సిపాలిటీలో తాగునీరు నీరు కలుషితమైంది. పాత బొబ్బిలి, గొల్లపల్లి గ్రామాలకు వెళ్లే నీరు కలుషితం కావటంతో చాలా మంది అస్వస్థతకు గురై ఇబ్బంది పడ్డారు. ఇలా ప్రతిసారీ నీరు కలుషితం అవుతున్న ఘటనలు చూస్తూ ఉన్నాం. లీకేజీలను గుర్తించడం.. వాటిని యుద్ధప్రాతిపదికన నివారించి రక్షిత నీటిని అందించడంలో యంత్రాంగ నిరంతరం నిమఘ్నం కావాల్సి ఉంది. కాని సమస్య గుర్తించిన తరువాత కూడా వారం రోజుల వరకు లీకేజీలు నివారించే పనులు చేపట్టడంలేదు. కొన్ని చోట్ల రోడ్లు తవ్వేసి వారం రోజుల వరకు విడిచిపెట్టే పరిస్థితి కన్పిస్తోంది. ఇదిలా ఉండగా తాగునీటిని ఎప్పటికప్పుడు క్లోరినేషన్‌ చేసి అందించాలి. అలాగే తాగునీటి ట్యాంకులను కూడా శుభపరచాలి. ఈ ప్రక్రియ నిబంధనల ప్రకారం జరగటం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. 


కొత్తగా పైపులైన్లు వేసేందుకు చర్యలు

కలుషిత నీటి విషయాన్ని జిల్లా పబ్లిక్‌ హెల్త్‌ ఈఈ డాక్టర్‌ కిల్లాన దిలీప్‌ వద్ద ప్రస్తావించగా ఇటీవల కొన్ని చోట్ల పైపులైన్లు లీకేజీ అయిన మాట వాస్తమేనన్నారు. ఏడు చోట్ల మేజర్‌ లీకేజీలు, 14 చోట్ల మైనర్‌ లీకేజీలను గుర్తించి కట్టడి చేశామని చెప్పారు. ఎక్కడైనా సమస్య వస్తే సమాచారం అందిన వెంటనే పరిష్కరిస్తున్నామన్నారు. మురుగు కాల్వల వద్ద, కాలువ క్రాసింగుల వద్ద పైపు లైన్లు ఉన్నాయని,  ఇటువంటి వాటని క్షుణ్ణంగా గుర్తించి నివేదిక తయారు చేసినట్లు తెలిపారు. కొత్తగా పైపులైన్లు వేసేందుకు కూడా దశల వారీగా చర్యలు తీసుకుంటున్నామని ఈఈ వెళ్లడించారు. 


Updated Date - 2020-12-11T04:51:06+05:30 IST